రూ.3,000 కోట్ల దోపిడీ | Chandrababu Coalition Govt Lands Scam in Visakha | Sakshi
Sakshi News home page

రూ.3,000 కోట్ల దోపిడీ.. విశాఖలో ప్రభుత్వ పెద్దల భూ దందా

Jul 27 2025 4:55 AM | Updated on Jul 27 2025 4:55 AM

Chandrababu Coalition Govt Lands Scam in Visakha

విశాఖలో ప్రభుత్వ పెద్దల భూ దందా 

రెండు రియల్‌ ఎస్టేట్‌ సంస్థలకు కారుచౌకగా 60 ఎకరాల భూమి కేటాయింపు

ఎకరం కేవలం రూ.1.5 కోట్లే.. బహిరంగ మార్కెట్‌లో ఎకరా రూ.50 కోట్లు   

భారీగా చేతులు మారిన ముడుపులు 

60 ఎకరాల్లో 2 కోట్ల చదరపు అడుగుల నిర్మాణాలు

ఫలితంగా ఏటా అద్దె రూపంలోనే ఆ సంస్థలకు రూ.1,000 కోట్ల ఆదాయం 

సత్వా డెవలపర్స్‌కు మధురవాడ హిల్‌4 వద్ద 30 ఎకరాలు.. కపిల్‌ చిట్‌ ఫండ్స్‌కు చెందిన బీవీఎం ఎనర్జీకి ఎండాడ వద్ద 30 ఎకరాలు.. మరో సంస్థ 

ఏఎన్‌ఎస్‌ఆర్‌కు మధురవాడలో 10 ఎకరాల భూమి 

పరిశ్రమల పేరుతో రియల్‌ ఎస్టేట్‌ సంస్థలకు విలువైన స్థలాలు.. రియల్‌ ఎస్టేట్‌ కంపెనీలకు ప్రభుత్వం ఇలా భూములు కేటాయించవచ్చా? 

మార్కెట్‌ రేటుకు కాకుండా నామమాత్రపు ధరలకే ఇవ్వొచ్చా?.. అత్యంత విలువైన స్థలాలను ఇస్తున్నప్పుడు ఎందుకు వేలం వేయలేదు? 

ఐటీ పార్కుల అభివృద్ధిని ఏపీఐఐసీ నుంచి తప్పిస్తున్నారా?

లేదంటే రియల్‌ సంస్థలకు ఇవ్వడమేంటి?  

కూటమి సర్కారు తీరుపై అధికార వర్గాల్లో ఆందోళన

ఏ రంగమైనా సరే.. ఏ ప్రాజెక్టు అయినా సరే.. ‘నీకింత–నాకింత’ సిద్ధాంతాన్ని కూటమి ప్రభుత్వ పెద్దలు యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు. రాజధానిలో భూ పందేరాలు, అమరావతి నిర్మాణ ప్రాజెక్టులు కట్టబెట్టడంలో చోటుచేసుకున్న అక్రమాలపై దేశవ్యాప్తంగా చర్చ కొనసాగుతుండగానే పెద్దల దృష్టి విశాఖపై పడింది. ఐటీ ముసుగులో రియల్‌ ఎస్టేట్‌ కంపెనీలను రంగంలోకి దించింది. ఐటీ పార్కులంటూ ప్రజల కళ్లకు గంతలు కట్టి పక్కా కమర్షియల్‌ సంస్థలకు అత్యంత విలువైన భూములను కారుచౌకగా కట్టబెట్టడంపై అధికార వర్గాలు నివ్వెర పోతున్నాయి. ఈ 60 ఎకరాల మీదే ఆయా సంస్థలకు ఏటా రూ.1,000 కోట్ల మేర అద్దెలు వస్తాయంటే ఎవరి వాటా ఎంతుంటుందోనని చర్చించుకుంటున్నారు.  

సాక్షి, అమరావతి: సత్వా, కపిల్‌ గ్రూపు, ఏఎన్‌ఎస్‌ఆర్‌.. ఎంత ఖరీదైన భూములనైనా కొనడానికి వెనుకాడని రియల్‌ ఎస్టేట్‌ సంస్థలు. బెంగళూరు, పూణే, హైదరాబాద్‌ వంటి నగరాల్లో ఈ కంపెనీలు భారీగా లగ్జరీ గృహ, వాణిజ్య సముదాయాలు నిర్మించి కోట్ల రూపాయల టర్నోవర్‌ చేస్తున్నాయి. వేలం పాటలో అధిక ధరలకు భూములు కొనుగోలు చేసి వెంచర్లు వేస్తూ లావాదేవీలు కొనసాగిస్తున్నాయి. ఇలాంటి పక్కా రియల్‌ ఎస్టేట్‌ సంస్థలకు దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమల ముసుగులో ఖరీదైన భూములను కారు చౌకగా కట్టబెడుతూ విశాఖలో అసలుసిసలైన ‘రియల్‌’ దందాకు తెరలేపింది. 

బహిరంగ మార్కెట్‌లో రూ.3 వేల కోట్లకు పైగా విలువైన భూములను ఆ సంస్థలకు కట్టబెట్టడం వెనుక భారీగా ముడుపులు చేతులు మారినట్లు తెలుస్తోంది. అందుకే ఎటువంటి వేలం లేకుండానే వేల కోట్లు విలువ చేసే భూములను పరిశ్రమల ఆకర్షణ పేరుతో ప్రభుత్వం ధారాదత్తం చేసింది.  బెంగళూరుకు చెందిన సత్వా గ్రూపు, తెలుగు రాష్ట్రాలో చిట్‌ ఫండ్‌ వ్యాపారంతో పాటు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం నిర్వహించే కపిల్‌ గ్రూపు, ఏఎన్‌ఎస్‌ఆర్‌ వంటి సంస్థలకు తాజాగా రాష్ట్ర ప్రభుత్వం వేల కోట్ల రూపాయల విలువైన భూమిని పప్పు బెల్లాల్లా అతి తక్కువ ధరకే పంచి పెట్టింది. 

ఈ ప్రాజెక్టుల్లో ఎటువంటి ప్రభుత్వ వాటా లేకుండా భూములను కట్టబెట్టడం విస్మయపరుస్తోంది. సత్వా, కపిల్‌ రియల్‌ ఎస్టేట్‌ సంస్థలు 60 ఎకరాల్లో 2 కోట్ల చదరపు అడుగుల నిర్మాణాల ద్వారా ప్రతి నెలా అద్దెల రూపంలో రూ.80 కోట్లు.. ఏటా దాదాపు రూ.1,000 కోట్ల ఆదాయం పొందుతాయని అంచనా. ఇప్పటికే ఉర్సా వంటి అనామక కంపెనీలకు భూములు కట్టబెట్టి విమర్శల పాలైనప్పటికీ భూ కేటాయింపుల విషయంలో మాత్రం ప్రభుత్వం వెనక్కు తగ్గడం లేదు. భవనాలు నిర్మించి కోట్లల్లో అద్దెలు ముక్కుపిండి వసూలు చేసే రియల్‌ ఎస్టేట్‌ సంస్థలకు ప్రభుత్వం ఇలా కారుచౌకగా భూములు కేటాయించడంపై అధికారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.  

ఐటీ సంస్థకు మాత్రం అధిక ధర
ఇదే కొండపై ఫీనమ్‌ పీపుల్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ అనే ఐటీ కంపెనీకి ఎకరా రూ.4.5 కోట్లు చొప్పున కేటాయించడం గమ­నార్హం. ఐటీ కంపెనీకి అధిక ధరకు కేటాయించి,రియల్‌ ఎస్టేట్‌ సంస్థకు చౌకగా కేటాయించడం భూ కేటాయింపుల్లో ‘రియల్‌’ మోసా­లను బహిర్గతం చేస్తోందని అధికారులు పేర్కొంటున్నారు. 

⇒ సత్వా గ్రూపునకు ప్రభుత్వం సబ్సిడీ ధరతో భూమిని కేటాయించడమే కాకుండా ఏపీ ఐటీ, జీసీసీ పాలసీ 4.0 కింద పెట్టుబడి రాయితీ, విద్యుత్‌ సబ్సిడీ, ఎస్‌జీఎస్టీ మినహాయింపు తదితర అనేక అదనపు రాయితీలను కూడా ఇవ్వనుంది. సత్వా డెవలపర్స్‌ ఎటువంటి ఐటీ కంపెనీలను పెట్టదని.. కేవలం ఐటీ పార్కును అభివృద్ధి చేసి ఇతర ఐటీ కంపెనీలకు లీజుకు ఇస్తుందని, అలాంటప్పుడు ఐటీ పాలసీ, జీసీసీ పాలసీ కింద రాయితీలను ఎలా ఇస్తారని అధికార వర్గాలు ప్రశ్నిస్తున్నాయి.  

⇒ సత్వా డెవలపర్స్‌  రూ.1,500 కోట్ల పెట్టుబడి పెట్టడం ద్వారా 25,000 మందికి ఉపాధి కల్పిస్తామని పేర్కొన్నారని, వాస్తవానికి ఇక్కడ సత్వా డెవలపర్స్‌ ఎవరికీ నేరుగా ఉపాధి కల్పించదని, ఈ వెంచర్‌లో ఏర్పాటు చేసే ఇతర ఐటీ కంపెనీలు మాత్రమే ఉపాధి కల్పిస్తాయని స్పష్టం చేస్తున్నారు. 

⇒ ఈ నేపథ్యంలో ఉపాధి కల్పన పేరుతో భారీగా రాయితీలను సత్వాకు దోచి పెట్టారని ఇట్టే తెలుస్తోంది. సత్వాకు రాయితీలు ఇచ్చి, ఇప్పుడు అందులో పెట్టే ఐటీ కంపెనీలకు కూడా రాయితీలు ఇస్తే ఒకే ప్రాజెక్టుపై రెండుసార్లు రాయితీలు ఏ విధంగా ఇస్తారని అధికారులు ప్రశ్నిస్తున్నారు.

అప్పనంగా విలువైన భూములు
⇒ తెలుగు రాష్ట్రాల్లో చిట్‌ఫండ్, రియల్‌ ఎస్టేట్, మీడియా రంగాల్లో విస్తరించి ఉన్న కపిల్‌ గ్రూపునకు చెందిన బీవీఎం ఎనర్జీ అండ్‌ రెసిడెన్సీ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు రాష్ట్ర ప్రభుత్వం విశాఖలోని పనోరమ హిల్స్‌ వెనుక ఎండాడ వద్ద ఎకరా రూ.1.5 కోట్లు చొప్పున 30 ఎకరాలు కేటాయించింది. ఎండాడ వద్ద బహిరంగ మార్కెట్లో ఎకరా రూ.100 కోట్లు పెట్టినా భూమి దొరకని పరిస్థితి. అంటే సుమారు రూ.3,000 కోట్ల విలువైన భూమిని హెచ్‌ఎంటీవీ వంటి మీడియా సంస్థలు కలిగిన కపిల్‌ గ్రూపునకు కేవలం రూ.45 కోట్లకే 30 ఎకరాలను కేటాయించింది. కపిల్‌ గ్రూపు విశాఖలో రూ.1,250 కోట్ల పెట్టుబడితో 15,000 మందికి ఉపాధి కల్పించే విధంగా ఒప్పందం కుదుర్చుకుంది. 

⇒ అలాగే వెంచర్‌ ఫండ్స్‌ నుంచి నిధులు సేకరించి ఐటీ పార్కులు.. ముఖ్యంగా గ్లోబల్‌ క్యాపబుల్టీ సెంటర్స్‌ (జీసీసీ)ను ఆకర్షించే బెంగళూరుకు చెందిన ఏఎన్‌ఎస్‌ఆర్‌ గ్లోబల్‌ కార్పొరేషన్‌కు మధురవాడ ఐటి హిల్‌ నెంబర్‌ 3పై ప్లాట్‌ నంబర్‌ 6 వద్ద 2.5 ఎకరాలు.. హిల్‌ నంబర్‌ 4పై ప్లాట్‌ నంబర్‌ యూడీఎల్‌ 6 వద్ద 7.79 ఎకరాల (మొత్తం 10.29 ఎకరాలు) భూమిని కారుచౌకగా కేటాయించింది. ఏఎన్‌ఎస్‌ఆర్‌ రూ.1,000 కోట్ల పెట్టుబడితో 10,000 మందికి ఉపాధి కల్పించనుంది. 

⇒ ఐటీ పార్క్‌ల అభివృద్ధికి ఏపీఐఐసీ ఉండగా,  రియల్‌ ఎస్టేట్‌ కంపెనీలకు అప్పగించడం ఏమిటని అధికార వర్గాల్లో చర్చ మొదలైంది. ప్రభుత్వం ఐటీ ముసుగులో రియల్‌ కంపెనీలకు కారు చౌకగా భూములను ఎలా ఇస్తుందని, అదీ వేలం వేయకుండా ఇవ్వడం దారుణం అని పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై కేంద్రానికి ఫిర్యాదు చేయడానికి విశ్రాంత ఐఏఎస్‌ అధికారులు సిద్ధమవుతున్నారు.  

రూ.1,500 కోట్ల భూమి సత్వాకు రూ.45 కోట్లకే  
⇒ సత్వా గ్రూపు.. రెండు దశాబ్ధాలుగా రియల్‌ ఎస్టేట్‌ రంగంలో ఉంది. పుణే, బెంగళూరు, హైదరాబాద్‌ వంటి నగరాల్లో భారీ లగ్జరీ రియల్‌ ఎస్టేట్‌ వెంచర్లు వేసింది. బ్లాక్‌ స్టోన్‌ వంటి పీఈ, వెంచర్‌ క్యాపిటల్‌ సంస్థల నుంచి నిధులు సేకరించి వ్యాపారం చేస్తోంది. 2017లో సత్వా గ్రూపు హైటెక్‌ సిటీ వద్ద 10 ఎకరాల స్థలాన్ని భారీ ధరకు కొనుగోలు చేసింది. ఇప్పుడు తాజాగా కోకాపేట వద్ద 25 ఎకరాల భూమిని రూ.వేల కోట్లు పెట్టి కొనుగోలు చేసింది. 

⇒ ఇలా ప్రైవేటుగా స్థలాలు కొనుగోలు చేసి, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేసే సంస్థను జూలైలో బెంగళూరు పర్యటనలో ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్‌ కలిశారు. గంటల వ్యవధిలో విశాఖలో పెట్టుబడుల ఒప్పందానికి సత్వాను ఒప్పించినట్లు సోషల్‌ మీడియా ద్వారా విపరీతంగా ప్రచారం చేసుకున్నారు. జూలై 8న నారా లోకేశ్‌ కలవడం.. గంటలోనే విశాఖలో పెట్టుబడి పెట్టడానికి ఒప్పించినట్లు ప్రకటించుకోవడం.. జూలై 23న ఎస్‌ఐపీబీ (స్టేట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రమోషన్‌ బోర్డ్‌)లో ఆమోదం పొందడం, ఆ మర్నాడే (జూలై 24) విశాఖలో 30 ఎకరాల భూమిని కేటాయిస్తూ మంత్రి మండలిలో ఆమోదం తెలపడం చకచకా జరిగిపోయింది. పారిశ్రామిక అవసరాల కోసం ఏపీఐఐసీ సేకరించిన భూమిని రియల్‌ ఎస్టేట్‌ సంస్థ సత్వా డెవలపర్స్‌కు ఇలా అప్పగించేశారు.  

⇒ విశాఖ గ్రామీణ మండలం మధురవాడ ఐటీ హిల్‌ నంబర్‌ 4 పై ప్లాట్‌ నంబర్లు యూడీఎల్‌ 1, యూడీఎల్‌ 2, యూడీఎల్‌ 3 వద్ద 30 ఎకరాల భూమిని సబ్సిడీ ధరగా ఎకరా రూ.1.5 కోట్లకే కేటాయిస్తూ కేబినెట్‌ తీర్మానం చేసింది. ప్రస్తుతం మధురవాడ ఐటీ హిల్స్‌లో ఎకరా రూ.50 కోట్లపైనే పలుకుతోంది. అంటే రూ.1,500 కోట్ల విలువైన భూమిని కేవలం రూ.45 కోట్లకే ఈ రియల్‌ ఎస్టేట్‌ కంపెనీకి అప్పగించడంపై అధికారులు నివ్వెరపోతున్నారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement