మరోసారి పెరిగిన బుడమేరు ప్రవాహం.. ప్రజల్లో ఆందోళన
సర్కారు నిర్వాకంతో ఆరు రోజులుగా విజయవాడ వాసుల అగచాట్లు
కనీసం ఇప్పుడైనా వరద వస్తోందని అప్రమత్తం చేయని వైనం
వారం క్రితం ముందుగా చెప్పకపోవడంతో తీవ్ర అనర్థం
సమాచారం ఇవ్వలేకుంటే ఇక ప్రభుత్వం ఎందుకంటున్న బాధితులు
మమ్మల్ని చంపేయాలనుకుంటున్నారా అని ఆగ్రహావేశాలు
తగ్గిందని నిన్ననే వచ్చాం.. తెల్లారేసరికి మళ్లీ ముంచెత్తిందని ఆవేదన
ముంపు వీడకపోవడంతో బాధితుల కష్టాలు వర్ణనాతీతం
సహాయం అందక, ఎటు వెళ్లాలో తెలియక హాహాకారాలు
పునరావాస కేంద్రాలు ఎక్కడున్నాయని మండిపాటు
వరద ప్రాంతాల్లోని ఉద్యోగులనూ వదలని ప్రభుత్వం
విధుల్లోకి రావాలని ఒత్తిడి చేస్తుండడంతో ఆందోళన
(విజయవాడ వరద ప్రభావిత ప్రాంతాల నుంచి సాక్షి ప్రతినిధులు, నెట్‌వర్క్) : వరద వస్తుందని వారం క్రితం చెప్పలేదు..! రెండో సారి నిన్న కూడా చెప్పలేదు! అసలు ప్రభుత్వం ఉందా? ఆ మాత్రం సమాచారం ఇవ్వకుండా మమ్మల్ని చంపేయాలనుకుంటున్నారా?.. విజయవాడ వరద ముంపు ప్రాంతాల్లో బాధితుల ఆక్రందన ఇదీ!! ఆరు రోజులవుతున్నా విజయవాడలో పలు కాలనీలు జల దిగ్బంధంలోనే ఉండగా.. గురువారం రాత్రి నుంచి బుడమేర వరద మళ్లీ పోటెత్తడంతో పలు ప్రాంతాలను ముంచెత్తింది. కొన్ని కాలనీల్లో వరద ప్రవాహంతో 6–7 అడుగుల మేర నీళ్లు నిలిచాయి. జక్కంపూడి కాలనీలో వరద నీరు గంట గంటకూ పెరుగుతోంది.
సురక్షిత ప్రాంతాలకు వెళ్తున్న వరద బాధితులతో అజిత్‌సింగ్‌నగర్ మొదలుకొని పైపుల రోడ్డు వరకు కిక్కిరిసిపోయింది. గత ఆదివారం వరద నీరు చుట్టుముట్టడంతో కేఎల్ పురానికి చెందిన నూలి అయ్యన్న గుప్తా కుటుంబం పీకల్లోతు నీటిలో రెండు రోజులు నరకం చవి చూసింది. మంగళవారం ఎలాగోలా బయట పడి బంధువుల ఇంటికెళ్లి తలదాచుకున్నారు. ముంపు తగ్గిందని చెప్పడంతో గురువారం ధైర్యం చేసి ఇంటికి చేరుకున్నారు. తెల్లారి చూసేసరికి మళ్లీ వరద ఇంటిని ముంచేసింది. చూస్తుండగానే నాలుగుడుగులు నీరొచ్చేసింది. ఏం చేయాలో దిక్కు తోచక మళ్లీ కాలినడకన మూడు కిలోమీటర్లు ముంపు నీటిలోనే నడుచుకుంటూ నందమూరి నగర్ క్రాస్‌కు చేరుకున్నారు.
గుప్తా భార్య పద్మావతి వరద ఉధృతిని చూసి తీవ్ర ఆందోళనకు గురైంది. వరద గురించి ప్రభుత్వం కనీస సమాచారం ఇవ్వలేకపోతే ఇంతమంది అధికారులు, పోలీసులు ఉండి ప్రయోజనం ఏమిటని గుప్తా కుటుంబం ఆక్రోశిస్తోంది. మ్యాచిస్ రోడ్డులో ఉండే మురళి కుటుంబం తమ ఇల్లు పూర్తిగా ముంపు నీటిలో చిక్కుకోవడంతో బంధువుల ఇంట్లో తలదాచుకుని తిరిగి వచ్చి శుభ్రం చేసుకుంది.
శుక్రవారం తెల్లారి చూసేసరికి మళ్లీ వరద ఇంటిని చుట్టుముట్టేయడంతో వారి ఆవేదన వర్ణనాతీతం. ఆదివారం వరద వచి్చనప్పుడు చెప్పలేదు. ఈరోజు వరద వచ్చినప్పుడూ చెప్పలేదు. పైగా మళ్లీ వరద వచ్చే ప్రశ్నే లేదు..వర్షం పడే చాన్స్ లేదంటూ అధికారులు గంభీరంగా ప్రకటనలు ఇవ్వడం ఎంతవరకు సమంజసం? ప్రజల్ని చంపేయాలనుకుంటున్నారేమో అర్ధం కావడం లేదు అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వ వైఫల్యం కాక ఇంకేమిటి?
ఇందిరా నగర్, నందమూరి నగర్, భరతమాత కాలనీ, పైపుల రోడ్, డాబాకొట్ల రోడ్డు, ఆంధ్రప్రభ కాలనీ.. ఇలా సింగ్‌నగర్ ఎగువ ప్రాంతాలలో ఉంటున్న వారంతా ఒకటే అడుగుతున్నారు. మొన్న.. అనుకోకుండా వరద ముంచెత్తిందన్నారు.. ఇప్పుడు మళ్లీ ముంచుకొస్తోంది. ముందుగా ఎందుకు అప్రమత్తం చేయలేదు? పైగా పుకార్లు నమ్మొద్దంటూ జిల్లా కలెక్టర్ స్టేట్‌మెంట్లు ఇస్తున్నారు. ఇంటి వద్దే ఉండండి.. ఆహారం, మంచినీళ్లు, నిత్యావసరాలు అందిస్తామని సీఎం చంద్రబాబు చెబుతున్నారు.
బుడమేరుకు మళ్లీ గండి పడిందని, ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో వరద ముంచెత్తుతుందని ఎందరో చెబుతున్నారు. ఎవరి మాట నమ్మాలి? ప్రభుత్వం వద్ద ఎందుకు సమాచారం లేదు? ఎందుకు అప్రమత్తం చేయలేక పోతున్నారో అర్ధం కావడం లేదు. ఇది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యం కాక ఇంకేమిటి? అని నిలదీస్తున్నారు. ప్రభుత్వం మాటలు నమ్మి ఇంటి పట్టునే ఉన్నందుకు ఈ రోజు నరకం చూస్తున్నాం. సింగ్‌నగర్ లోపల ప్రాంతాలకు కనీసం పాల ప్యాకెట్ అందించిన పాపాన పోవడం లేదని వాపోతున్నారు.
బయటకు వెళ్లి తిరిగి రాగానే..
స్వల్పంగా తగ్గిందనుకున్న బుడమేర వరద అనూహ్యంగా మళ్లీ పోటెత్తడంతో విజయవాడ ప్రజల పరిస్థితి మరింత దయనీయంగా మారిపోయింది. గురువారం రాత్రి నుంచి బుడమేరు వరద నీరు విజయవాడలోని పలు ప్రాంతాలను మంచెత్తింది. ఉదయం వరద తగ్గడంతో ఊపిరి పీల్చుకున్న బాధితులు ఇళ్లు శుభ్రం చేసుకోవడం, నిత్యావసరాలు, ఇతర అవసరాల కోసం బయటకు రావడం ప్రారంభించారు. బయట ప్రాంతాలకు వెళ్లిపోయిన వారు కూడా తిరిగి ఇళ్లకు వచ్చారు.
కానీ మళ్లీ ఒక్కసారిగా ఇళ్లను వరద ముంచెత్తడంతో పరిస్థితి భయానకంగా మారింది. వారం రోజులుగా వరద వీడకపోవడం, ఎలాంటి సాయం అందకపోవడంతో గగ్గోలు పెడుతున్నారు. సింగ్‌నగర్ సమీపంలోని ఇందిరా నాయక్ నగర్ మొత్తం వరద ఉధృతికి వణుకుతోంది. ఇళ్ల నుంచి బయటకు వచ్చే అవకాశం లేకుండా పోయింది. ఇళ్ల మధ్య నుంచి బుడమేరు వేగంగా ప్రవహిస్తుండడంతో అపార్టుమెంట్లు, బిల్డింగ్‌లపైన నిలబడి తమను ఎవరైనా బయటకు తీసుకెళతారేమోనని ఆశగా ఎదురు చూస్తున్నారు.
ఆ ప్రాంతంలోకి ఎన్డీఆర్‌ఎఫ్ బోట్లు వెళ్లడం కూడా కష్టంగా మారింది. ప్రాణాపాయం ఉన్న వారిని బయటకు తెచ్చేందుకు వరదకు ఎదురు వెళ్లాల్సి రావడంతో సమస్యాత్మకంగా ఉంది. కొన్ని బృందాలు అతి కష్టం మీద కొందరిని బయటకు తెస్తున్నాయి. జల దిగ్బంధంలో చిక్కుకున్న ఇలాంటి లోపలి ప్రాంతాలకు ఆహారం, మంచినీరు కూడా అందకపోవడంతో అల్లాడుతున్నారు.
పునరావాస కేంద్రాలేవి?
ఎలాగోలా వరద నుంచి బయటపడిన వారి కోసం పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. వేలాది కుటుంబాలు ఎటు వెళ్లాలో తెలియక దూర ప్రాంతాల్లోని బంధువుల ఇంటికి పయనమవుతున్నాయి. ఆహారం ఇవ్వకపోగా కనీసం పునరావాసం కూడా కల్పించకపోవడం ఏమిటని విపత్తుల నిర్వహణ నిపుణులు నివ్వెరపోతున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో నానా కష్టాలు పడుతున్న ఉద్యోగులను ప్రభుత్వం విధుల్లోకి రావాలని ఒత్తిడి చేస్తుండడం చర్చనీయాంశంగా మారింది.
సింగ్ నగర్ వడ్డెర కాలనీలో 300 మందికిపైగా పారిశుద్ధ్య కారి్మకులు వరద ముంపులో చిక్కుకోగా వారిని విధుల్లోకి రావాలని మున్సిపల్ కమిషనర్ ఆదేశాలు జారీ చేయడంతో ఆందోళన చెందుతున్నారు. తక్షణం విధుల్లోకి రాకుంటే నోటీసులిస్తామని బెదిరిస్తుండడంతో నెత్తీ నోరూ కొట్టుకుంటున్నారు. ఒకవైపు తమ ఇళ్లు మునిగిపోయి సర్వం పోగొట్టుకుని కుటుంబాలను ఎలా కాపాడుకోవాలో దుస్థితిలో ఉంటే విధులకు రమ్మనడం ఏమిటని కార్మికులు వాపోతున్నారు.
కొరవడిన సమన్వయం...
సమన్వయంతో సహాయ చర్యలు చేపట్టడంలో ప్రభుత్వం విఫలమైంది. ఎండీయూ వాహనాల ద్వారా నిత్యావసర సరుకుల కిట్ల పంపిణీ మందకొడిగా సాగుతోంది. సరుకుల కోసం రేషన్ కార్డులు, ఆధార్ కార్డులు ఎక్కడి నుంచి తేవాలని లబోదిబోమంటున్నారు. ఆహార పదార్థాలు సకాలంలో అందించకపోవడంతో పాడైపోతున్నాయి. దాతలు అందచేసిన ఆహార పదార్థాల పంపిణీకి ప్రభుత్వం నుంచి పర్యవేక్షణ కరువైంది. కింది స్థాయిలో పనిచేసే సిబ్బంది నామాత్రంగా ఉండటంతో సహాయ శాఖ చర్యల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది.
చివరకు అన్ని పనులకు సచివాలయ సిబ్బందే దిక్కు అవుతున్నారు. ప్రధానంగా సహాయక చర్యల్లో మున్సిపల్, రెవెన్యూ, పోలీసుశాఖల మధ్య సమన్వయం కొరవడిందని స్పష్టంగా తెలుస్తోంది. సీఎం చంద్రబాబు వెంట తిరగడానికే ఉన్నతాధికారులకు సరిపోతోంది. దీంతో తమ పని చేయలేకపోతున్నామని, ఫలితంగా సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయని సీనియర్ అధికారులు పేర్కొంటున్నారు.
మంచినీళ్లు.. కొవ్వొత్తులకు కటకట
జక్కంపూడి కాలనీలో కిలోమీటరు దూరం నడుం లోతు నీటిలో నడిచి వచ్చి న వారికే మంచి నీళ్లు అందుతున్నాయి. వాటర్ ట్యాంకర్లతో నీటిని సరఫరా చేస్తుండటంతో యుద్ధ వాతావరణాన్ని తలపిస్తోంది. ఆరు రోజులుగా కరెంట్ లేకపోవడంతో స్వచ్ఛంద సంస్థలు పంపిణీ చేస్తున్న అగ్గిపెట్టెలు, కొవ్వొత్తుల కోసం క్యూ కడుతున్నారు. భోజనం, మంచినీళ్లు, పాలు ‘ఈ’ బ్లాకు వరకు చేరడంలేదు. కాలనీ మధ్య నుంచి బుడమేరు వేగంగా ప్రవహిస్తుండటంతో దాటేందుకు సాహసించడం లేదు.
మేనకోడలి పిల్లలను చూడటానికి వచ్చి వరద బారిన పడ్డాను..
మా మేనకోడలి పిల్లలను చూసేందుకు బావాజీపేట నుంచి శనివారం కండ్రిక వెళ్లా. వారు బలవంతం చేయటంతో అక్కడే ఉండిపోయా. ఆదివారం ఉదయం ఒక్కసారిగా వరద ప్రారంభమైంది. ఇంటిపైకి ఎక్కి ప్రాణాలు కాపాడుకున్నాం. రెండ్రోజుల పాటు నీరు, ఆహారం లేదు. నేను వాడాల్సిన మందులు కూడా లేకపోవడంతో అవస్థ పడ్డా. బోటుపై బయటకు తీసుకెళ్లాలని ప్రాథేయపడ్డా పట్టించుకోలేదు. వరద కొద్దిగా తగ్గుముఖం పట్టగానే కండ్రిక నుంచి నడుచుకుంటూ బయటకు వచ్చేశా. – ఎం నగేష్, కండ్రిక
తాళాలు వేసి వెళ్లిపోతున్నాం..
ఈ కష్టం పగవాడికి కూడా రాకూడదు. ఆదివారం ఒక్కసారిగా వరద నీరు చుట్టుముట్టింది. పీక ల్లోతుకు చేరుకోవటంతో ప్రాణ భయంతో ఫస్ట్ ఫ్లోర్‌లోకి వెళ్లాం. మా ఇల్లు వీధి చివరిలో ఉండటంతో బిక్కుబిక్కుమంటూ గడిపాం. విద్యుత్ లేక, కనీసం తాగేందుకు నీరు లభించక అవస్థలు పడ్డాం. మూడో రోజు బోరు నీటిని తాగి ప్రాణాలు నిలుపుకొన్నాం.
మావైపు వచ్చిన హెలికాప్టర్లు, బోట్లను ఎంత పిలిచినా స్పందించలేదు. వరద మరింత పెరిగే ప్రమాదంతోపాటు మృత దేహాలు, జంతువులు కొట్టుకురావటంతో ఇంటికి తాళాలు వేసి వెళ్లిపోతున్నాం. ఇప్పటికే మా చుట్టుపక్కల వారు చాలామంది వెళ్లిపోయారు. – జి. నారాయణరెడ్డి, తోటవారి వీధి
బాధ్యత లేని ప్రభుత్వం
» వరద హెచ్చరికల విషయంలో నిర్లక్ష్యంపై ప్రజల ఆగ్రహం
»మొదటిసారే ముంపు గురించి హెచ్చరించలేదు
»మరలా బుడమేరు పొంగుతోందంటే వినిపించుకోలేదు
»అవన్నీ వదంతులేనని సాక్షాత్తూ కలెక్టర్ చేత చెప్పించారు
» ప్రభుత్వం మాటలు నమ్మి నిండా మునిగిన బాధితులు
సాక్షి, అమరావతి: ఉపద్రవం ముంచుకొస్తుంటే పాలకులు మొద్దునిద్రలో ఉండటం వల్లనే విజయవాడలో వరదలకు భారీ నష్టం వాటిల్లిందనడానికి మరో ఉదాహరణ ఇది. శనివారం వరదపై అంచనా తప్పిన ప్రభుత్వం.. వాంబేకాలనీ, వైఎస్సార్ నగర్, రాజీవ్‌నగర్, అజిత్‌సింగ్‌నగర్, ఇందిరానగర్ కాలనీ, పాయకాపురం, శాంతినగర్, గాంధీనగర్, డాబాకొట్లు సెంటర్‌తో పాటు అనేక ప్రాంతాలను ముంచేసింది. లక్షలాది మందిని నిరాశ్రయులను చేసిన పాపాన్ని ఈ ప్రభుత్వం మూటకట్టుకుంది. అయినా బుద్ధి తెచ్చుకోలేదు.
బుడమేరుకు పడిన మూడు ప్రధాన గండ్లు పూడ్చడంలో విఫలమవుతున్న యంత్రాంగం, శుక్రవారం నాటికి కూడా అతిపెద్దదైన గండికి అడ్డుకట్ట వేయలేదు. ఈ విషయంపై గురువారం నగరమంతా చర్చ జరిగింది. మళ్లీ వరద పెరుగుతోందని సామాజిక మాధ్యమాల్లో సందేశాలు పోటెత్తాయి. కానీ ప్రభుత్వం దానిని తేలిగ్గా తీసుకుంది. ‘‘బుడమేరుకు మళ్లీ వరద అంటూ వస్తున్న పుకార్లు నమ్మవద్దు. మళ్లీ వరద వస్తే సమాచారం ఇస్తాం’’ అంటూ సాక్షాత్తూ ఎన్‌టీఆర్ జిల్లా కలెక్టర్ సృజన చేత కూటమి ప్రభుత్వం తప్పుడు ప్రకటన చేయించింది.
స్వయానా కలెక్టర్ చెప్పడంతో ఆ మాటలు నమ్మి బాధితులు చాలామంది సురక్షిత ప్రాంతాలకు వెళ్లలేదు. వెళ్లినవారు సైతం ఇళ్లకు తిరిగివచ్చారు. తీరా వచ్చాక వరద నీరు పెరిగిపోవడంతో మళ్లీ ముంపులో చిక్కుకుపోయారు. విజ్ఞత మరచి వరద హెచ్చరికలను పెడచెవిన పెట్టి, ప్రజలను తప్పుదోవ పట్టించి చంద్రబాబు సర్కారు చాలా పెద్ద తప్పు చేసిందని బాధితులు ఆరోపిస్తున్నారు.
పింఛన్ కోసం.. నడుం లోతు నీళ్లలో
వరద ప్రభావిత ప్రాంతాల్లో వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు పింఛన్ డబ్బుల కోసం పడరాని పాట్లు పడుతున్నారు. ఆగస్టు 31న పింఛన్లు పంపిణీ చేసిన ప్రభుత్వం వరద ప్రభావిత ప్రాంతాల్లో లబ్ధిదారులను విస్మరించింది. ముంపు ప్రాంతాలైన సింగ్‌నగర్, లూనా సెంటర్, యార్డ్ రోడ్డు, కృష్ణా హోటల్ సెంటర్, వాంబే కాలనీ, న్యూ ఆర్‌ఆర్‌పేట, పాయకాపురం, ప్రశాంతినగర్, సుందరయ్య నగర్, కండ్రిక, రాజీవ్‌నగర్, జక్కంపూడి కాలనీ, అంబాపురం తదితర ప్రాంతాల్లో పింఛన్ డబ్బుల కోసం నడుం లోతు నీళ్లలో మూడు నుంచి ఆరు కిలోమీటర్లు నడవా ల్సిన దుస్థితి నెలకొంది.
పింఛన్ కోసం సింగ్ నగర్ ఫ్లైఓవర్ వద్దకు రావాలని ఆదేశించడంతో ఆయా ప్రాంతాల్లో 25 వేల మందికిపైగా పింఛన్‌దారులు వరద నీటిలో నడుచుకుంటూ వెళుతున్న దయనీయ దృశ్యాలు కనిపిస్తున్నాయి. వృద్ధులు, దివ్యాంగుల పట్ల కనీస మానవత్వం లేకుండా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తోందని ప్రజలు మండిపడుతున్నారు. – విజయవాడ స్పోర్ట్స్
Comments
Please login to add a commentAdd a comment