రూ.5 లక్షల లోపున్న ఉపాధి హామీ బిల్లులు చెల్లించాం

AP Govt Says To Highcourt Paid Bills Of Less Than 5 Lakh NREGA - Sakshi

మిగిలిన బకాయిలు కూడా చెల్లిస్తాం

హైకోర్టుకు నివేదించిన రాష్ట్ర ప్రభుత్వం

సాక్షి, అమరావతి: ఉపాధి హామీ పనుల్లో రూ.5 లక్షల కన్నా తక్కువ విలువైన పనులకు సంబంధించిన బిల్లులను చెల్లించేశామని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. రూ.5 లక్షలకు పైబడిన పనులకు రూ.1,117 కోట్లు చెల్లించాల్సి ఉందని, రూ.513 కోట్లు విడుదల చేస్తున్నట్లు కేంద్రం నుంచి సమాచారం వచ్చిందని, ఈ మొత్తం నుంచి ఆ బకాయిలను చెల్లిస్తామని వివరించింది. ఈ వివరాలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు తదుపరి విచారణను ఈ నెల 24కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్‌ చాగరి ప్రవీణ్‌కుమార్, జస్టిస్‌ బొప్పన కృష్ణమోహన్‌లతో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.

ఉపాధి హామీ పథకం కింద తాము చేసిన పనులకు సంబంధించిన బకాయిలను ప్రభుత్వం చెల్లించడం లేదంటూ హైకోర్టులో పలు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలైన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాలపై బుధవారం హైకోర్టు మరోసారి విచారణ జరిపింది. సీజే జస్టిస్‌ గోస్వామి సెలవులో ఉండటంతో ఈ వ్యాజ్యాలు జస్టిస్‌ ప్రవీణ్‌కుమార్‌ ధర్మాసనం ముందు విచారణకు వచ్చాయి.

గత విచారణ సమయంలో ధర్మాసనం ఇచ్చిన ఆదేశాల మేరకు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌ఎస్‌ రావత్, పంచాయతీరాజ్‌ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్‌ గిరిజా శంకర్‌లు కోర్టు ముందు హాజరయ్యారు. బకాయిల చెల్లింపునకు తీసుకుంటున్న చర్యలను సీజే ధర్మాసనం ముందే వివరించాలని ధర్మాసనం ఈ ముగ్గురు అధికారులకు స్పష్టం చేసింది. తదుపరి విచారణ ఈ నెల 24కి వాయిదా వేసింది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top