దేవుడి భూములను దోచి పెడతారా?.. ధ్వజమెత్తిన బీజేపీ | BJP Fires on Chandrababu Govt Over Temple Lands | Sakshi
Sakshi News home page

దేవుడి భూములను దోచి పెడతారా?.. ధ్వజమెత్తిన బీజేపీ

Mar 31 2026 4:48 AM | Updated on Mar 31 2026 5:08 AM

BJP Fires on Chandrababu Govt Over Temple Lands

కృష్ణా జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో అధికారులకు వినతి పత్రమిస్తున్న బీజేపీ నేతలు

చంద్రబాబు ప్రభుత్వ నిర్ణయాలపై ధ్వజమెత్తిన కూటమి పార్టీ బీజేపీ

ప్రైవేటు సర్వే నంబర్లలో కలిశాయనే పేరుతో లక్షన్నర ఎకరాలు ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చేస్తారా?

క్రమబద్ధీకరణతో ఆక్రమణదారులకే భూములు కట్టబెట్టేస్తారా? 

వీటిపై సర్వే చేసి ఆ భూములను తిరిగి ఆలయాలకు అప్పగించాల్సిందే 

పట్టణ ప్రాంతాల్లోని భూముల్ని దీర్ఘకాలిక లీజులకు ఎలా ఇస్తారు? 

ఆలయాల భూములను దారి మళ్లించి, దోచి పెట్టాలనే ధోరణి తప్పు 

హిందూ ఆలయాల రక్షణకు ప్రమాదకరం.. తీవ్ర నష్టం 

ఈ విధానాలు హిందూ సమాజాన్ని తీవ్రంగా బాధిస్తున్నాయి 

హిందూ సమాజం కోర్టులకెళ్లి స్టే తెచ్చుకోవాల్సిన దుస్థితి 

ఈ నిర్ణయాలను వెంటనే నిలిపివేయాలని బీజేపీ డిమాండ్‌  

సాక్షి, అమరావతి: దేవాలయాల భూములను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టేందుకు చంద్రబాబు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను కూటమిలో మిత్రపక్షమైన భారతీయ జనతా పార్టీ (బీజేపీ)నే తూర్పారపట్టింది. ప్రస్తుతం దేవాలయాల భూముల విషయంలో జరుగుతున్న పరిణామాలు హిందూ సమాజాన్ని తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయంటూ బీజేపీ సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ‘ప్రైవేటు వ్యక్తుల సర్వే నంబర్లలో కలిసిపోయాయి అనే పేరుతో దేవాలయాలకు చెందిన లక్షన్నర ఎకరాలకు పైగా భూములను సరైన దర్యాప్తు, సర్వే చేయకుండా ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం అత్యంత ఆందోళనకరమైన విషయం.

ఇది హిందూ సమాజానికి, ఆలయాల రక్షణకు తీవ్ర ప్రమాదకరం. ఈ చర్యలతో ఆలయాలు తీవ్రంగా నష్టపోతాయి’ అని స్పష్టం చేసింది. 33 సంవత్సరాల దీర్ఘకాలిక లీజుల పేరుతో అర్బన్‌ ప్రాంతాల్లో ఉన్న దేవాలయ భూములను ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వాలనే విధానం కూడా పూర్తిగా తప్పు అని  చెప్పింది. ఈ నిర్ణయం వల్లే హిందూ సమాజం కోర్టులను ఆశ్రయించి స్టే ఆదేశాలు తెచ్చుకోవలసిన దుస్థితి వచ్చిందని దుయ్యబట్టింది. ఆలయాల భూములను రక్షించాలనే దృక్కోణం కాకుండా, వాటిని దారి మళ్లించాలి, దోచి పెట్టాలి అనే ధోరణి హిందూ సమాజాన్ని తీవ్రంగా బాధిస్తోందని, ఇటువంటి వ్యవహారాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించలేమని పేర్కొంది.

ఇది అత్యంత ప్రమాదకరం
హిందూ దేవాలయాలు మన సంస్కృతి, సంప్రదాయం, ఆధ్యాత్మికతకు ప్రతీకలు. ఈ ఆలయాలకు చెందిన లక్షల ఎకరాల భూములు దేవుని ఆస్తులు, కోట్లాది భక్తుల విశ్వాసానికి నిలువెత్తు నిదర్శనాలు. అభివృద్ధి పేరుతో హిందూ ఆలయ భూములు ఇతరుల చేతుల్లోకి వెళ్లడం అంగీకారయోగ్యం కాదు. ఈ భూములు ఆలయాలకే చెందాలి. ఇదే భారతీయ జనతా పార్టీ స్పష్టమైన అభిప్రాయం.

ఆలయాల భూములను ఆక్రమించుకున్న వారికి రెగ్యులరైజేషన్‌ పేరుతో చట్టబద్ధత కల్పించాలని ప్రభుత్వం ఆలోచించడం కూడా అత్యంత ప్రమాదకరం. ఇది అక్రమాలను ప్రోత్సహించడమే అవుతుంది’ అని పేర్కొంది. ఈ భూములపై నిష్పక్షపాత, పూర్తి స్థాయి సర్వే చేసి, ప్రైవేటు సర్వే నంబర్లలో కలిసిపోయిన భూములను, ఆక్రమణదారుల చేతుల్లో ఉన్న భూములను తిరిగి ఆలయాలకు అప్పగించాలని, అక్రమణదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేసింది. పట్టణ ప్రాంతాల్లో ఖాళీగా ఉన్న దేవదాయ శాఖ భూములను దీర్ఘకాలిక లీజులివ్వడం కాకుండా స్వల్పకాలిక లీజులకు ఇవ్వాలని చెప్పింది.

గుళ్ల ద్వారా భారీ ఆదాయమొస్తున్నాపండుగలు జరిపేది ఇలాగేనా? 
దేవాలయాల ద్వారా రాష్ట్రానికి భారీగా ఆదాయం వస్తున్నప్పటికీ, అదే ఆలయాల అభివృద్ధి, పండుగల నిర్వహణకు ప్రభుత్వం సరైన మద్దతు ఇవ్వకపోవడం కూడా భక్తుల మనోభావాలను దెబ్బతీస్తోందని బీజేపీ తెలిపింది. ఆలయాల ఆదాయం నుంచి ప్రభుత్వం కామన్‌ గుడ్‌ ఫండ్, అడ్మినిస్ట్రేటివ్‌ చార్జెస్‌  తీసుకుంటుందని గుర్తు చేసింది. దేవాలయాల ఆదాయం పూర్తిగా అవే ఆలయాల అభివృద్ధికి వినియోగించేలా చట్టపరమైన హామీ ఇవ్వాలని,  ఆలయాల పండుగల నిర్వహణకు ప్రభుత్వం నేరుగా నిధులు కేటాయించాలని డిమాండ్‌ చేసింది. 

ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ కలెక్టరేట్లలో వినతిపత్రాలు 
హిందూ దేవాలయ భూముల రక్షణ – ప్రభుత్వ విధానాల పునఃపరిశీలనపై సోమవారం బీజేపీ శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్‌లలో వినతిపత్రాలు సమరి్పంచినట్లు  బీజేపీ రాష్ట్ర కార్యాలయం తెలిపింది. ‘ఇది వినతిపత్రం కాదు.. హిందూ సమాజం యొక్క గళం. దేవాలయ భూముల విషయంలో ప్రభుత్వం సరైన నిర్ణయాలు తీసుకుంటుంది అని భారతీయ జనతా పార్టీ ఆశిస్తోంది’ అని పేర్కొంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement