మీ ఇంట్లో ఒక్కరు.. ప్రజలకు నలుగురా? | AP Peoples fires on Chandrababu over 4 Children in Social Media: andhra pradesh | Sakshi
Sakshi News home page

మీ ఇంట్లో ఒక్కరు.. ప్రజలకు నలుగురా?

May 18 2026 5:37 AM | Updated on May 18 2026 5:37 AM

AP Peoples fires on Chandrababu over 4 Children in Social Media: andhra pradesh

సూపర్‌ సిక్స్‌ను వదిలేసి సూపర్‌ జనాభా సిద్ధాంతమెందుకు? 

ఉద్యోగాలు ఇవ్వలేరు.. కానీ నలుగురిని కనమంటారా? 

ఆరోగ్యశ్రీ బిల్లులకు దిక్కులేదు.. కానీ జనాభా పెరగాలంటారా? 

ఎక్కువ మంది పిల్లల్ని కంటే పోషించే బాధ్యత ఎవరిది? 

బతుకే భారంగా మారితే.. పిల్లలెలా సంపద అవుతారు? 

అప్పుడు కుటుంబ నియంత్రణ అని.. ఇప్పుడు జనాభా జపమా? 

చంద్రబాబు బిడ్డల ఆఫర్‌ను ఛీకొడుతున్న సోషల్‌ మీడియా 

ఇదంతా పాలనా వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నమని విమర్శలు  

సాక్షి, అమరావతి: చంద్రబాబు చెబుతున్న కొత్త జనాభా సిద్ధాంతంపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. గతంలో ఒక్క బిడ్డ చాలని ప్రచారం చేసి ఇప్పుడు యూటర్న్‌ తీసుకుని నలుగురు బిడ్డల్ని కనాలని చెప్పడంపై సోషల్‌ మీడియాలో విమర్శలు హోరెత్తుతున్నాయి. తాను విజనరీనని దశాబ్దాలుగా ప్రచారం చేసుకుంటూ వచ్చిన ఆయన విజన్‌ జనాభా విషయంలో అట్టర్‌ ప్లాప్‌ అయింది. ఒకప్పుడు ఒక్క బిడ్డే చాలు, చిన్న కుటుంబం చింత లేని కుటుంబం అంటూ ఊదరగొట్టారు. ఇప్పుడు అందుకు పూర్తి భిన్నంగా ఎక్కువ మంది పిల్లల్ని కనమంటూ మూడో బిడ్డకు రూ.30 వేలు.. నాలుగో బిడ్డకు రూ.40 వేలు ఇస్తాం అంటూ గతానికి భిన్నంగా కొత్త రాగం అందుకోవడంపై సర్వత్రా అసంతృప్తి వ్యక్తమవుతోంది.

రాజకీయ అవసరాలకు అనుగుణంగా ఇష్టానుసారం విధానాలు మార్చుకునే  విధానాన్ని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఇదంతా తన  పాలనా వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు చంద్రబాబు చేస్తున్న ప్రయత్నమని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.   జనాభా పెంచాలని కబుర్లు చెబుతున్న చంద్రబాబు తాను మాత్రం ఒక బిడ్డతోనే ఆగిపోయారు. ఆయన కుమారుడు కూడా ఒక బిడ్డనే కన్నారు.  ఈ విషయంలో ఆయన ద్వంద్వ వైఖరి ఏమిటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.  

నిరుద్యోగం తీవ్రతరం 
ప్రస్తుతం రాష్ట్రంలో దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయి. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. నిరుద్యోగం విపరీతంగా పెరిగింది. విద్య, వైద్య ఖర్చులు భరించలేని స్థాయికి చేరాయి. మధ్యతరగతి, పేద కుటుంబాలు బ్రతకడానికే తీవ్రంగా పోరాడుతున్నారు. ఒక బిడ్డను పెంచడమే సామాన్య కుటుంబాలకు భారంగా మారింది. చిన్న పిల్లల స్కూలు ఫీజులు రూ.50 వేల నుంచి రూ.2 లక్షల వరకూ ఉన్నాయి. ఇంజినీరింగ్‌ చదువు రూ.6 లక్షల నుంచి రూ.12 లక్షల వరకు వెళ్లింది. మెడిసిన్‌ అయితే కోట్లు కావాలి. చదువు పూర్తయ్యాక ఉద్యోగం వస్తుందన్న గ్యారంటీ లేదు.

ప్రైవేటు ఉద్యోగాలు అస్థిరంగా మారాయి. మధ్యతరగతి కుటుంబాలు అప్పుల్లో కూరుకుపోతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ముగ్గురు, నలుగురు పిల్లల్ని కంటె వాళ్లకు విద్య, వైద్యం, ఉద్యోగ భద్రత, జీవన భరోసా ఎవరిస్తారని చంద్రబాబును ప్రశ్నిస్తున్నారు. ఆరోగ్యశ్రీని నీరుగార్చి సామాన్యులకు వైద్యాన్ని భారంగా మార్చారు. ఆస్పత్రులకు ఆరోగ్యశ్రీ బిల్లులు చెల్లించకుండా పేద ప్రజలను నట్టేట ముంచారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అందకపోవడంతో లక్షలాది మంది విద్యార్థుల ఉన్నత విద్య కలలు కల్లలుగా మారాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఎంతమందిని కన్నా తాను చూసుకుంటానని చెప్పడంపై ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది.  

ఎన్నికల హామీలు గాలికి 
ఎన్నికల ముందు సూపర్‌ సిక్స్, బాబు ష్యూరిటీ–భవిష్యత్తుకు గ్యారెంటీ అంటూ ఎడాపెడా హామీలు ఇచ్చారు. రూ.3 వేల నిరుద్యోగ భృతి, 20 లక్షల ఉద్యోగాలు, మహిళలకు నెలకు రూ.1,500 ఆర్థిక సాయం వంటివి ఎన్నో చెప్పి అధికారంలోకి వచ్చాక వాటి గురించి మరచిపోయారు. ఇప్పటివరకూ నిరుద్యోగ భృతి ఊసే లేదు. 20 లక్షల ఉద్యోగాలు సృష్టించకపోగా ఉన్న ఉద్యోగాలను కూడా పీకేశారు. అసలు ఉద్యోగాలే లేకుండా జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేసిన ఘనత చంద్రబాబుది. 

చంద్రబాబు పాలనలో రాష్ట్రం తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి వెళ్లిపోయింది.  అప్పులు పెరిగిపోతున్నాయి. బిల్లులు చెల్లించలేని పరిస్థితి నెలకొంది. ఉద్యోగులకు ఒకటో తేదీన జీతాలు ఇవ్వలేని  చంద్రబాబు రాజకీయ ప్రయోజనాల కోసం ఇలాంటి ప్రకటనలు చేస్తూ పబ్బం గడుపుకుంటున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. గతంలో కుటుంబ నియంత్రణ మంచిదని చెప్పి ఇప్పుడు ఎక్కువ మంది పిల్లలు కనకపోతే ప్రమాదమని చెబుతున్న చంద్రబాబు భవిష్యత్తులో ఇంకేమి చెబుతారోనన్న సెటైర్లూ సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి.  

బాధ్యతారాహిత్యం 
ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి మాట్లాడే మాటలు సమాజంపై ప్రభావం చూపుతాయనే ఆలోచన లేకుండా ఇష్టానుసారం మాట్లాడడం సరికాదని రాజకీయ నిపుణులు చెబుతున్నారు. పరిస్థితులకు అనుగుణంగా మాటలు మార్చడం, గతంలో తాను చెప్పిన మాటల్ని మరిచిపోయి అందుకు విరుద్ధంగా మాట్లాడడం చంద్రబాబుకు అలవాటైన విద్యే. అదే రీతిలో ఇప్పుడు కొత్త జనాభా సిద్ధాంతంతో ప్రజలను మళ్లీ గందరగోళంలోకి నెడుతున్నారు. వాస్తవానికి ప్రస్తుతం రాష్ట్ర ప్రజలు చంద్రబాబు చెప్పే కాకమ్మ కథలు వినే స్థితిలో లేరు.  రాష్ట్ర యువతకు ఉద్యోగాలు కావాలి. పిల్లల చదువుకు భరోసా కావాలి. ఆరోగ్య రక్షణ కావాలి. ప్రజల జీవన వ్యయం తగ్గాలి. అవేమీ చేయకుండా బాధ్యతారాహిత్యంగా నలుగురు పిల్లల్ని కనమని చెప్పడం చంద్రబాబు దివాళాకోరుతనానికి నిదర్శనమని ప్రజలు విమర్శిస్తున్నారు.  

చంద్రబాబు మాటలు హాస్యాస్పదం 
ఈ రోజుల్లో ఇద్దరు పిల్లల్ని పెంచడమే కష్టంగా ఉంది. అలాంటప్పుడు చంద్రబాబు నలుగురు పిల్లల్ని కనాలని చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. ఆయన వచ్చిన తర్వాత ప్రైవేటు సంస్థలకు రెక్కలొచ్చి విద్య, వైద్యం వంటి ప్రాథమిక అవసరాలన్నీ భారంగా మారాయి. ఇటువంటి తరుణంలో నలుగురు పిల్లల్ని కంటే ఎలా పోషించాలి. ఇచ్చిన ఎన్నికలు హామీలు అమలు చేయకుండా జనాభాను పెంచమని చెప్పడం సరికాదు. – రాజపు మాధవి, వెల్లటూరు, జి.కొండూరు మండలం, ఎన్టీఆర్‌ జిల్లా

కుటుంబ నియంత్రణ మీకేనా.. మాకు అవసరం లేదా?  
సీఎం చంద్రబాబు కుటుంబం మాత్రం కుటుంబ నియంత్రణ పాటించాలి. ఆయనకు ఒకే ఒక్క కూమారుడు. ఆయన కుమారుడికీ ఒక్కడే కుమారుడు. పేదలం, మధ్య తరగతి వారైన మేం మాత్రం ముగ్గురు, నలుగుర్ని కనాలా? అలా కంటే పోత్సాహకాలిస్తారా? అసలు మీ మాటలను నమ్మొచ్చా? ఎన్నికలకు ముందు ఎన్ని హామీలిచ్చారు.. అధికారంలోకి వచ్చాక వాటిలో ఒక్కటైనా సరిగా అమలు చేశారా?        – సుమతి, కర్నూలు, లేబర్‌ కాలనీ

ఉన్నోళ్లకే విద్య, వైద్యం సరిగా లేదు.. నలుగుర్ని కనాలా?  
సూపర్‌ సిక్స్‌ హామీలను అమలు చేయకపోగా.. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఇచ్చిన సంక్షేమ పథకాలనూ రద్దు చేశారు. మళ్లీ ఇప్పుడు మూడో బిడ్డను కంటే డబ్బులిస్తామంటే ఎలా నమ్మాలి?  ఇప్పటికే ఇచ్చిన హామీలను అమలు చేయకుండా.. కొత్త హామీలివ్వడం హాస్యాస్పదం. పౌరులకు సరైన విద్య, వైద్యం అందించకుండా ప్రతి జంటా ముగ్గురు, నలుగురు పిల్లల్ని కనాలని చంద్రబాబు చెప్పడం శోచనీయం.     – అంజలి, అనంతపురం  

అప్పుడలా.. ఇప్పుడిలా..
టీడీపీ అధినేత 90వ దశకంలో కుటుంబ నియంత్రణను ప్రోత్సహించారు.  ఇప్పుడు ఆయన ప్రధాని చేపట్టనున్న నియోజకవర్గాల పునరి్వభజన (డీలిమిటేషన్‌) వల్ల ’కుటుంబ నియంత్రణ పాటించిన’ దక్షిణ భారత రాష్ట్రాలు నష్టపోతాయని గ్రహించారు. అందుకే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కువ మంది పిల్లలు పుట్టాలని కోరుతున్నారు. – ప్రియాంకా కక్కర్, ఆమ్‌ ఆద్మీ పార్టీ ప్రధాన జాతీయ ప్రతినిధి  

లోకేశ్‌తోనే మొదలుపెడదాం 
ముందున్న ఆర్థిక అనిశ్చితి కాలాన్ని దృష్టిలో పెట్టుకుని, లోకేశ్‌కు ఎక్కువ మంది పిల్లలు ఉండాలని భావిద్దాం.  – పూనమ్‌ కౌర్, నటి

తర్వాత సంగతేంటి? 
పిల్లలు పుట్టిన తర్వాత సంగతి ఏమిటి?ఆ పిల్లలకు 20 ఏళ్ల వయసులో ఉద్యోగం ఇస్తామని ప్రభుత్వం హామీ ఇస్తుందా? వారి చదువుకు ఖర్చులు భరిస్తుందా? ఆహారం, మందులు, పెంపకం ఖర్చులు ప్రభుత్వం చూసుకుంటుందా? తీవ్ర ద్రవ్యోల్బణం, అదుపు లేని నిరుద్యోగం ఉన్న ఈ కాలంలో ప్రజలకు కావాల్సింది జీవన భద్రత. పతాక శీర్షికల్లో ఎక్కే స్కీములు కాదు. – రేణుకా చౌదరి, కాంగ్రెస్‌ ఎంపీ

తప్పుదారి పట్టించే విధానం 
ఈ ఆఫర్‌ ప్రమాదకరమైన, తప్పుదారి పట్టించే విధానం. మనకు కావల్సింది... ఆరోగ్యవంతమైన అలాగే నైపుణ్యాలున్న జనాభానే కానీ.. పోషకాహార లోపంతో బాధపడేవారు, నైపుణ్యం లేని వ్యక్తులు కాదు. పోషకాహారం, పాఠశాలలు, నైపుణ్యాభివృద్ధిపై పెట్టుబడి పెట్టండి.  – కార్తి చిదంబరం, ఎంపీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement