గుప్పిట్లో ‘ఫ్రీహోల్డ్‌’ | Chandrababu government is encroaching on the lands of the poor | Sakshi
Sakshi News home page

గుప్పిట్లో ‘ఫ్రీహోల్డ్‌’

Mar 21 2026 4:31 AM | Updated on Mar 21 2026 5:00 AM

Chandrababu government is encroaching on the lands of the poor

పేదల భూములపై చంద్రబాబు సర్కార్‌ గూడుపుఠాణి!

7.5 లక్షల ఎకరాలను 22 ఏ నుంచి తొలగించాలని మంత్రివర్గ ఉపసంఘం సిఫారసు.. 2 వారాలు దాటినా ఇంతవరకూ వెలువడని జీవో 

ఇదే అదనుగా ఫ్రీహోల్డ్‌ కాని భూముల్ని కొట్టేసేందుకు సన్నాహాలు 

తాజాగా మరికొన్ని అసైన్డ్‌ భూములపై గురి పెట్టిన టీడీపీ నేతలు 

పాత ఫ్రీహోల్డ్‌ భూముల జాబితాలో వాటిని కలిపి సొంతం చేసుకునే యత్నాలు 

27.40 లక్షల ఎకరాల అసైన్డ్‌ భూములపై పేద రైతులకు సంపూర్ణ హక్కులు కల్పిస్తూ వైఎస్సార్‌సీపీ హయాంలో చట్ట సవరణ 

అధికారంలోకి రాగానే వాటిని 22 ఏ జాబితాలో చేర్చి రైతులను క్షోభకు గురి చేసిన చంద్రబాబు సర్కారు 

రెండేళ్ల పాటు ఆ భూములపై నిషేధాన్ని కొనసాగించి డ్రామాలు 

విలువైన అసైన్డ్‌ భూములన్నీ తమ చేతుల్లోకి వచ్చాక తాపీగా జీవో ఇచ్చే యోచన  

సాక్షి, అమరావతి: పేద రైతులకు గత ప్రభుత్వంలో హక్కులు దక్కిన ఫ్రీహోల్డ్‌ భూముల్లో 7.50 లక్షల ఎకరాలను 22 ఏ జాబితా నుంచి తొలగించాలని మంత్రివర్గ ఉపసంఘం సిఫారసు చేసినా ఇప్పటివరకూ ఉత్తర్వులు వెలువడకపోవడంపై అనుమానాలు రేకెత్తుతున్నాయి. రెవెన్యూ శాఖ మంత్రి ఆధ్వర్యంలో ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం దీనిపై ఏడాదిన్నర పాటు నాన్చి ఇటీవలే ఒక నిర్ణయం తీసుకుంది. ఫ్రీహోల్డ్‌ అయిన (యాజమాన్య హక్కులు వచ్చిన) మొత్తం 13.59 లక్షల ఎకరాల భూముల్లో 7.50 లక్షల ఎకరాలను 22 ఏ జాబితా నుంచి తొలగించాలని ప్రభుత్వానికి సిఫారసు చేసింది. 

అయితే రెండు వారాలు దాటిపోయినా ఇంతవరకూ దీనిపై ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేయకపోవడం గమనార్హం. దీంతో దీని వెనుక ఏదో గూడుపుఠాణీ జరుగుతోందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సాధారణంగా మంత్రివర్గ ఉపసంఘం సిఫారసులు వెంటనే అమలు జరిగిపోతాయి. రాజధాని పనులు, ఇతర వ్యవహారాలపై ఏర్పాటు చేసిన ఉపసంఘాలు చేసిన సిఫారసులను ప్రభుత్వం వెనువెంటనే అమల్లోకి తెస్తూ జీవోలు ఇస్తోంది. 

కానీ పేద అసైన్డ్‌ రైతులకు సంబంధించిన భూములను రెండేళ్లు గాల్లో పెట్టి చివరికి వారి ఒత్తిడితో నిర్ణయం తీసుకున్నా అమలుకు వెనుకాడుతుండడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఉప సంఘం సిఫారసులు అందిన తర్వాత 2, 3 రోజుల్లోనే అందుకు సంబంధించిన జీవోలు వెలువడాలి. రెవెన్యూ శాఖ మంత్రి అదే విషయాన్ని బహిరంగంగా వెల్లడించారు. ఉన్నతాధికారులు కూడా వెంటనే జీవో వస్తుందని చెబుతున్నా ఇప్పటివరకూ రాకపోవడంపై అధికారవర్గాల్లోనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

ఆ ముసుగులో టీడీపీ నేతలు సర్దేస్తున్నారా..! 
ఎలాగూ సగం ఫ్రీహోల్డ్‌ భూములపై నిషేధం ఎత్తివేయాలని నిర్ణయించారు కనుక సందట్లో సడేమియా మాదిరిగా అసైన్డ్‌ భూములను నొక్కేయడానికి టీడీపీ నేతలు రంగం సిద్ధం చేసినట్లు సమాచారం. ఎన్నికలు రావడంతో గత ప్రభుత్వంలో ఫ్రీహోల్డ్‌ అవకుండా మిగిలిపోయిన కొన్ని భూములను తాజాగా ఫ్రీహోల్డ్‌ చేయిస్తున్నట్లు తెలుస్తోంది. వాటికి సంబంధించిన అసైనీలు ఉంటే వారి ద్వారా.. లేదంటే ఆదీనంలో ఉన్న రైతులతో మాట్లాడి నయానో భయానో లొంగదీసుకుంటున్నట్లు చెబుతున్నారు. 

తృణమో పణమో ముట్టజెప్పి వారి భూముల్ని స్వాదీనం చేసుకుంటున్నారని సమాచారం. గతంలోనే ఫ్రీహోల్డ్‌ అయిన భూములతో కలిపి వాటిని ఇప్పుడు ఫ్రీహోల్డ్‌ చేయించుకుంటున్నట్లు చెబుతున్నారు. ఈ కారణంగానే ఫ్రీహోల్డ్‌ భూములపై నిషేధం ఎత్తివేస్తూ వెంటనే ఇవ్వాల్సిన జీవో ఇంతవరకూ వెలువడలేదని తెలుస్తోంది. 

టీడీపీ నేతలు అనుకున్న భూములన్నీ వారి చేతుల్లోకి వచ్చాక జీవో జారీ చేస్తారని చెబుతున్నారు. తద్వారా గత ప్రభుత్వం ఫ్రీహోల్డ్‌ చేసిన భూముల్లో కొన్నింటిని ఇప్పుడు 22ఏ జాబితా నుంచి తీసివేశామని పైకి చెప్పుకుంటూ తాజాగా వేలాది ఎకరాలను టీడీపీ నేతలు కొల్లగొడుతున్నట్లు తెలుస్తోంది. 

వైఎస్‌ జగన్‌ హక్కులిస్తే.. బాబు ఆంక్షలు పెట్టి వేధించారు 
అనేక దశాబ్దాలపాటు తమ భూములపై ఎలాంటి హక్కులు లేకుండా ఉన్న పేద అసైన్డ్‌ రైతులకు ఊరటనిస్తూ వారి భూములపై వైఎస్‌ జగన్‌ హయాంలో హక్కులు కల్పించారు. ఇందుకోసం అసైన్డ్‌ భూముల చట్టానికి సవరణ చేసి 20 సంవత్సరాలు దాటిన అసైన్డ్‌ భూములపై పేద రైతులకు యాజమాన్య హక్కులు (ఫ్రీహోల్డ్‌) ఇచ్చారు. దీంతో 27.40 లక్షల ఎకరాలకు చెందిన అసైన్డ్‌ రైతులకు సంపూర్ణంగా హక్కులు కల్పించడంతో వారు ప్రైవేటు భూముల తరహాలో తమ భూములకు హక్కుదారులయ్యారు. 

2024లో ఎన్నికలు జరిగే సమయానికి 13.59 లక్షల ఎకరాలకుపైగా అసైన్డ్‌ భూములను గత ప్రభుత్వం ఫ్రీహోల్డ్‌ చేయగా, దాదాపు 20 లక్షల మంది రైతులను యజమానులను చేసింది. అయితే వైఎస్‌ జగన్‌ హయాంలోనే హక్కులు రావడంతో.. ఆ భూములపై కత్తి కట్టిన చంద్రబాబు సర్కార్‌ అధికారంలోకి రాగానే వాటిని 22 ఏ జాబితాలో పెట్టింది. 

రెండేళ్ల నుంచి ఆ భూములపై నిషేధాన్ని కొనసాగిస్తూ ఆ రైతులను తీవ్ర మానసిక క్షోభకు గురిచేసింది. అసైన్డ్‌ రైతుల ఒత్తిడితో ఫ్రీహోల్డ్‌ అయిన భూముల్లో సగం భూములను 22 ఏ జాబితా నుంచి తొలగించాలని రెండేళ్ల తర్వాత నిర్ణయించింది. అయినప్పటికీ దాన్ని అమలు చేయకుండా తెర వెనుక భూములు కొట్టేయడానికి సన్నాహాలు చేస్తుండడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. 

Advertisement
 
Advertisement
Advertisement