Andhra Pradesh: ఉద్యోగులకు శుభవార్త

AP govt orders granting above five percentage drought allowance - Sakshi

5.24 శాతం కరువు భత్యం మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు

2019 జులై నుంచి చెల్లించాల్సిన మొత్తం మంజూరు

పెరిగిన డీఏ వచ్చే ఏడాది జనవరి నుంచి నగదు రూపంలో ఫిబ్రవరి 1న వేతనాలతో చెల్లింపు

2019 జులై నుంచి 2021 డిసెంబర్‌ వరకు బకాయిలు వచ్చే ఏడాది జనవరి నుంచి 3 వాయిదాల్లో జీపీఎఫ్‌కు జమ

సీపీఎస్‌ ఉద్యోగులకు బకాయిలు వచ్చే ఏడాది జనవరి నుంచి మూడు వాయిదాల్లో నగదు రూపంలో చెల్లింపు

సాక్షి, అమరావతి: గతంలో ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం ప్రభుత్వోద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం కోవిడ్‌ సంక్షోభంలోనూ శుభవార్త అందించింది. జులై 2019 నుంచి చెల్లించాల్సిన కరువు భత్యాన్ని (డీఏ) మంజూరు చేసింది. ఉద్యోగుల మూల వేతనంలో ప్రస్తుతమున్న 33.536 శాతం నుంచి 38.776 శాతానికి (5.24) కరువు భత్యం పెంచుతూ ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి ఎస్‌ఎస్‌ రావత్‌ సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. 

► 2019 జులై నుంచి 2021 డిసెంబర్‌ వరకు కరువు భత్యం బకాయిలను వచ్చే ఏడాది జనవరి నుంచి మూడు సమాన వాయిదాల్లో ఉద్యోగుల జీపీఎఫ్‌కు జమచేయనున్నట్లు ఉత్తర్వుల్లో తెలిపారు. 
► పెరిగిన కరువు భత్యాన్ని వచ్చే ఏడాది జనవరి నుంచి నగదు రూపంలో ఫిబ్రవరి 1వ తేదీ వేతనాలతో చెల్లిస్తారు. 
► అలాగే, సీపీఎస్‌ ఉద్యోగులకు పెరిగిన డీఏని వచ్చే ఏడాది జనవరి నుంచి నగదు రూపంలో ఫిబ్రవరి 1వ తేదీ వేతనాల నుంచి చెల్లిస్తారు. 
► సీపీఎస్‌ ఉద్యోగులకు 2019 జులై నుంచి 2021 డిసెంబర్‌ వరకు డీఏ బకాయిలను వచ్చే ఏడాది జనవరి నుంచి మూడు సమాన వాయిదాల్లో నగదు రూపంలో చెల్లించనున్నట్లు ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

ఎవరెవరికి వర్తిస్తుందంటే..
పెరిగిన కరువు భత్యం జిల్లా పరిషత్, మండల పరిషత్, గ్రామ పంచాయతీ, జిల్లా గ్రంధాలయాల సమితి, రెగ్యులర్‌ స్కేల్స్‌లో పనిచేస్తున్న వర్క్‌ చార్జ్‌డ్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ ఉద్యోగులకు వర్తించనుంది. అంతేకాక.. రెగ్యులర్‌ పే స్కేల్స్‌లో పనిచేస్తున్న ఎయిడెడ్‌ ఇనిస్టిట్యూషన్స్, ఎయిడెడ్‌ పాలిటెక్నిక్‌లో పనిచేస్తున్న టీచింగ్, నాన్‌ టీచింగ్‌ ఉద్యోగులకు వర్తిస్తుంది. విశ్వవిద్యాలయాలతో పాటు వ్యవసాయ యూనివర్శిటీ.. జవహర్‌లాల్‌ నెహ్రూ టెక్నాలజీ యూనివర్శిటీ, డాక్టర్‌ వైఎస్సార్‌ ఉద్యాన యూనివర్శిటీలో రెగ్యులర్‌ పే స్కేల్స్‌లో పనిచేస్తున్న టీచింగ్, నాన్‌ టీచింగ్‌ సిబ్బందికీ పెరిగిన కరువు భత్యం వర్తించనుంది. వ్యవసాయ మార్కెట్‌ కమిటీ ఉద్యోగుల డీఏకు సొంత నిధులను వినియోగించుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 

సీఎం జగన్‌కు కృతజ్ఞతలు
రాష్ట్ర ప్రభుత్వం 2019 జులై నుంచి చెల్లించాల్సిన 5.24 శాతం కరువు భత్యం విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీచేయడంపట్ల ఆంధ్రప్రదేశ్‌ గవర్నమెంట్‌ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ చైర్మన్‌ కే వెంకట్రామిరెడ్డి హర్షం వ్యక్తంచేశారు. డీఏ మంజూరు చేస్తూ ఉత్తర్వులు ఇప్పించినందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top