రాష్ట్రానికి తుపాన్ల దెబ్బ.. 90వేల కోట్లు నష్టం

Ap Faces Loss By Cyclone Nearly 90 Thousand Crore - Sakshi

తుపానులు అనేక దశాబ్దాలుగా రాష్ట్రంలో విధ్వంసాన్ని సృష్టిస్తున్నాయి. 1977 నుంచి ఇప్పటివరకు ఏకంగా 66 తుపాన్లు రాష్ట్రంపై విరుచుకుపడ్డాయి. రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ అంచనాల ప్రకారం.. వీటి వల్ల రూ.90 వేల కోట్లకుపైగా ఆర్థిక నష్టం జరిగింది. 1891 నుంచి 2019 వరకు 184 తుపాన్లు ఏపీ తీరంలో తీరం దాటినట్లు ఐఎండీ (భారత వాతావరణ శాఖ) నివేదికలు చెబుతున్నాయి. ఏటా అక్టోబర్, నవంబర్, డిసెంబర్‌ల్లో కనీసం ఒక తుపానైనా రాష్ట్రంపై తీవ్ర ప్రభావం చూపడం ఆనవాయితీగా మారింది. ప్రతి రెండు, మూడేళ్లకు ఒకసారి వీటిలో తీవ్ర తుపానులు ఉంటున్నాయి. జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా ప్రకారం.. ఒడిశా తర్వాత తుపాన్ల బారిన ఎక్కువగా పడుతున్న రెండో రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ ఉంది. బంగాళాఖాతం తుఫాన్లు ఏర్పడడానికి అనువైన ప్రాంతంగా ఉండడమే ఇందుకు కారణం.

1977 నుంచి ఇప్పటివరకు రాష్ట్రంపై తీవ్ర ప్రభావం చూపిన 66 తుపాన్లు
►   ఈ 43 ఏళ్లలో 16,450 మంది మృత్యువాత
►  అతి తీవ్ర తుపాన్లు.. దివిసీమ ఉప్పెన, హుద్‌హుద్‌
►   దివిసీమ ఉప్పెనలో 10 వేల మంది మృతి
►   తరచూ తుపాను బారిన పడుతున్న 190 మండలాలు
►  తీవ్ర తుపాను ముప్పును ఎదుర్కొంటున్న 692 గ్రామాలు
►   తుపాన్లకు బంగాళాఖాతం అత్యంత అనువైన ప్రాంతం కావడమే దీనికి కారణం
►  దేశంలో ఒడిశా తర్వాత తుపాన్ల తీవ్రత ఏపీలోనే ఎక్కువ

హుద్‌హుద్‌దే అగ్రస్థానం..
తుపాన్ల వల్ల ఎక్కువ ఆస్తి నష్టం 2014లో వచ్చిన హుద్‌హుద్‌ వల్ల జరిగింది. 180 కిలోమీటర్ల వేగంతో వీచిన గాలులు ఉత్తరాంధ్ర జిల్లాలను తుడిచిపెట్టేశాయి. ఆ తుపాను వల్ల రూ.21,908 కోట్ల నష్టం వాటిల్లింది. అలాగే అతి భయంకరమైన తుపాన్లలో 1977లో దివిసీమ ఉప్పెన నిలిచింది. అధికారిక లెక్కల ప్రకారమే ఈ ఉప్పెనలో పది వేల మంది మృతి చెందారు. మొత్తం 66 తుపాన్ల వల్ల 77.78 లక్షల ఇళ్లు దెబ్బతిన్నాయి. 1976 నవంబర్‌లో మచిలీపట్నం వద్ద తీరం దాటిన తీవ్ర తుపానులో ఎక్కువ ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఈ 66 తుపాన్ల వల్ల 16,450 మంది మృతి చెందగా 12.66 కోట్ల మంది ప్రభావితమయ్యారు. తుపానుల వల్ల వచ్చిన భారీ వర్షాలతో వరదలు ముంచెత్తాయి. ఇక తుపానుల ఉప్పెనలతో తీర గ్రామాల్లోని లోతట్టు ప్రాంతాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.

రాష్ట్రంలో 974 కిలోమీటర్ల తీర ప్రాంతం
రాష్ట్రంలోని 9 కోస్తా జిల్లాల్లో 974 కిలోమీటర్ల మేర 92,906 చదరపు కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది. తీర ప్రాంతంలోని 430 మండలాల్లో 190 మండలాలు తుపాన్ల బారిన పడుతున్నాయి. ఇందులో 17 మండలాలు అతి తీవ్ర ముప్పును ఎదుర్కొంటుండగా, 31 మండలాలు తీవ్ర ముప్పును ఎదుర్కొంటున్నాయి. అలాగే సముద్ర తీరానికి 2 కిలోమీటర్లలోపు ఉన్న 692 తీర గ్రామాలు తుపాన్ల బారిన పడుతున్నాయి. ఈ సమయంలో వచ్చే పెద్ద అలల వల్ల ఈ గ్రామాలు దెబ్బతింటున్నాయి. 9 జిల్లాల్లోని మొత్తం జనాభాలో 11 శాతం తుపాన్ల ముప్పు పరిధిలో ఉన్నారు. ఇందులో 7 శాతం అర్బన్, 4 శాతం రూరల్‌ ప్రాంతాల ప్రజలు ఉన్నారు. 

విపత్తు ప్రణాళికలు అమలు చేస్తున్నాం..
గ్లోబల్‌ వార్మింగ్‌ (భూమి వేడెక్కడం), వాతావరణ మార్పుల వల్ల కొన్నేళ్లుగా తుపానుల తీవ్రత ఎక్కువగా ఉంటోంది. వీటికి సంబంధించి ఎప్పటికప్పుడు ముందస్తు హెచ్చరికలు జారీ చేస్తూ ప్రజలు, ప్రభుత్వ శాఖలను అప్రమత్తం చేస్తున్నాం. ఇందుకోసం దీర్ఘకాలిక ప్రణాళికలు అమలు చేస్తున్నాం. నష్టాన్ని తగ్గించడం, మరణాలు సంభవించకుండా చూడడం, ఆస్తి, మౌలిక వసతుల నష్టాన్ని సాధ్యమైనంత తక్కువ జరిగేలా చూస్తున్నాం. గ్రామ, మండల, జిల్లా స్థాయిల్లో విపత్తు నిర్వహణ ప్రణాళికలు అమలవుతున్నాయి. తుపాన్లకు ముందు, వచ్చిన తర్వాత ఏం చేయాలి, ఏ శాఖ ఎలా వ్యవహరించాలో చెప్పడంతోపాటు ఆ పనిని సరిగా చేస్తున్నాయో, లేదో పర్యవేక్షిస్తున్నాం. 
– కె.కన్నబాబు, కమిషనర్, రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top