AP Industrial Policy 2023-27 With Nine Missions - Sakshi
Sakshi News home page

తొమ్మిది మిషన్స్‌తో ఏపీ కొత్త పారిశ్రామిక పాలసీ.. వివరాలు ఇవిగో..

Published Wed, Mar 22 2023 11:46 AM | Last Updated on Wed, Mar 22 2023 12:42 PM

Ap Industrial Policy 2023 27 With Nine Missions - Sakshi

సాక్షి, అమరావతి: అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించడం లక్ష్యంగా మౌలిక వసతులకు పెద్దపీట వేస్తూ 2023 – 27 పారిశ్రామిక పాలసీని రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఇందుకోసం తొమ్మిది మిషన్లను నిర్దేశించుకుని పూర్తిస్థాయి పారిశ్రామిక ఎకో సిస్టమ్‌ను అభివృద్ధి చేసేలా పాలసీలో పలు ప్రతిపాదనలు చేశారు. పరిశ్రమలకు తక్కువ వ్యయంతో అన్ని మౌలిక వసతులతో కూడిన భూములను అందుబాటు ధరల్లో అందించనున్నారు.

ఇందుకోసం నాలుగేళ్లలో మూడు లక్షల ఎకరాల భూమిని సేకరించాలని నిర్ణయించారు. పబ్లిక్, ఫ్రైవేటు భాగస్వామ్యంతో పారిశ్రామిక పార్కులు, మౌలిక వసతుల అభివృద్ధితో పాటు స్టార్టప్‌లు, పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలను అందించేలా ప్రత్యేక వ్యవస్థను ప్రోత్సహించనున్నారు. ఇదే సమయంలో అత్యధికంగా ఉపాధి కల్పిస్తున్న ఎంఎస్‌ఎంఈలతోపాటు మహిళలు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేలా పాలసీని రూపొందించారు.

సమానంగా అభివృద్ధి చెందేలా..
నాలుగేళ్ల కాలానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2023 – 27 పారిశ్రామిక పాలసీ ఈ ఏడాది ఏప్రిల్‌ 1వతేదీ నుంచి అమల్లోకి రానుంది. గత మూడేళ్లలో వచ్చిన మార్పులను పరిగణనలోకి తీసుకుంటూ అంతర్జాతీయ మార్కెట్లకు సేవలు  అందించేలా కొత్త పాలసీని రూపొందించినట్లు పరిశ్రమలు, మౌలిక వసతులు పెట్టుబడుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్‌ తెలిపారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు సమానంగా పారిశ్రామికంగా అభివృద్ధి చెందే విధంగా పాలసీలో చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఇందులో భాగంగా జిల్లాల వారీగా వివరాలు సేకరించి పరిశ్ర­మలు తక్కువగా ఉన్న చోట్ల మరిన్ని ఏర్పాట­య్యేలా చర్యలు చేపట్టినట్లు తెలిపారు.

ప్రతిపాదన నుంచి ఉత్పత్తి దాకా..
రాష్ట్రంలో పెట్టుబడి ప్రతిపాదనలతో వచ్చిన దగ్గర నుంచి ఉత్పత్తి ప్రారంభమయ్యే వరకు సింగిల్‌ విండో విధానంలో త్వరితగతిన అన్ని అనుమతులను ప్రభుత్వం మంజూరు చేయ­నుంది. భూముల కోసం పరిశ్రమలు దర­ఖాస్తు చేసుకున్న 21 రోజుల్లోనే ఏపీఐఐసీ భూమిని కేటాయిస్తుంది. పరిశ్రమలకు 33-66 ఏళ్ల కాలానికి లీజు విధానంలో భూమిని కేటాయిస్తారు. వాణిజ్య ఉత్పత్తి ప్రారంభించిన 10 ఏళ్ల తర్వాత భూములను కొనుగోలు చేసు­కునే హక్కును కల్పించనున్నారు.

ప్రభుత్వ సేవలన్నీ ఒకే గొడుగు కింద అందించే విధంగా వైఎస్సార్‌ ఏపీ వన్‌ వ్యవస్థను అభివృద్ధి చేశారు. ఎంఎస్‌ఎంఈలు, ఎస్సీ ఎస్టీలకు ప్రత్యేక ప్రోత్సాహకాలతో పాటు లార్జ్, మెగా, అల్ట్రా మెగా ప్రాజెక్టులకు పెట్టుబడి సామర్థ్యం, ఉపాధి కల్పనను బట్టి రాయితీలు, ప్రోత్సాహ­కాలను కల్పిస్తారు. మెగా, అల్ట్రా మెగా ప్రాజె­క్టులకు సంబంధించి వేగవంతంగా కార్య­రూ­పం దాల్చేలా సీనియర్‌ అధికారిని ప్రత్యే­కంగా కేటాయిస్తారు.

ప్రాజెక్టు అమ­లులో ఈ అధి­కారి అంబాసిడర్‌గా వ్యవ­హ­రి­స్తారు. విశాఖ గ్లోబల్‌ ఇన్వెస్టర్‌ సమ్మిట్‌లో కుదిరిన ఒప్పందాలను త్వరిత­గతిన వాస్తవ రూపంలోకి తెచ్చేలా సీఎస్‌ అధ్యక్షతన కమి­టీని నియమించిన రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించి ప్రత్యేక రాయి­తీ­లను ప్రకటించింది. ఒప్పందం జరిగిన రోజు నుంచి ఆర్నెల్లలో నిర్మాణ పనులు ప్రారంభించే సంస్థలకు ఎర్లీ బర్డ్‌ కింద ప్రోత్సాహకాలను కల్పించనున్నారు.
చదవండి: ఏపీలో రూ.1,750 కోట్ల పెట్టుబడులు

ఇవీ 9 మిషన్లు
ఎకనామిక్‌ గ్రోత్‌: విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులతో పాటు స్థానిక పెట్టుబడులను ఆకర్షించే విధంగా పూర్తిస్థాయి ఇండస్ట్రియల్‌ ఎకో సిస్టమ్‌ను అభివృద్ధి చేయడం. ప్రపంచస్థాయి పారిశ్రామిక మౌలిక వసతులతో పాటు లాజిస్టిక్‌ కల్పన, సులభతర వాణిజ్యం, ఎంఎస్‌ఎంఈలను ప్రోత్సహించనున్నారు.

పోర్టు ఆధారిత అభివృద్ధి: పోర్టు ప్రాంతాలు అభివృద్ధికి మూల స్థంభాలుగా ప్రణాళికలు. వీసీఐసీ, సీబీఐసీ, హెచ్‌బీఐసీ కారిడార్స్‌తో పాటు రైలు, రోడ్డు, అంతర్గత జలరవాణా మార్గాలను ప్రస్తుత పోర్టులతో పాటు కొత్తగా నిర్మించే పోర్టులకు అనుసంధానిస్తారు.

లాజిస్టిక్స్‌ వ్యవస్థను పెంచడం:  సరుకు రవాణా వ్యయం తగ్గించే విధంగా రోడ్‌ రైల్‌ నెట్‌వర్క్‌ను పెంచడం. కోస్టల్‌ షిప్పింగ్, అంతర్గత జలరవాణా మార్గాలను ప్రోత్సహించడం. లాజిస్టిక్‌ పార్కుల అభివృద్ధితో పాటు గిడ్డంగులు, శీతలీకరణ గిడ్డంగులు సౌకర్యాలను పెంచడం.

రెడీ టు బిల్డ్‌ పార్కులు: పరిశ్రమలు తక్షణం వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభించే విధంగా ప్రస్తుత పారిశ్రామిక పార్కులతో పాటు కొత్తగా వచ్చే పార్కుల్లో రెడీ టు బిల్డ్‌ ఫ్యాక్టరీలు, ఫ్లాటెడ్‌ ఫ్యాక్టరీ స్పేస్‌లు, స్టాండర్డ్‌ డిజైన్‌ ఫ్యాక్టరీస్‌ను అభివృద్ధి చేయడం. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో పారిశ్రామిక పార్కులు, మౌలిక వసతుల కల్పనతో పాటు ప్రైవేట్‌ పారిశ్రామిక, ఎంఎస్‌ఎంఈ పార్కులను నెలకొల్పడం.

పారిశ్రామిక సేవలన్నీ ఒకేచోట: ప్రభుత్వ విభాగాలకు చెందిన సేవలు, అనుమతులన్నీ ఒకేచోట లభించే విధంగా వైఎస్సార్‌ ఏపీ వన్‌ను అభివృద్ధి చేస్తారు.

ఉద్యోగ కల్పన: రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఉపాధి కల్పించేలా ఎంఎస్‌ఎంఈ రంగానికి ప్రోత్సహించడంతోపాటు ఇబ్బందుల్లో ఉన్న ఎంఎస్‌ఎంఈలకు చేయూతనివ్వడం. లార్జ్, మెగా, అల్ట్రా మెగా పరిశ్రమలకు నిపుణులైన మానవ వనరులను అందించే విధంగా శిక్షణ, ఉపాధి కోసం ఆన్‌లైన్‌ పోర్టల్‌ ఏర్పాటు.

నైపుణ్యం కలిగిన మానవ వనరులు: కనీస చదువులు పూర్తి చేసుకున్న యువతకు పరిశ్రమల్లో అవసరమైన రంగాల్లో ప్రాక్టికల్‌ శిక్షణ అందించేలా నైపుణ్య శిక్షణ కోర్సులను అందుబాటులోకి తెచ్చి సాఫ్ట్‌ స్కిల్స్‌ను పెంపొందిస్తారు.

స్టార్టప్‌ కల్చర్‌ను ప్రోత్సహించడం:  యువతను నూతన పారిశ్రామికవేత్తలుగా తీర్చి దిద్దే విధంగా మెంటారింగ్‌ కార్యక్రమాలు, స్టార్టప్‌ జోన్స్, స్టార్టప్‌లకు రాయితీలు, స్టార్టప్‌ ఫైనాన్సింగ్‌ ఎకో సిస్టమ్‌ను అభివృద్ధి చేయడం

మహిళలు, బడుగు వర్గాలకు ప్రోత్సాహం: మహిళలు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేలా ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయడం. వారిని గుర్తించి పారిశ్రామికవేత్తలుగా ఎదిగేలా చేయూతనివ్వడం.

పెట్టుబడుల ఆకర్షణకు దృష్టిసారించే  ప్రధాన రంగాలు
కెమికల్స్‌–పెట్రోకెమికల్స్‌
 ఫార్మాస్యూటికల్స్‌–బల్క్‌ డ్రగ్స్‌
టెక్స్‌టైల్స్‌ అండ్‌ అప్పరెల్స్‌
ఆటోమొబైల్‌ అండ్‌ ఆటో కాంపోనెంట్స్‌
ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఐటీ
ఆగ్రో, ఫుడ్‌ ప్రోసెసింగ్‌
 ఇంజనీరింగ్‌  అండ్‌ మెడికల్‌ డివైసెస్‌
డిఫెన్స్‌ అండ్‌ ఎయిరోస్పేస్‌
మెషినరీ అండ్‌ ఎక్విప్‌మెంట్‌
భవిష్యత్తు నాల్గవ తర్గతి పరిశ్రమలు తయారీ రంగం, బయోటెక్నాలజీ, గ్రీన్‌ హైడ్రోజన్, ఎలక్ట్రికల్‌ వెహికల్స్‌
రెన్యువబుల్‌ ఎనర్జీకి సంబంధించిన పరికరాల తయారీ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement