టీడీపీ హయాంలో విదేశీ విద్య పేరుతో దోపిడీ | Sakshi
Sakshi News home page

టీడీపీ హయాంలో విదేశీ విద్య పేరుతో దోపిడీ

Published Sun, Jul 17 2022 5:08 AM

Botsa Satyanarayana On TDP Govt Corruption - Sakshi

విజయనగరం అర్బన్‌: విదేశీ విద్య రుణాల పేరుతో టీడీపీ హయాంలో రూ. 300 కోట్ల మేర అవినీతి జరిగిందని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. విదేశాల్లో ఉన్నాయో, లేవో తెలియని యూనివర్సిటీల పేరుతో దోపిడీ చేశారని ధ్వజమెత్తారు. శనివారం విజయనగరం కలెక్టరేట్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. నాణ్యమైన విద్యను అందించాలనే లక్ష్యంతో టాప్‌–200 ర్యాంకుల్లో ఉన్న విదేశీ యూనివర్సిటీల్లో సీట్లు పొందిన రాష్ట్ర విద్యార్థులకు మాత్రమే వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఇచ్చే రుణ అనుమతి ఉంటుందన్నారు.  

ఒక్క స్కూల్‌ కూడా మూతపడదు.. 
నూతన విద్యావిధానం మేరకు రాష్ట్రంలో అమలు చేస్తున్న 3, 4, 5వ తరగతులను ఉన్నత పాఠశాలల్లో విలీనం చేయడం వల్ల రాష్ట్రంలో ఒక్క పాఠశాల కూడా మూతపడదని మంత్రి బొత్స వివరించారు. ఆ ప్రాథమిక పాఠశాలల్లో ఉన్న 1, 2వ తరగతులతో పాటు అంగన్‌వాడీ పిల్లలతో కలిపి ఫౌండేషన్‌ స్కూల్‌ పేరుతో అవి కొనసాగుతాయని పునరుద్ఘాటించారు. ఎల్లో మీడియాతో పాటు, సోషల్‌ మీడియాలో కొందరు బడులు మూతబడుతున్నాయంటూ తప్పుడు ప్రచారం చేస్తుండటంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. 

మండలానికి  రెండు జూనియర్‌ కళాశాలలు
రాష్ట వ్యాప్తంగా ఉన్న అన్ని కేజీబీవీల్లో ఇంటర్‌మీడియెట్‌ కోర్సులు ప్రారంభిస్తామని, మండలానికి రెండు జూనియర్‌ కళాశాలలను నిర్వహిస్తామని మంత్రి బొత్స తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన సిలబస్‌ ప్రకారమే పరీక్షలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. అవసరమైన పుస్తకాలను ప్రభుత్వమే సరఫరా చేస్తుందన్నారు. ఏ పాఠశాలలోనైనా అక్రమాలు జరిగినట్టు నిర్ధారణ అయితే ఆ విద్యా సంస్థ గుర్తింపు రద్దు చేస్తామని హెచ్చరించారు. మీడియా సమావేశంలో మంత్రితో పాటు విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, ఎమ్మెల్యే అప్పలనరసయ్య తదితరులు పాల్గొన్నారు. 

Advertisement
 
Advertisement
 
Advertisement