ఏపీలో రూ. 1,750 కోట్ల పెట్టుబడులు

1750 crore investment in Andhra Pradesh Amplus Solar and elista - Sakshi

యాంప్లస్‌ సోలార్‌ రూ. 1,500 కోట్లు

ఎలిస్టా రూ. 250 కోట్లు

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ఇటీవల గ్లోబల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ సమ్మిట్‌తో ఇన్వెస్టర్ల దృష్టిని మరింతగా ఆకర్షించిన ఆంధ్రప్రదేశ్‌లో మరో రెండు భారీ పెట్టుబడులు రానున్నాయి. యాంప్లస్‌ సోలార్‌ రూ. 1,500 కోట్లు, ఎలక్ట్రానిక్స్‌ తయారీ సంస్థ ఎలిస్టా ఇండియా రూ. 250 కోట్లు ఇన్వెస్ట్‌ చేయనున్నాయి. 7.5 కేపీటీఏ (వార్షికంగా కిలో టన్నులు) సామర్థ్యంతో హరిత హైడ్రోజన్‌ ప్లాంట్ల ఏర్పాటు కోసం రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకున్నట్లు యాంప్లస్‌ సోలార్‌  తెలిపింది.

ఇదీ చదవండి: సైబర్‌ దాడులను తట్టుకునే సామర్థ్యం మనకుందా? సిస్కో సైబర్‌ సెక్యూరిటీ కీలక సర్వే

పారిశ్రామిక వినియోగ అవసరాల కోసం వీటిని నెలకొల్పనున్నట్లు సంస్థ ఎండీ, సీఈవో శరద్‌ పుంగాలియా వివరించారు. అంతర్జాతీయ హరిత హైడ్రోజన్‌ హబ్‌గా ఎదగాలన్న భారత లక్ష్య సాకారంలో తాము కూడా పాలుపంచుకోనున్నట్లు ఆయ న వివరించారు. ఆ దిశగా ఈ ఎంవోయూ తొలి అడుగు అని శరద్‌ చెప్పారు. పెట్రోకెమికల్స్, సిమెంటు, ఎరువులు తదితర రంగాల సంస్థలకు ఆంధ్రప్రదేశ్‌ పారిశ్రామిక హబ్‌గా మారిన నేపథ్యంలో ఆయా పరిశ్రమల అవసరాల కోసం పునరుత్పాదకత విద్యుదుత్పత్తికి పుష్కలంగా అవకాశాలు ఉన్నా యని ఆయన పేర్కొన్నారు. యాంప్లస్‌ పోర్ట్‌ఫోలియోలో 1.4 గిగావాట్ల సోలార్‌ అసెట్లు ఉన్నాయి.  

కడపలో ఎలిస్టా ప్లాంటు.. 
దేశీయంగా అమ్మకాలు, ఎగుమతుల కోసం కడపలో తయారీ ప్లాంటును ఏర్పాటు చేయనున్నట్లు ఎలక్ట్రానిక్స్‌ తయారీ సంస్థ ఎలిస్టా ఇండియా వెల్లడించింది. దీనిపై వచ్చే అయిదేళ్లలో దశలవారీగా రూ. 250 కోట్లు ఇన్వెస్ట్‌ చేయనున్నట్లు సంస్థ సీఎండీ సాకేత్‌ గౌరవ్‌ తెలిపారు. తొలుత రూ. 50 కోట్లు ఇన్వెస్ట్‌ చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ ప్లాంటులో ఏటా పది లక్షల పైచిలుకు స్మార్ట్‌ యూనిట్లు, మానిటర్లను తయారు చేయనున్నట్లు ఆయన వివరించారు. అ తర్వాత ఫ్రిజ్‌లు, వాషింగ్‌ మెషీన్లు, డిష్‌వాషర్లు వంటి గృహోపకరణాల విభాగాల్లోకి కూడా ప్రవేశించనున్నట్లు గౌరవ్‌ చెప్పారు.

ఇదీ చదవండి: గోపీనాథన్‌ను వదులుకోలేకపోతున్న టీసీఎస్‌.. కీలక బాధ్యతలపై చర్చలు!

ప్రస్తుతం రూ. 200 కోట్ల స్థాయిలో ఉన్న తమ ఆదాయాలు ఈ ప్లాంటు పూర్తిగా అందుబాటులోకి వస్తే రూ. 1,500 కోట్లకు చేరగలవని ఆయన పేర్కొన్నారు. దీనితో 500 పైగా ఉద్యోగాల కల్పన జరుగుతుందన్నారు. ఆంధ్రప్రదేశ్‌ ప్లాంటు నుంచి వచ్చే ఆదాయంలో 60 శాతం వాటా ఎగుమతుల మార్కెట్‌ నుంచే ఉంటుందని అంచనా వేస్తున్నట్లు గౌరవ్‌ తెలిపారు. యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌కి చెందిన టెక్నోడోమ్‌ గ్రూప్‌లో భాగంగా 2020లో ఎలిస్టా ఏర్పాటైంది.

ఇదీ చదవండి: హౌసింగ్‌ బూమ్‌..  బడ్జెట్‌ ఇళ్లకు బాగా డిమాండ్‌

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top