మాజీ సీఎస్‌ జన్నత్‌ హుస్సేన్‌ కన్నుమూత | AP News: Ex IAS Officer Jannat Hussain No More | Sakshi
Sakshi News home page

మాజీ చీఫ్‌ సెక్రటరీ జన్నత్‌ హుస్సేన్‌ కన్నుమూత

Feb 23 2024 10:24 AM | Updated on Feb 23 2024 11:58 AM

AP News: Ex IAS Officer Jannat Hussain No More - Sakshi

ఉమ్మడి ఏపీకి చీఫ్‌ సెక్రటరీగా పని చేసిన జన్నత్‌ హుస్సేన్‌ ఇక లేరు. అల్జీమర్స్‌తో బాధపడుతున్న ఆయన.. 

నెల్లూరు, సాక్షి: తెలుగు రాష్ట్రానికి ప్రిన్సిపల్‌ చీఫ్‌ సెక్రటరీగా పనిచేసిన విశ్రాంతి ఐఏఎస్‌ అధికారి జన్నత్‌ హుస్సేన్‌ ఇక లేరు. శుక్రవారం తెల్లవారుజామున తన నివాస గృహంలో కన్నుమూశారు. గత కొన్నేళ్లుగా ఆయన అల్జీమర్స్‌ తో బాధపడుతున్నారు. రేపు సాయంత్రం పంజాగుట్ట శ్మశానంలో ఆయనకు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. 

1977 ఐఏఎస్‌ బ్యాచ్‌కు చెందిన జన్నత్‌ హుస్సేన్‌.. పలు జిల్లాలకు కలెక్టర్‌గా, పలు విభాగాలకు కార్యదర్శిగానూ బాధ్యతలు నిర్వహించారు. ఉమ్మడి ఏపీలో నారా చంద్రబాబు నాయుడు, వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డిలు ముఖ్యమంత్రులుగా ఉన్న సమయంలో రాష్ట్రానికి చీఫ్‌ సెక్రటరీగా పనిచేశారు. 2010 డిసెంబ‌రు 31న ప్ర‌త్యేక ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి హోదాలో రిటైర్ అయ‌న‌.. ఆ రోశయ్య హయాంలో స‌మాచార హ‌క్కు చ‌ట్టం ప్ర‌ధాన క‌మిష‌న‌ర్ గా బాధ్య‌త‌లు చేప‌ట్టారు. 2014 వ‌ర‌కూ ప‌ద‌విలోనే ఉన్నారు.

నాలుగు దశాబ్ధాలపాటు అధికారిగా తెలుగు ప్రజలకు జన్నత్‌ హుస్సేన్‌ తన సేవలు అందించారు. వైఎస్సార్‌ తొలిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసే టైంలో.. ఉచిత విద్యుత్‌ ఫైల్‌పై సంతకం చేశారు. ఆనాడు ఆ ఫైల్‌ అందించింది ఈయనే. అంతేకాదు.. నాడు ఉచిత విద్యుత్తు ప‌థ‌కం విధివిధానాల్ని ప్రిన్సిపల్‌ చీఫ్‌ సెక్రటరీ హోదాలో రూపొందించింది హుస్సేన్‌ కావడం గమనార్హం. 

ఆయనకు భార్యా, ఇద్దరు కొడుకులు.. ఓ కూతురు. రిటైర్‌ అయ్యాక  సూళ్లూరుపేట‌లో త‌న రెండో కొడుకు వ‌ద్ద ఉంటున్నారు. అయితే.. కొన్నేళ్ల కిందట ఆయన అల్జీమర్స్‌ బారిన పడ్డారు. ఉన్నత పదవిలో తాను పనిచేసిన విషయం ఆయనకు మచ్చుకు కూడా గుర్తులేకుండా పోయింది.  ఆయన ఉన్న స్థితి చాలామందిని కదిలించింది. జన్నత్‌ హుస్సేన్‌ మృతి పట్ల పలువురు రాజకీయ నేతలు, అధికారులు సంతాపం ప్రకటిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement