అన్ని వైపులా నీళ్లు.. మధ్యలో పూలింగ్‌కు ఇవ్వని రైతు పొలం
ల్యాండ్ పూలింగ్‌కు భూములు ఇవ్వలేదని బాబు ప్రభుత్వం వేధింపులు
కొండవీటి వాగుకు గండికొట్టి రిజర్వాయర్‌లోకి నీళ్లు దీంతో కోతకు గురవుతున్న పొలాలు
రైతుల పొలాల చుట్టూ రిజర్వాయర్ కోసం తవ్వకాలు
పొలాల్లోకి వెళ్లకుండా రైతులకు అడ్డంకులు
పంటలు పండించుకోనీయకుండా అవాంతరాలు
కరెంటు స్తంభాలను లారీలతో ఢీకొట్టిస్తున్న వైనం
విద్యుత్ సరఫరా బంద్.. మోటార్లు చోరీ
భయపెట్టి పూలింగ్‌కు ఒప్పించడానికే ఇదంతా చేస్తున్నారని అన్నదాతల ఆవేదన
సాక్షి ప్రతినిధి, గుంటూరు/తాడేపల్లి రూరల్: ల్యాండ్ పూలింగ్‌కు భూములు ఇవ్వలేదని చంద్రబాబు ప్రభుత్వం రైతులను ఎన్ని విధాలుగా వేధించాలో అన్ని విధాలుగా వేధిస్తోంది. భూములు ఇవ్వలేదన్న ఆగ్రహంతో పలు రైతుల పొలాల చుట్టూ మూడువైపులా రిజర్వాయర్ తవ్వకాలు జరిపారు. దీంతో గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం పెనుమాక రైతులు పంట పండించుకునే పరిస్థితి లేకుండా అనేక ఇబ్బందులు పడుతున్నారు.
తాజాగా ఎటువంటి వరద రాకపోయినా కొండవీటి వాగు గట్లకు గండికొట్టి ఆ నీటిని రిజర్వాయర్‌లోకి వదిలేశారు. దీంతో ఈ నీరు రిజర్వాయర్‌లో ప్రవహించి ల్యాండ్ పూలింగ్‌కు ఇవ్వని రైతుల భూముల చుట్టూ చేరాయి. 15 అడుగుల లోతు ఉన్న రిజర్వాయర్ నిండిపోవడంతో పంట పొలాల నేల కోతకు గురై రిజర్వాయర్‌లో కలిసిపోతోంది. పలువురి రైతుల పొలాలు కూడా రిజర్వాయర్‌లో కలిసిపోయే పరిస్థితి ఏర్పడింది. రైతులను భయభ్రాంతులకు గురిచేసి, తన లక్ష్యాన్ని సాధించాలని ప్రభుత్వం భావిస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మూడు నెలల నుంచి ఇదే పరిస్థితి..
⇒ కొండవీటి వాగు రిజర్వాయర్ కోసం పంటపొలాలు ఇవ్వని రైతులను ప్రభుత్వం, అధికారులు మూడు నెలలుగా ఇదేవిధంగా వేధిస్తున్నారు. వాటిలో కొన్ని దారుణాలను చూస్తే...
⇒ మొదట లారీలతో పంటపొలాల్లో వున్న కరెంటు స్తంభాలను గుద్దించి, వైర్లు తెంచేశారు. మూడు నెలల నుండి విద్యుత్‌ను పునరుద్ధరించాలంటూ ఆ శాఖ అధికారుల చుట్టూ తిరిగినా ఎటువంటి చర్యలు తీసుకోలేదు.
⇒ రైతులు పంట పొలాలకు విద్యుత్ మోటార్లు బదులు ఆయిల్ మోటార్లు తీసుకువచ్చినా.. వాటినీ చోరీ చేశారు.
⇒ పంటపొలాల్లో ఉన్న విద్యుత్ బోర్లకు భూమిలోపల ఉన్న పైపులను పీకివేశారు. ఫిర్యాదు చేసినా పట్టించుకునే నాథుడే లేడు.
⇒ విద్యుత్ సరఫరా లేకపోవడంతో నీరురాక మునగ, అరటి తోటలు ఎండిపోయాయి.
⇒ పంటపొలాలకు దారులు లేకుండా చేయడం, ఉన్న దారులను తవ్వడం, 15 అడుగుల లోతులో పంట పొలాలకు ఆనించి గోతులు తీయడంతో మట్టి పెళ్లలు విరిగి ఆ పొలాల్లో పడడం వంటి చర్యలు రైతులను ఆవేదనకు గురిచేస్తున్నాయి.
⇒ పెనుమాక గ్రామంలో వెయ్యి కుటుంబాలకు తాగునీటి సరఫరాను అందజేసేందుకు పైపులైను ఏర్పాటు చేశారు. ఆ పైపులైన్లపై కూడా తరచూ మట్టిపెళ్లలు విరిగి పగిలిపోతున్నాయి. నెలకి కనీసం 15 రోజులు తాగునీరు అందక గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
పొలాలను పరిశీలించిన దొంతిరెడ్డి
సీఎం చంద్రబాబు కూడా రైతు కుటుంబం నుంచి వచ్చాననే విషయాన్ని మర్చిపోయి భూ దాహంతో రైతులను ఇబ్బంది పెట్టడం సరికాదని వైఎస్సార్‌సీపీ మంగళగిరి నియోజకవర్గ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి (డీవీఆర్) అన్నారు. రాజధాని గ్రామమైన పెనుమాకలో రిజర్వాయర్ గండ్లు తెంపివేయడంతో పూలింగ్‌కు ఇవ్వని పంటపొలాలను నీరు ముంచెత్తింది. ఈ ప్రాంతాన్ని ఆయన పరిశీలించారు.ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు.
దురుద్దేశంతో ప్రభుత్వం
ప్రభుత్వం దురుద్దేశంతో పనిచేస్తోంది. నిజంగా కొండవీటి వాగుకు గండిపడి రిజర్వాయర్‌లోకి నీళ్లువస్తే.. కృష్ణానది నుంచి కొండవీటి వాగుకు గేట్లు ఎత్తి నీళ్లు ఎందుకు వదిలారు. ఒకవైపు గండిపడితే రెండోవైపు గండి పెట్టాల్సిన అవసరం ఏముంది? – కళ్లం శ్రీకాంత్ రెడ్డి
భూమి ఇచ్చినా.. ప్రయోజనం ఏముంది?
భూములు ఇచ్చేంత వరకు నా ఇంటి చుట్టూ తిరిగారు. సీఆర్‌డీఏ అధికారులే మా ఇంటికి వచ్చి ఒప్పంద పత్రాన్ని తీసుకున్నారు. నెల రోజుల తర్వాత నా 2 ఎకరాలకు ప్లాట్లు కేటాయిస్తామన్నారు. వారు చెప్పి ఆరు నెలలు అవుతోంది. ఎన్నిసార్లు ఆఫీస్ చుట్టూ తిరిగినా ఫలితం లేదు. పైగా నా పొలంలో పంట పండించుకుంటుంటే రాత్రికి రాత్రి బోర్లు దొంగిలించారు. దానివల్ల పంట పూర్తిగా ఎండిపోయింది. – బండి వెంకట రెడ్డి
పంటలు ఎండిపోయాయి...
ఎకరంన్నర పొలంలో మునగతోట వేశాను. మరో ఎకరం 30 సెంట్లలో అరటి పంట వేశాను. రిజర్వాయర్‌ను పొలానికి ఆనించి తీయడంతో బోర్లు రావడం లేదు. కొండవీటి వాగు నుంచి నీళ్లు తీసుకుందామంటే పొలం చుట్టూ తవ్వేశారు. విద్యుత్ సరఫరా లేదు. చివరకు చేతికి వచ్చిన పంట ఎండిపోయి రూ.లక్షా50 వేలు నష్టం వచ్చింది. రైతులను నష్టపరిస్తే వారే భూములు ఇస్తారని ప్రభుత్వం ఆలోచిస్తోంది. మేమైతే ఎట్టి పరిస్థితుల్లో భూములు ఇవ్వం. – పోలిశెట్టి శ్రీనివాసరావు
ప్రభుత్వ పెద్దలు చెప్పడం వల్లే...
మూడు నెలల కిందట లారీ డ్రైవర్లు విద్యుత్ స్తంభాలను ఢీకొట్టడంతో ఒకేరోజు 10 స్తంభాలు పడిపోయాయి. విద్యుత్ స్తంభాలను పునరుద్ధరించి పంట పొలాలకు విద్యుత్ సరఫరా ఇవ్వడం లేదు. ప్రభుత్వ పెద్దలు చెప్పబట్టే ఇలా చేస్తున్నారు. – పోలిశెట్టి రామ్మోహన్


