2014–19 మధ్య అధికార దుర్వినియోగంపై ఆరు కేసులు
ఇన్నర్ రింగ్ రోడ్డు, స్కిల్ డెవలప్‌మెంట్, ఫైబర్ నెట్, మద్యం, ఇసుక, అసైన్డ్ ల్యాండ్
ఈ కేసుల కొట్టివేత ప్రతులు పాత్రికేయుడు తిలక్‌కు అందజేసిన ఏసీబీ కోర్టు
విజయవాడ లీగల్: ముఖ్యమంత్రి చంద్రబాబుపై నమోదైన ఇన్నర్ రింగ్ రోడ్డు, స్కిల్ డెవలప్‌మెంట్, ఫైబర్ నెట్, మద్యం, ఇసుక, అసైన్డ్ ల్యాండ్.. కేసులకు సంబంధించిన ఫైనల్ ఆర్డర్ రిపోర్టులను విజయవాడ ఏసీబీ కోర్టు పాత్రికేయుడు తిలక్‌కు అందజేసింది. 2014–2019 మధ్య చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రజా ప్రయోజనాలను విస్మరించి, అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారన్న ఆరోపణలపై ఈ కేసులు నమోదయ్యాయి.
అనంతరం ఈ కేసులను ఏసీబీ న్యాయస్ధానం కొట్టివేసింది. ఆ తీర్పులకు సంబంధించి ఫైనల్ ఆర్డర్ రిపోర్టులు ఇవ్వాలని కోరుతూ పాత్రికేయుడు బాలగంగాధర్ తిలక్ తరఫున న్యాయవాది యక్కంటి పుల్లారెడ్డి ఏసీబీ న్యాయస్ధానంలో పిటీషన్ దాఖలు చేశారు. దానిపై విచారణ జరిపిన న్యాయమూర్తి ఎల్.తేజోవతి ఫైనల్ ఆర్డర్ రిపోర్టులను పిటిషనర్‌కు అందజేయాలని ఆదేశించారు. ఈ క్రమంలో బుధవారం ఆ కాపీల ప్రతులను పిటిషనర్‌కు అందజేశారు.


