
సాక్షి, తాడేపల్లి: మాజీ మంత్రి కురసాల కన్నబాబు ఇంట తీవ్ర విషాదం నెలకొంది. కన్నబాబుకు పితృవియోగం కలిగింది. కన్నబాబు తండ్రి సత్యనారాయణ మృతి పట్ల వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపిన వైఎస్ జగన్.. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలన్నారు.
కాగా, కురసాల కన్నబాబు తండ్రి సత్యనారాయణ కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. ఇవాళ ఉదయం(మంగళవారం) తుదిశ్వాస విడిచారు. పలువురు పార్టీ నేతలు, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు. సత్యనారాయణ అంత్యక్రియలు ఇవాళ సాయంత్రం నిర్వహించనున్నారు.
కురసాల సత్యనారాయణ భౌతికకాయాన్ని సందర్శించిన ఉభయ గోదావరి జిల్లాల వైఎస్సార్‌సీపీ కో-ఆర్డినేటర్ బొత్స సత్యనారాయణ.. ఆయనకు నివాళులర్పించారు. దాడిశెట్టి రాజా, మాజీ మంత్రులు గుడివాడ అమర్‌నాథ్, వేణుగోపాలకృష్ణ, మాజీ ఎంపీ భరత్, వంగా గీతా, ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి, తోట నరసింహం, జక్కంపూడి రాజా, దవులూరి దొరబాబు కన్నబాబును పరామర్శించి సంతాపం తెలిపారు.