కేటాయింపులు ఘనం.. వ్యయం అంతంతే

CAG Report On Budget Allocation And Expenditure Of TDP Govt - Sakshi

2018-19లో చంద్రబాబు సర్కారు తీరిది

వ్యవసాయం, సంక్షేమం, నీటిపారుదల రంగాల్లో భారీ మిగులు

వ్యయానికి పరిపాలన అనుమతులే ఇవ్వని బాబు ప్రభుత్వం

బడ్జెట్‌ కేటాయింపు, ఖర్చు తీరును ఎండగట్టిన కాగ్‌

సాక్షి, అమరావతి: ఎన్నికల ముందు సంవత్సరం వ్యవసాయం, సంక్షేమం, నీటిపారుదల తదితర రంగాలకు బడ్జెట్‌లో భారీ కేటాయింపులు చేసిన చంద్రబాబు సర్కారు ఆ సొమ్మును ఖర్చు చేయడంలో విఫలమైంది. కేటాయింపులు, వ్యయాల మధ్య ఉన్న భారీ తేడాను కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌) నివేదిక బహిర్గతం చేసింది. పాఠశాల విద్య, పంచాయతీరాజ్, పట్టణాభివృద్ధి, రెవెన్యూ, సహాయం, రోడ్లు భవనాలు, పౌరసరఫరాలు, పరిశ్రమల రంగాలకు భారీగా కేటాయింపులు చేసినా వ్యయం అంతంత మాత్రంగానే చేసినట్లు ఆ నివేదిక వెల్లడించింది. కొన్ని రంగాల్లో మిగుళ్లకు నిర్దిష్టమైన కారణాలను ప్రభుత్వం తెలియజేయలేదని కూడా వ్యాఖ్యానించింది.

సాంఘిక సంక్షేమం, వెనుకబడిన తరగతుల (బీసీ) సంక్షేమ రంగాల కేటాయింపుల్లో సగం కూడా వ్యయం చేయలేదని తెలిపింది. బడ్జెట్‌లో కేటాయింపులు కాగితాలకే పరిమితమయ్యాయి తప్ప వాస్తవరూపం దాల్చలేదని కాగ్‌ స్పష్టం చేసింది. కేటాయింపులు చేసినా ఆ పనులు చేపట్టడానికి ప్రభుత్వం పరిపాలన అనుమతులు ఇవ్వలేదు. కేటాయింపులకు వ్యయానికి పొంతన లేకపోవడంతో బడ్జెట్‌ ప్రక్రియకు అర్థం లేకుండా పోయిందని కాగ్‌ నివేదిక పేర్కొంది. పౌరసరఫరాల కేటాయింపుల్లో ఏకంగా 81 శాతం మేర వ్యయం చేయలేదు. అలాగే రహదారులు, భవనాలశాఖకు కేటాయించినదాన్లో 75 శాతం మేర ఖర్చుచేయలేదు. మొత్తం 11 రంగాలకు కలిపి రూ.1,05,579.16 కోట్లు కేటాయించగా రూ.57,908.50 కోట్లు మాత్రమే వ్యయం చేశారు. రూ.47,670.66 కోట్ల రూపాయలను వ్యయం చేయలేదు.

11 రంగాలకు కేటాయింపులు, ఖర్చుచేసిన, చేయని సొమ్ము వివరాలు..

రంగం        

కేటాయింపు (రూ.కోట్లలో)        

ఖర్చుచేసిన సొమ్ము(రూ.కోట్లలో)   ఖర్చు చేయని మొత్తం
1.రెవెన్యూ, రిజిస్ట్రేషన్‌, సహాయం   6,942.26  3886.61      3,055.65
2. పాఠశాల విద్య    23,192.58  17,479.29    5,713.33
3. పురపాలక, పట్టణాభివృద్ధి      8,629.99      5,243.03      3,386.96
4. సాంఘిక సంక్షేమం    4,221.64          2,121.06       2,100.58
5. బీసీ సంక్షేమం    6,278.36       2,804.39   3,473.97
6. వ్యవసాయం  15,569.41   8,020.53    7,548.88
7. పంచాయతీరాజ్‌   7,367.03      4,880.90   2,486.13
8. పరిశ్రమలు, వాణిజ్యం 4,696.67   1,010.12     3,686.55
9. పౌరసరఫరాలు   3,673.00    697.69   2,975.31 
10. రోడ్లు, భవనాలు  4,369.72    1,087.60       3,282.12
11. నీటిపారుదల        20,638.50  10,677.32  9,961.18
మొత్తం   1,05,579.16    57,908.54 47,670.66

                                  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top