సాక్షి, విశాఖ: అమరావతిలో నిర్మాణాలపై జనసేన మాజీ నేత బొలిశెట్టి సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమరావతిలో పర్యావరణ విధ్వంసం జరుగుతోందని తీవ్ర ఆరోపణలు చేశారు. అవినీతి, పర్యావరణం విషయంలో కూటమి నేతలను వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరికలు జారీ చేశారు.
జనసేన మాజీ నేత బొలిశెట్టి సత్యనారాయణ తాజాగా విశాఖలో మీడియాతో మాట్లాడుతూ..‘అమరావతిలో పర్యావరణ విధ్వంసం జరుగుతోంది. అమరావతిలో నిర్మాణాలు నిబంధనలకు లోబడి నిర్మించాలి. రాజధాని నిర్మాణంలో 84 శాతం సాగు, పర్యావరణ భూములు ఉన్నాయి. అమరావతి పరిధిలో ఉన్న నదులు, కాలువలు, వాగులను పరిరక్షించాలి. అవినీతి, పర్యావరణంపై రాజీలేని పోరాటం చేస్తాను. ఈ విషయంలో కూటమి నేతలను కూడా వదిలిపెట్టను. రాజకీయ పార్టీలపై నమ్మకం పోయింది. ఈ సమాజాన్ని మీడియా కాపాడాలి’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఇదే సమయంలో పర్యావరణ పరిరక్షణ అనేది కేవలం ప్రభుత్వాల బాధ్యత మాత్రమే కాదు, అది మనందరి ప్రాథమిక కర్తవ్యం. ప్రభుత్వాలు పారిశ్రామిక వృద్ధి లేదా ఇతర ప్రాజెక్టుల పేరుతో పర్యావరణ నియమాలను విస్మరించినప్పుడు, యువత మరియు పౌర సమాజం ఒక బలమైన నిఘా శక్తిగా (Watchdog) మారడం అత్యవసరం. కేంద్ర సాధికార కమిటీ (CEC) వెల్లడించిన అంశాలు క్షేత్రస్థాయిలో ఉన్న భయంకరమైన వాస్తవాలను ప్రతిబింబిస్తున్నాయని వ్యాఖ్యలు చేశారు.


