లింగ వివక్ష చూపే ఆర్టీసీ సర్క్యులర్‌ రద్దు 

AP: Cancellation Of RTC Circular On Gender Discrimination - Sakshi

హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ బట్టు దేవానంద్‌ తీర్పు 

శ్రామిక్‌ పోస్టుకు లక్ష్మి దరఖాస్తుపై నిర్ణయం తీసుకోవాలని ఆర్టీసీకి ఆదేశం 

సాక్షి, అమరావతి: రాజ్యాంగం ప్రకారం చట్టం ముందు అందరూ సమానులేనని, కుల, మత, జాతి, లింగ, ప్రాంతీయ బేధాలు చూపడానికి వీల్లేదని హైకోర్టు తేల్చి చెప్పింది. మహిళల పట్ల వివక్ష చూపేలా, రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నందున.. ఆర్టీసీ ఎండీ 2003లో జారీచేసిన సర్క్యులర్‌ను రద్దుచేస్తున్నట్లు ప్రకటించింది. కారుణ్య నియామకం కోసం మహిళ చేసుకున్న దరఖాస్తును పరిగణనలోకి తీసుకుని శ్రామిక్‌ లేదా ఆమెకు తగిన పోస్టు ఇచ్చే విషయంలో ఆరు వారాల్లోపు నిర్ణయం తీసుకోవాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ బట్టు దేవానంద్‌ ఇటీవల కీలక తీర్పు వెలువరించారు.

కృష్ణాజిల్లా ఇబ్రహీంపట్నం మండలం తుమ్మపాళేనికి చెందిన ఆర్టీసీ డ్రైవర్‌ నేనావత్‌ శ్రీనివాస్‌ 2007 ఫిబ్రవరి 16న మరణించారు. కారుణ్య నియామకం కింద తనకు కండక్టర్, అటెండర్, శ్రామిక్‌ లేదా ఇతర ఏదైనా పోస్టు ఇవ్వాలంటూ 2007 ఆగస్టులో శ్రీనివాస్‌ భార్య లక్ష్మి ఆర్టీసీ అధికారులకు దరఖాస్తు చేసుకున్నారు. 2003లో ఆర్టీసీ ఎండీ ఇచ్చిన సర్క్యులర్‌ ప్రకారం మహిళలు శ్రామిక్‌ పోస్టుకు అర్హులు కాదని అధికారులు తెలిపారు. మూడు సెంటీమీటర్ల ఎత్తుకు సంబంధించి మినహాయింపు ఇచ్చేందుకు అధికారులు తిరస్కరించడంతో ఆమెను కండక్టర్‌ పోస్టుకు పరిగణనలోకి తీసుకోలేదు. ఇదే సమయంలో కొందరికి క్లీనర్లుగా పోస్టులు ఇచ్చారు. దీనిపై లక్ష్మి 2013లో హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై న్యాయమూర్తి జస్టిస్‌ బట్టు దేవానంద్‌ ఇటీవల తుది విచారణ జరిపి తీర్పు చెప్పారు.

ఓ ఉద్యోగి మృతి చెందితే అతడి కుటుంబసభ్యులు కారుణ్య నియామకం కోసం పెట్టుకునే దరఖాస్తులను మొదట్లో గ్రేడ్‌ 2 డ్రైవర్, గ్రేడ్‌ 2 కండక్టర్, క్లీనర్‌ (శ్రామిక్‌) పోస్టులకు పరిగణనలోకి తీసుకునే వారని న్యాయమూర్తి తెలిపారు. శ్రామిక్, మెకానిక్, చార్జ్‌మెన్‌ పోస్టులను పురుషులకే పరిమితం చేస్తూ 2003 మే 26న ఆర్టీసీ ఎండీ ఇచ్చిన సర్క్యులర్‌ మహిళల పట్ల వివక్ష చూపడమేనని, అందువల్ల దాన్ని రద్దుచేస్తున్నామని చెప్పారు. కారుణ్య నియామకం కోసం లక్ష్మి పెట్టుకున్న దరఖాస్తును పరిగణనలోకి తీసుకుని, శ్రామిక్‌ లేదా ఆమెకు తగిన పోస్టు ఇచ్చే విషయంలో ఆరు వారాల్లోపు నిర్ణయం తీసుకోవాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించారు.   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి



 

Read also in:
Back to Top