అది ప్రభుత్వ విధాన నిర్ణయం 

Andhra Pradesh High Court On Nandyala district name issue - Sakshi

నంద్యాల జిల్లాకు ఉయ్యాలవాడ పేరు పెట్టాలన్న పిల్‌ కొట్టివేత  

సాక్షి, అమరావతి: జిల్లాకు ఏ పేరు పెట్టాలన్నది ప్రభుత్వ విధాన నిర్ణయమని హైకోర్టు తేల్చి చెప్పింది. జిల్లాకు ఫలానా వ్యక్తి పేరు పెట్టాలని ప్రభుత్వాన్ని ఆదేశించడం న్యాయస్థానం పని కాదని స్పష్టం చేసింది. కొత్తగా ఏర్పాటైన నంద్యాల జిల్లాకు ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి పేరు పెట్టేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ సామాజిక కార్యకర్త కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని (పిల్‌ను) హైకోర్టు మంగళవారం కొట్టేసింది.

ఏదైనా జిల్లాకు లేదా పట్టణానికి  రాజకీయ నేత, స్వాతంత్య్ర సమరయోధుడు, సంఘ సంస్కర్త, యోగి, ఇతర ప్రఖ్యాత వ్యక్తి పేరు పెట్టడం పూర్తిగా ప్రభుత్వ పరిధిలోనిదని స్పష్టంచేసింది. ఒకవేళ కోర్టు అలాంటి ఆదేశం ఇవ్వాలంటే, రాష్ట్ర ప్రభుత్వం చట్ట ఉల్లంఘనకు లేదా ప్రజల చట్టబద్ధ హక్కుల ఉల్లంఘనకు పాల్పడినట్లు పిటిషనర్‌ నిరూపించాల్సి ఉంటుందని తెలిపింది.

జిల్లాలకు పేరు పెట్టే విషయంలో నిర్దిష్ట ప్రమాణాలతో కూడిన చట్టం ఏదీ లేదని చెప్పింది. కాబట్టి ఈ వ్యాజ్యాన్ని కొట్టేస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్‌ డీవీవీఎస్‌ సోమయాజులు ధర్మాసనం మంగళవారం తీర్పు వెలువరించింది.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top