శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా ఎస్పీ, గూడూరు గ్రామీణ పోలీసుల తీరును తీవ్రంగా పరిగణించిన హైకోర్టు
పిటిషనర్‌ను హింసించి కొట్టారని వైద్య రికార్డులు, ఫొటోలు ధ్రువీకరిస్తున్నాయి
ఇందుకు కారణమైన పోలీసులపై ఎస్సీ, ఎస్టీ చట్టం కింద కేసు నమోదు చేయండి
ఘటనపై కోర్టు ఎదుట స్వయంగా హాజరై వివరణ ఇవ్వండి.. ఏపీ హైకోర్టు ఆదేశం
సాక్షి, అమరావతి : ఓ కేసులో కొడుకు నిందితుడిగా ఉంటే అతని తండ్రిని తీసుకెళ్లి పోలీసులు విచక్షణారహితంగా కొట్టిన ఘటనను హైకోర్టు తీవ్రంగా పరిగణించింది. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా చెన్నూరు మండలం మంగళపూరు గ్రామానికి చెందిన రోజూవారి కూలీ గడుతోటి పోలయ్య కొడుకు ఓ కేసులో నిందితుడిగా ఉన్నాడు. అయితే అతను అందుబాటులో లేకపోవడంతో పోలీసులు గత నెల 18న పోలయ్యను స్టేషన్‌కు తీసుకెళ్లారు. అక్కడ హింసించి, తీవ్రంగా కొట్టి గాయపరిచారు. దీంతో పోలీసుల తీరును నిరసిస్తూ పోలయ్య హైకోర్టును ఆశ్రయించారు.
పోలీసులు తన హక్కులను హరించారని, బాధ్యులైన వారిపై చర్యలకు ఆదేశించడంతో పాటు తనకు నష్టపరిహారం చెల్లించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై జస్టిస్ లక్ష్మణరావు విచారణ జరిపారు. పోలయ్య తరఫున న్యాయవాది వి.సురేంద్రరెడ్డి వాదనలు వినిపించారు. పోలీసుల దాడి వల్ల పోలయ్యకు అయిన గాయాల తాలుకా వైద్య రికార్డులను, ఘటనపై స్థానిక పత్రికల్లో వచి్చన కథనాలను కూడా కోర్టు ముందుంచారు. అలాగే వాస్తవాలను నిగ్గు తేల్చేందుకు ఈ ఏడాది ఏప్రిల్ 18న సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు గూడూరు రూరల్ పోలీస్ స్టేషన్‌లో సీసీటీవీ ఫుటేజీని భద్రపరచేలా ఆదేశాలు జారీ చేయాలని ఆయన కోర్టుకు విన్నవించారు.
పక్కా ఆధారాలు ఉన్నాయి..
పిటిషనర్ పోలయ్యను హింసించారనేందుకు ప్రాథమిక ఆధారాలున్నాయని పోలీసుల దెబ్బల వల్ల తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చేరారని, ఇందుకు సంబంధించిన వైద్య నివేదికలు, ఫొటోలు ఆయనపై జరిగిన దాడిని ధ్రువీకరిస్తున్నాయని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ దాషీ్టకానికి పాల్పడి, పిటిషనర్ మానవ హక్కులను హరించినందుకు నెల్లూరు జిల్లా ఎస్పీ సహా, గూడూరు గ్రామీణ ఇన్‌స్పెక్టర్ కిషోర్ బాబు, ఎస్‌ఐ తిరుపతయ్య, కానిస్టేబుళ్లు దాస్, చిన్నా ఈ నెల 14న స్వయంగా తమ ముందు హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. అవసరమైతే బాధ్యులైన పోలీసులపై ఎస్సీ, ఎస్టీ చట్టం కింద కేసు నమోదు చేయాలని జిల్లా ఎస్పీని ఆదేశిస్తూ న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ యడవల్లి లక్ష్మణరావు ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు.
పోలీసులకు చెంపపెట్టు లాంటిది
అధికార పార్టీ నేతల అడుగులకు మడుగులొత్తే పోలీసులకు హైకోర్టు ఆదేశాలు చెంపపెట్టు. దళితులను, రైతులను అమానుషంగా స్టేషన్‌లో చిత్రహింసలకు గురిచేసే పోలీసులను న్యాయస్థానం మెట్లెక్కించే వరకు న్యాయపోరాటం చేస్తాం. జిల్లా ఎస్పీ అజిత వేజెండ్ల ఉదాసీనంగా ఉంటే వారు కూడా న్యాయస్థానం ముందు నిలబడాల్సి వస్తుంది. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై ఎన్ని అక్రమ కేసులు పెట్టినా భయపడం. ప్రతి ఒక్కరిపై ప్రైవేట్ కేసులు వేసి న్యాయస్థానంలో నిలబెడతాం. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చాక పచ్చచొక్కాలు తొడిగిన పోలీసులపై క్రిమినల్ చర్యలు తప్పవు. – కాకాణి గోవర్ధన్‌రెడ్డి, మాజీమంత్రి


