కర్నూలులో రాష్ట్ర జ్యుడిషియల్‌ అకాడమీ

AP Govt Grant Permission State Judicial Academy at Kurnool - Sakshi

శాశ్వత ప్రాతిపదికన ఏర్పాటు

అనుమతి మంజూరు చేసిన రాష్ట్ర ప్రభుత్వం

ప్రస్తుతానికి మంగళగిరిలో ఏర్పాటు

సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని న్యాయాధికారులకు శిక్షణ ఇచ్చే రాష్ట్ర జ్యుడిషియల్‌ అకాడమీని శాశ్వత ప్రాతిపదికన కర్నూలులో ఏర్పాటు చేసేందుకు అనుమతి మంజూరు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అకాడమీని ప్రస్తుతానికి మంగళగిరిలో అద్దె భవనంలో ఏర్పాటు చేసేందుకు అనుమతి ఇచ్చింది. రాష్ట్ర విభజన తరువాత ఇప్పటివరకు రాష్ట్రంలో జ్యుడిషియల్‌ అకాడమీ లేదు. దీంతో రాష్ట్రంలో జ్యుడిషియల్‌ అకాడమీ ఏర్పాటుకు హైకోర్టు న్యాయమూర్తుల కమిటీ సిఫారసులు పంపింది.

ఈ సిఫారసులను పరిగణనలోకి తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం కర్నూలులో అకాడమీ ఏర్పాటుకు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు న్యాయశాఖ కార్యదర్శి జి.సత్యప్రభాకర్‌ పేరు మీద జీవో జారీ అయింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ జ్యుడిషియల్‌ అకాడమీలో ఉన్న సిబ్బందిలో 58.32 శాతం మించకుండా సిబ్బందిని మంజూరు చేస్తున్నట్లు ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. సిబ్బంది మంజూరు, మౌలిక సదుపాయాల కల్పన వివరాలతో తగిన ఉత్తర్వులను వేరుగా జారీ చేస్తామంది.

ఈ ఉత్తర్వులకు అనుగుణంగా తగిన చర్యలు చేపట్టాలని హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌ను కోరింది. కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటు చేయాలని సంకల్పించిన రాష్ట్ర ప్రభుత్వం.. ఇప్పటికే అక్కడ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్, రాష్ట్ర లోకాయుక్త కార్యాలయాలను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top