
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వ భాగస్వామి భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అన్యాయానికి గురవుతోందా? నామ్ కా వాస్తే మాత్రమే ప్రభుత్వ భాగస్వామిగా మిగిలిపోతోందా? ఆ పార్టీ నేతలు స్వయంగా వాపోతున్న విషయాలివే. ఈ ఆవేదన కూడా అర్థం చేసుకోదగ్గదే. ఏదో పెద్దన్న పాత్ర పోషిద్దామన్న ఆలోచనతో తెలుగుదేశంతో జతకట్టిన ఆ పార్టీ రాష్ట్ర నేతలకు ఇప్పుడు కనీసం చిన్నతమ్ముడు పాత్ర కూడా లభిస్తున్నట్లు లేదు. కొందరు మిత్రపక్ష నేతలు ఇప్పటికే బీజేపీని ఐదు శాతం పార్టీగా అవహేళన చేస్తున్నారని వీరు వాపోతున్నారు. పార్టీకి కొత్త అధ్యక్షుడుగా పీవీఎన్ మాధవ్ ఎన్నికైన సందర్భంగా జరిగిన సమావేశంలో కొంతమంది నేతలు చేసిన వ్యాఖ్యలు వారిలో గూడుకట్టుకున్న అసంతృప్తికి దర్పణం పడుతున్నాయి.
మంత్రివర్గం కూర్పు నుంచి, నామినేటెడ్ పదవుల నియామకం వరకూ అన్నింటిలోనూ తమకు అన్యాయం జరుగుతోందన్నది వారి ఆవేదన. 2014-19 మధ్యకాలంలో బీజేపీకి నలుగురు ఎమ్మెల్యేలే ఉన్నా కామినేని శ్రీనివాస్, పి.మాణిక్యాలరావుల రూపంలో రెండు మంత్రి పదవులు దక్కాయి. 2024లో ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఉన్నా, ఒకే మంత్రి పదవి దక్కడం.. అది కూడా ఢిల్లీలో పలుకుబడి కలిగిన ధర్మవరం ఎమ్మెల్యే సత్యకుమార్ కావడం విశేషం. ఆ నియోజకవర్గానికి ఆయనకు సంబంధమే లేదట. సూట్ కేస్‌తో ధర్మవరం వెళ్లి ఎమ్మెల్యే అయిపోయారని, తదుపరి మంత్రి అయ్యారని వివిధ పార్టీల నేతలు వ్యాఖ్యానిస్తుంటారు. విశాఖ నార్త్ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ఈసారి మంత్రి పదవి ఆశించి భంగపడ్డట్టు చెబుతున్నారు.
ఆ నేపథ్యంలోనే ఈ సభలో ఆయన తన బాధను వ్యక్తం చేసినట్లు అనుకుంటున్నారు. కూటమి ప్రభుత్వంలో బీజేపీ నేతలకు ప్రాధాన్యం, గుర్తింపు లేదని, బీజేపీతో పొత్తు లేకపోతే రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉండేవో తెలుసుకోండని రాజు వ్యాఖ్యానించారు. ఇది నిజం కూడా. ఎందుకంటే 2024 శాసనసభ ఎన్నికలలో బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి తెలుగుదేశం నానా తంటాలు పడింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ద్వారా రాయబారాలు జరిపింది. ఆ విషయాన్ని ఆయన ఆ రోజుల్లో బహిరంగంగానే చెబుతూ తాను టీడీపీ పొత్తు గురించి మాట్లాడితే బీజేపీ పెద్దలు చివాట్లు పెట్టారని అనేవారు. అయినా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు లోకేష్‌లు బతిమలాడి మరీ పొత్తు కుదిరేలా చేసుకున్నారు.
పొత్తు కోసం చంద్రబాబు స్వయంగా ఢిల్లీలో రెండు,మూడు రోజులు వేచి చూసిన సందర్భాలూ ఉన్నాయి. స్కిల్ స్కామ్‌లో చంద్రబాబు అరెస్టు అయిన తర్వాత లోకేష్ తన పెద్దమ్మ పురందేశ్వరిని, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని వెంటబెట్టుకుని కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిశారు. ఆ క్రమంలోనే పొత్తు పెట్టుకోవడానికి మంతనాలు జరిగాయి. పురందేశ్వరి బీజేపీ అధ్యక్షురాలిగా ఉండడం కూడా కలిసి వచ్చింది. అంతేకాక వైఎస్సార్ కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవడానికి బీజేపీ నాయకత్వం ఆసక్తి చూపినా, వివిధ కారణాల వల్ల వైసీపీ ముందుకు రాలేదు. ఆ తర్వాత బీజేపీ కూడా టీడీపీ, జనసేనలతో పొత్తుకు ఓకే చేసిందని చెబుతారు.
2019 ఎన్నికల సమయంలో చంద్రబాబు ప్రధాని మోడీని, భారతీయ జనతా పార్టీని ఎంత తీవ్రంగా విమర్శించారో గుర్తు చేసుకుంటే.. రాజకీయాలలో ఇంతగా దూషించుకుని మళ్లీ కలవగలుగుతారా అన్న సందేహం వస్తుంది. ఎలాగైతేనేం..పొత్తు కుదరడంతో బీజేపీ తన కార్డును ప్లే చేసినట్లే ఉందని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తుంటారు. కేంద్ర ఎన్నికల సంఘం అప్పట్లో కూటమి ప్రయోజనాలకు అనుకూలంగా పని చేసిందన్న విమర్శలు వచ్చాయి. కొందరు పోలీసు అధికారులను బదిలీ చేసిన తీరు దీనికి దర్పణం పడుతుందన్న వ్యాఖ్యలు వచ్చాయి. అంతేకాక ఈవీఎంల మానిప్యులేషన్ జరగిందని కూడా చాలా మంది నమ్ముతారు. పోలింగ్ ముగిసే సమయానికి నమోదైన ఓట్ల శాతం, ఆ తర్వాత అర్దరాత్రికి పెరిగిన ఓట్ల శాతంపై పలు అనుమానాలు వచ్చాయి. అయినా ఎన్నికల సంఘం వాటిని పట్టించుకోలేదు.
ఎన్నికల తర్వాత వీవీపాట్ స్లిప్‌లను, ఈవీఎంలతో కలిపి లెక్కించాలని కొందరు అభ్యర్థులు కోరినా ఎన్నికల సంఘం పట్టించుకోకపోవడంతో అనుమానాలు మరిన్ని పెరిగాయి. ఇదంతా కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండడం వల్లే జరిగిందన్నది పలువురి భావన. ఆ విషయం నేరుగా చెప్పకపోయినా, విష్ణుకుమార్ రాజు చేసిన వ్యాఖ్యల మతలబు ఇదేనన్న సందేహాం వస్తుంది. కూటమి ప్రభుత్వం వచ్చాక టీడీపీ వ్యూహాత్మకంగా కేంద్రంలోని బీజేపీ పెద్దలతో సఖ్యత నడుపుతూ, వారు కోరిన విధంగా రాజ్యసభ సీట్లు కేటాయిస్తూ, క్షేత్ర స్థాయి బీజేపీ నేతలను పట్టించుకోవడం లేదన్నది ఒక అభిప్రాయం.ఈ నేపథ్యంలోనే తమను ఐదు శాతం పార్టీగా ప్రచారం చేయడాన్ని బీజేపీ నేతలు ఆక్షేపిస్తున్నారు.
అయినా బీజేపీ నేతల డిమాండ్లు ఎంతవరకు నెరవేరతాయన్నది అప్పుడే చెప్పలేం. గతంలో బీజేపీతోపాటు ఇతరత్రా వారు కూడా పురందేశ్వరిని టీడీపీ ప్రతినిధే అన్నట్లుగా పరిగణిస్తుండే వారు. ఒకప్పుడు చంద్రబాబుకు దగ్గుబాటి కుటుంబానికి మధ్య పరిస్థితి ఉప్పు, నిప్పుగా ఉన్నా, తదుపరి వారి కుటుంబాల మధ్య రాజీ చేసుకున్నారు. దీంతో ఒరిజినల్ బీజేపీ నేతలు వెనకబడిపోయారు. ఆ క్రమంలోనే బీజేపీ ఎమ్మెల్యే సీట్లు కూడా పలువురు మాజీ టీడీపీ నేతలకే దక్కాయని అంటారు. గెలిచిన బీజేపీ ఎమ్మెల్యేలలో ఐదుగురు టీడీపీ మద్దతుదారులు కావడం విశేషం. ఇదేమి రహస్యం కాదు. వారిలో ఒకరైన జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కూడా బీజేపీకి సరైన ప్రాధాన్యత లభించడం లేదని అన్నారట. ఆయన కూడా చంద్రబాబు ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన నేపథ్యంలో సహజంగానే అసంతృప్తి ఉంటుంది.
నామినేటెడ్ పదవులకోసం చంద్రబాబుకు జాబితాలు ఇస్తున్నా పట్టించుకోవడం లేదట. తాజాగా కొత్త అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ ఒరిజినల్ బీజేపీ నేత కావడంతో ఆ పార్టీ క్యాడర్‌లో కాస్త ఆశ చిగురించినట్లయింది. ఆయన టీడీపీతో గొడవ పెట్టుకోకపోయినా, అవసరమైనప్పుడు గట్టిగానే నిలదీయవచ్చని అనుకుంటున్నారు. కొంతకాలం క్రితం రాజ్యసభ సీటును బీజేపీ క్రమశిక్షణ సంఘం అధ్యక్షుడు పాకా సత్యానారాయణకు కేటాయించడం, ఇప్పుడు మాధవ్‌కు అధ్యక్ష పదవి ఇవ్వడంలో కేంద్ర బీజేపీకి ఏమైనా వ్యూహం ఉందా అన్న చర్చ కూడా జరుగుతోంది.
భవిష్యత్తులో జనసేన, బీజేపీ కలిసి పోటీ చేయడానికి కూడా సిద్దపడవచ్చన్న అభిప్రాయం ఉన్నా, టీడీపీ బీజేపీ కేంద్ర నేతలను ప్రసన్నం చేసుకుంటున్నంత కాలం కూటమి యథాతథంగా కొనసాగే అవకాశం ఉంటుంది. అందువల్ల బీజేపీ క్యాడర్‌కు రాష్ట్రంలో పదవులు పెద్దగా దక్కకపోవచ్చు. వారు నిజంగానే ఐదు శాతం పార్టీగానే మిగిలిపోవచ్చు. అప్పుడప్పుడు మీటింగ్‌లలో తమ గోడు వెళ్లగక్కుకోవడం తప్ప చేయగలిగింది ఏమీ ఉండకపోవచ్చు. కేంద్ర బీజేపీ పెద్దలే పలు అవమానాలను దిగమింగుకుని టీడీపీతో కలిసిన తర్వాత రాష్ట్రంలోని బీజేపీ నేతలుకాని, కార్యకర్తలు కాని ఏమి చేయగలుగుతారు?
- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.