ఖేల్‌ ఖతం | Chandrababu government sold off DSC sports quota jobs | Sakshi
Sakshi News home page

ఖేల్‌ ఖతం

May 25 2026 5:29 AM | Updated on May 25 2026 5:29 AM

Chandrababu government sold off DSC sports quota jobs

క్రీడా కోటా 3శాతం రిజర్వేషన్‌లో పోస్టుల భర్తీకి కచ్చితంగా ఆయాశాఖల పరీక్షల్లో అర్హత సాధించాలంటూ సవరించిన జీవో

డీఎస్సీ ముగిసింది.. క్రీడా కోటా పాలసీ మారింది! 

3 శాతం హారిజాంటల్‌ క్రీడా రిజర్వేషన్‌పై ప్రభుత్వం యూటర్న్‌

సాక్షి, అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా ‘డీఎస్సీ’ క్రీడా కోటా పోస్టుల భర్తీలో అవకతవకలు పెను ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు కట్టి మరీ అమ్మేసుకోవడం నిరుద్యోగ యువతలో అలజడి రేకెత్తిస్తోంది. ఏకంగా 421 పోస్టుల్లో 97 శాతం పోస్టులు భర్తీ చేయగా ఇందులో వంద పోస్టులూ నిజమైన అర్హులకు దక్కలేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

సాక్షాత్తూ ముఖ్యనేత బంధువు, శాప్‌ పాలకవర్గంలోని ఓ కీలక వ్యక్తిని మాస్టర్‌మైండ్‌గా ముందు పెట్టి సాగించిన దందా సాక్ష్యాలతో సహా బయటకొచ్చే సరికి ప్రభుత్వం ఉక్కిరిబిక్కిరవుతోంది. నిజమైన అర్హత కలిగిన క్రీడాకారులకు తీవ్ర అన్యాయం చేస్తూ ముడుపులు తీసుకుని క్రీడలంటే తెలియని వ్యక్తులకు పోస్టింగ్‌ ఆర్డర్లు జారీ చేయడం దుర్మార్గ పాలనకు అద్దం పడుతోంది. దీనికితోడు డీఎస్సీ ముగిసిన తరువాత తాజాగా క్రీడా పాలసీని సవరించడం అనుమానాలకు తావిస్తోంది.  

సర్టీఫికెట్‌ చాలదు.. పరీక్ష రాయాల్సిందే! 
ప్రభుత్వ క్రీడా విధానం 2024–29 ప్రకారం.. 3 శాతం హారిజాంటల్‌ రిజర్వేషన్‌ ద్వారా ప్రతిభగల క్రీడాకారులకు వారి సర్టీఫికెట్ల ఆధారంగా నేరుగా ప్రభుత్వ శాఖల్లో పోస్టింగ్‌ ఇవ్వాలని సర్కారు నిర్దేశించింది. దీని ప్రకారమే డీఎస్సీలో 421 పోస్టుల్లో 97శాతం పోస్టులను భర్తీ చేసింది. ఎటువంటి రాత పరీక్ష లేకుండా క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ, ఇతర స్థాయిల్లో సాధించిన పతకాలు, సర్టిఫికెట్ల ఆధారంగా నియామకాలు పూర్తిచేసింది. దీనిని అనువుగా చేసుకునే ముఖ్యనేత బంధువు, మాస్టర్‌మైండ్‌ పోస్టుకో రేటు పెట్టి ముడుపులు దండుకున్నారు.

అర్హులకు పోస్టులు దక్కకుండా చేశారు. ఇంత జరిగాక.. డీఎస్సీ అయిపోయిన తర్వాత ఇప్పుడు క్రీడాపాలసీ 2024–29ను చంద్రబాబు సర్కారు సవరించడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఇప్పుడు, 3శాతం హారిజంటల్‌ రిజర్వేషన్‌లో అభ్యర్థి కచ్చితంగా ఆయా శాఖల్లో పోస్టులకు నిర్వహించే రాతపరీక్షలో ఉత్తీర్ణత సాధిస్తేనే క్రీడా కోటాలో సర్టీఫికెట్లు పరిగణనలోకి తీసుకుని నియామకాలు చేపట్టనున్నట్టు సర్కారు ఉత్తర్వులు జారీ చేయడం గమనార్హం. అంటే, ఇక్కడ ఒక పథకం ప్రకారం మెగా డీఎస్సీలో పోస్టులను విచ్చలవిడిగా అమ్మేసుకుని, ఆ తంతు ముగిసిపోయిన తర్వాత తీరిగ్గా క్రీడా పాలసీని సవరించినట్టు స్పష్టంగా తెలుస్తోంది.  

ఎవరికిచ్చిన అభయం కోసం!! 
ఇదిలా ఉంటే రాత పరీక్షను తప్పనిసరి చేస్తూ క్రీడా కోటా పాలసీని సవరించిన సర్కారు శాప్‌లో గ్రేడ్‌–3 కోచ్‌ల నియామకానికి మాత్రం దీనిని వర్తింపజేయకపోవడం, ఇక్కడ పాత పద్ధతిలోనే సర్టీఫికెట్ల మెరిట్‌ ఆధారంగానే చేస్తుండటం గమనార్హం. డీఎస్సీ  క్రీడా కోటాలో తనకు అన్యాయం జరిగిందని న్యాయపోరాటానికి సిద్ధమైన అనంతపురానికి చెందిన ఓ ఫెన్సింగ్‌ క్రీడాకారిణిని బెదిరించి నిలువరించిన శాప్,, శాశ్వత కోచ్‌ల నియామకంలో కచ్చితంగా న్యాయం చేస్తా­మని హామీ ఇచ్చింది. దీనిని బట్టి డీఎస్సీలో మాస్టర్‌మైండ్‌ చేసిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు శాప్‌ కోచ్‌ల నియామకానికి రాతపరీక్ష అర్హతలు పెట్టలేదని స్పష్టమవుతోంది.

ఇలా వందల మంది పోస్టుల రాని క్రీడాకారులను మభ్యపెట్టినట్టు సమాచారం. ఇదిలా ఉంటే డీఎస్సీలో  రెండేళ్లకోసారి, అసలు ఎప్పుడు జరుగుతుందో తెలియని నేషనల్‌ గేమ్స్‌ను ముందు వరుసలో పెట్టి సీనియర్‌ నేషనల్స్‌ ప్రాధాన్యాన్ని వెనక్కి నెట్టేసింది. నేషనల్స్‌లో పాల్గొన్నట్లు సర్టీఫికెట్లు తెచ్చుకున్న వారికి రూ.15 లక్షల చొప్పున పోస్టులు అమ్మేశారు. వాస్తవానికి నేషనల్‌ గేమ్స్‌ అనేవి ఒక్కోసారి ఒక్కో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుంది. ఇందులో ఒక్కో క్రీడాంశంలో కేవలం టాప్‌–8 ఉండే రాష్ట్రాల జట్లు మాత్రమే పాల్గొంటాయి. ఏటా జరిగే సీనియర్‌ నేషనల్స్‌లో దేశం మొత్తం నుంచి ఆయా రాష్ట్రాల్లో వడపోసిన క్రీడాకారులు ప్రదర్శనకు వస్తారు. సీనియర్‌ నేషనల్స్‌లో నెగ్గుకురావడం చాలా కష్టం. అలాంటి సీనియర్‌ నేషనల్స్‌ను పక్కన పడేసి నేషనల్‌ గేమ్స్‌కు డీఎస్సీలో ప్రాధాన్యం ఇవ్వడం సర్కారు దుర్నితికి అద్దం పడుతోంది.  

క్రీడల విభజనతో మొత్తం గోల్‌మాల్‌
దేశ చరిత్రలో ఎన్నడూ లేని రీతిలో క్రీడలను కూటమి ప్రభుత్వం రెండు రకాలుగా వర్గీకరించింది. ఇందులో ఏపీలో ప్రాధాన్యంలో ఉన్న క్రీడలను తక్కువ కేటగిరీలోకి నెట్టేసింది. జీవోలో 65 క్రీడలను చేరిస్తే ఏ–కేటగిరీలో 36, బీ–కేటగిరీలో 29 క్రీడలను పెట్టింది. ఇది క్రీడా ప్రమాణాలకు విరుద్ధమని క్రీడా సంఘాల ప్రతి­నిధులు బహిరంగంగానే విమర్శలు చే­స్తు­న్నా ప్రభుత్వంలో కదలిక రాలేదు. దేశంలోని ఏ రాష్ట్రంలోనూ క్రీడల విభజన లేదు. శాప్‌ గుర్తింపు లేని సంఘాలను ఏ– కేటగిరిలో ఉంచి, శాప్‌ గుర్తింపు ఉన్న కొన్ని సంఘాలను బీ కేటగిరిలోకి తేవడం కొసమెరుపు. ఉద్యోగాల భర్తీలో ఏ–కేటగిరి పూర్తయిన తరువాత బీ–కేటగిరి క్రీడలకు ప్రాధాన్యం ఇస్తామని ప్రకటించి ఆ ప్రకారం డీఎస్సీలో పోస్టులు ఇష్టారీతిన భర్తీ చేసేశారు.

ఉదాహరణకు.. బీ–కేటగిరీలో ఉన్న క్రీడలో సదరు క్రీడాకారుడు జాతీయ స్థాయిలో పతకాలు సాధించినా.. ఏ–కేటగిరిలో ఉన్న క్రీడాకారుడు రాష్ట్ర స్థాయి ఆటల్లో పాల్గొన్న సర్టీఫికెట్‌తో వస్తే చాలు అతనికే ప్రాధాన్యం ఇచ్చి పోస్టులు భర్తీ చేశారు. దీనిపైనా హైకోర్టులో కేసులు కొనసాగుతున్నాయి. మరోవైపు రాష్ట్రంలో గోల్ఫ్‌ కోర్టులు ఎక్కడా లేవు, గోల్ఫ్‌ ఆడే క్రీడాకారులూ లేరు, ఈ క్రీడను ఏ–కేటగిరిలో చేర్చి రాష్ట్రంలో యువత రాణించే సెపక్‌తక్రా, నెట్‌బాల్, క్యారమ్స్, ఆత్యా పాత్యా, బాడీ బిల్డింగ్, కరాటే, టెన్నిస్‌బాల్‌ క్రికెట్, సాఫ్ట్‌ టెన్నిస్, యోగాసన క్రీడలను బీ–కేటగిరిలో పెట్టి డీఎస్సీని అడ్డుపెట్టుకుని దోచేశారు. క్రీడా సర్టీఫికెట్‌లకు గతంలో ఉన్న 10 ఏళ్ల కాలపరిమితిని ఎత్తివేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement