టెండర్లు లేకుండానే గ్రామాల్లో ఆలయాల నిర్మాణానికి గ్రీన్‌సిగ్నల్
స్థానిక ప్రజా ప్రతినిధుల ద్వారా పనులు చేపట్టాలని సీఎం ఆదేశాలు
సాధారణంగా రూ.ఐదు లక్షలు దాటే ప్రతి పనీ టెండరు విధానంలోనే కాంట్రాక్ట్ ఇవ్వాలి
సర్పంచుల పదవీ కాలం ముగియడంతో ప్రస్తుతం పంచాయతీల్లో ప్రత్యేక అధికారుల పాలన
ఇదే అదునుగా టెండర్లు లేకుండా అటు నిధులు.. ఇటు భక్తులిచ్చే చందాల డబ్బుల స్వాహాకు రంగం సిద్ధం
మాజీ సీఎం వైఎస్ జగన్ హయాంలో 4,111 ఆలయాల పనులకు శ్రీకారం
పారదర్శకంగా టెండర్లు.. అర్హులకు నిర్మాణ బాధ్యతలు..
అధికారంలోకి రాగానే 1,724 ఆలయాల పనులను రద్దు చేసిన చంద్రబాబు సర్కార్
సాక్షి, అమరావతి: తిరుమల శ్రీవారి సొమ్ముతో అధికార పార్టీ నేతలకు లబ్ధి చేకూర్చేందుకు చంద్రబాబు సర్కారు సిద్ధమైంది. శ్రీవాణి ట్రస్టుకు చెందిన దాదాపు రూ.750 కోట్ల నిధులతో రాష్ట్రవ్యాప్తంగా నిర్మించ తలపెట్టిన 5,000 ఆలయాలు, భజన మందిరాల పనులను టెండర్‌తో సంబంధం లేకుండా టీడీపీ నేతలకు పంచి పెట్టాలని నిర్ణయించారు. ఈమేరకు ఏప్రిల్ 16న దేవదాయ శాఖపై నిర్వహించిన సమీక్షలో అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఐదు వేల ఆలయాలు, భజన మందిరాల నిర్మాణ పనులను స్థానిక ప్రజాప్రతినిధుల ద్వారా చేపట్టాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. దేవదాయ శాఖ నిబంధనల ప్రకారం రూ.5 లక్షలకు పైబడిన ప్రతి పనిని టెండరు విధానంలో చేపట్టాల్సి ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు. మరోవైపు గ్రామాల్లో సర్పంచుల పదవీ కాలం నెల రోజుల క్రితమే ముగిసిన నేపథ్యంలో పంచాయతీల్లో ప్రత్యేక అధికార పాలన కొనసాగుతున్న విషయం తెలిసిందే. టీడీపీ నేతల పర్యవేక్షణలో నిర్మాణ పనులు చేపట్టడమంటే అధికార యంత్రాంగాన్ని ప్రేక్షక పాత్రకు పరిమితం చేయడమేనని దేవదాయ శాఖ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. 
గత ప్రభుత్వం ఆమోదించిన ఆలయాల నిర్మాణాలను రద్దు చేసి..
శ్రీవాణి ట్రస్టు నిధులతో మత్య్సకార, బలహీన వర్గాల కాలనీల్లో పెద్ద ఎత్తున ఆలయాల నిర్మాణానికి మాజీ సీఎం వైఎస్ జగన్ హయాంలో శ్రీకారం చుట్టారు. గత ప్రభుత్వంలో రాష్ట్రవ్యాప్తంగా 4,111 ఆలయాల నిర్మాణాలకు పారదర్శకంగా టెండర్లు పిలిచి అనుమతులు మంజూరు చేయగా 622 గుడుల నిర్మాణం అప్పట్లోనే పూర్తయింది. 1,765 ఆలయాల నిర్మాణ పనులు పురోగతిలో ఉన్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికి మిగిలిన 1,724 ఆలయాల పనులు ప్రారంభ దశలో ఉన్నాయి. నిర్మాణాలు మొదలు కాని అన్ని ఆలయాల అనుమతులు రద్దు చేయాలని 2024 ఆగస్టు 27న దేవదాయశాఖపై నిర్వహించిన సమీక్షలో సీఎం చంద్రబాబు ఆదేశించారు. 
ఈమేరకు 2024 సెపె్టంబరులో దేవదాయ శాఖ అన్ని జిల్లాలకు సమాచారం ఇచ్చింది. దాదాపు ఏడాదిన్నర తర్వాత శ్రీవాణి నిధులతో ఆలయాల నిర్మాణానికి టీటీడీ పాలక మండలి బోర్డు ఇటీవల ఆమోదం తెలుపగా టెండర్ల విధానంలో కాకుండా అధికార పార్టీ నేతలకు కట్టబెట్టాలన్న నిర్ణయంపై దేవదాయ శాఖ వర్గాల్లో తీవ్ర చర్చ సాగుతోంది. మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం ఆలయాల నిర్మాణాలకు సంబంధించి ఒక్కో గుడికి వేర్వేరుగా టెండర్లు పిలిచి పూర్తి పారదర్శకంగా అర్హులకు పనులను అప్పగించిందని గుర్తు చేస్తున్నారు.
చందాలు పక్కదారి పట్టే ప్రమాదం..
ఆలయాల నిర్మాణ పనులకు స్థానిక అధికార పార్టీ నేతలకు అప్పగించడం అక్రమాలకు దారి తీస్తుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఆలయాల నిర్మాణానికి పెద్ద మొత్తంలో చందాలు ఇచ్చేందుకు భక్తులు, స్థానికులు ముందుకు వస్తుంటారు. అధికార పార్టీ నేతల పర్యవేక్షణలో పనులు చేపడితే చందాలు పక్కదారి పట్టే ప్రమాదం ఉందనే చర్చ జరుగుతోంది.


