మళ్లిస్తున్న వరద నీటిని లెక్కలోకి తీసుకోవద్దు

AP ENC Letter To Krishna River Board Over Not Consider Projects Flood Water - Sakshi

వరదలను నియంత్రించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే

అందుకే కృష్ణా వరద నీటిని మళ్లిస్తున్నాం

కృష్ణా బోర్డు సభ్య కార్యదర్శి డీఎం రాయ్‌పురేకి ఈఎన్‌సీ లేఖ

సాక్షి, అమరావతి: రెండు రాష్ట్రాల్లో కృష్ణా నది పరీవాహక ప్రాంతంలోని జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల ప్రాజెక్టు గేట్లు ఎత్తేయడం వల్ల ప్రకాశం బ్యారేజీ నుంచి వరద జలాలు సముద్రంలో కలుస్తుండటాన్ని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కృష్ణా బోర్డు దృష్టికి తీసుకెళ్లింది. సముద్రంలో కలవడం వల్ల జలాలు వృథా అవుతాయని.. సద్వినియోగం చేసుకోవడానికి వరద నీటిని మళ్లిస్తున్నామని పేర్కొంది. మళ్లిస్తున్న వరద నీటిని రాష్ట్ర వాటా కింద లెక్కించకూడదని కోరింది. ఈ మేరకు కృష్ణా బోర్డు సభ్య కార్యదర్శి డీఎం రాయ్‌పురేకి రాష్ట్ర జలవనరులశాఖ ఈఎన్‌సీ సి.నారాయణరెడ్డి శుక్రవారం లేఖ రాశారు. ఆ లేఖలో ప్రధానాంశాలు..

కృష్ణా వరద ప్రవాహం వల్ల జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల ప్రాజెక్టుల్లో నీటిమట్టం గరిష్ఠ స్థాయికి చేరుకుంది. దీంతో గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఆ నీరు ప్రకాశం బ్యారేజీ ద్వారా సముద్రంలో కలుస్తోంది.
విభజన చట్టం 11వ షెడ్యూలులో సెక్షన్‌–85(7)(ఈ) ప్రకారం ప్రకృతి విపత్తులను నియంత్రించాల్సిన బాధ్యత రెండు రాష్ట్రాలపై ఉంటుంది. వరదలను నియంత్రించడంలోను, కరవు నివారణ చర్యలు చేపట్టడంలోను రెండు రాష్ట్రాలకు కృష్ణా బోర్డు సలహాలు ఇవ్వాలి. ఈ నిబంధన ప్రకారం వరద ముప్పును తప్పించాల్సిన బాధ్యత ఏపీ ప్రభుత్వంపై ఉంది. ఈ నేపథ్యంలోనే వరద నీటిని మళ్లిస్తున్నాం. వృథాగా సముద్రంలో కలిసే వరద నీటిని మళ్లించడం వల్ల ఎవరి ప్రయోజనాలకు విఘాతం కలగదు. ఈ నేపథ్యంలో మళ్లిస్తున్న వరద నీటిని రాష్ట్ర వాటా కింద పరిగణించకూడదు.
విలువైన జలాలు వృథాగా సముద్రంలో కలుస్తున్న సమయంలో విద్యుదుత్పత్తి చేయకపోతే జాతీయ ప్రయోజనాలు దెబ్బతింటాయి. ఈ నేపథ్యంలోనే శ్రీశైలం కుడిగట్టు కేంద్రంలో విద్యుదుత్పత్తికి అనుమతి ఇవ్వాలని ఇప్పటికే కోరాం. ఆ మేరకు విద్యుదుత్పత్తి చేస్తున్నాం.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top