క్షేత్ర స్థాయిలో వాస్తవ ప్రగతిని పరిశీలించండి  | Sakshi
Sakshi News home page

క్షేత్ర స్థాయిలో వాస్తవ ప్రగతిని పరిశీలించండి 

Published Sun, Dec 4 2022 5:23 AM

Andhra Pradesh Govt Mandate higher officials of all departments - Sakshi

సాక్షి, అమరావతి: ఇక్కడ కూర్చుని అంకెలతో అంతా బాగుందనే గత పాలకుల మూస ధోరణికి భిన్నంగా రాష్ట్ర ప్రభుత్వం క్షేత్ర స్థాయిలో వాస్తవ ప్రగతిపై దృష్టి సారించింది. ఇందులో భాగంగానే రాష్ట్రంలో సుస్థిర ప్రగతి లక్ష్యాలు సాధించడంలో దేశంలోనే అగ్రస్థానంలో నిలవాలనే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు తొలి దశలో గ్రామ, వార్డు సచివాలయాలు కేంద్రంగా 8 సుస్థిర ప్రగతి లక్ష్యాల సాధనకు కార్యాచరణ రూపొందించింది. వలంటీర్ల ద్వారా ఇంటింటి సర్వే చేసింది.

గ్రామ, వార్డు సచివాలయాల క్లస్టర్ల వారీగా వలంటీర్లు 1.52 కోట్ల కుటుంబాల ఇంటింటి సర్వే పూర్తి చేశారు. ఆ సర్వే ఫలితాలు ఇప్పటికే ప్రభుత్వానికి అందాయి. వీటి ప్రకారం గ్రామ, వార్డు సచివాలయాల స్థాయిలో ప్రగతి లక్ష్యాల అమలు తీరు తెన్నులను తెలుసుకొనేందుకు, వాటిని మరింత మెరుగ్గా అమలు చేసి, లక్ష్యాన్ని సాధించేందుకు  క్షేత్రస్థాయి తనిఖీలు, పర్యవేక్షణ చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ఇందులో భాగంగా అన్ని శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు, శాఖాధిపతులు పదిహేను రోజులకో సారి ఒక గ్రామ, వార్డు సచివాలయానికి వెళ్లి, తనిఖీలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ముందస్తు సమాచారం, ప్రచారం లేకుండా తనిఖీలకు వెళ్లాలని స్పష్టం చేసింది. వచ్చే ఏడాది డిసెంబరు వరకు నెలకు కచ్చితంగా రెండు గ్రామ, వార్డు సచివాలయాలకు వెళ్లాలని తెలిపింది.

ప్రత్యేకంగా రూపొందించిన ప్రశ్నావళి ఆధారంగా తొలి దశలో మహిళా శిశు సంక్షేమం, విద్యకు సంబంధించిన 8 సుస్థిర ప్రగతి లక్ష్యాల సాధనకు సంబంధించి క్షేత్రస్థాయి వాస్తవ పరిస్థితులను అధ్యయనం చేయాలని చెప్పింది. వాటి అమలులో లోటుపాట్లు ఏమైనా ఉంటే సరిదిద్ది, సమర్ధంగా అమలయ్యేలా సచివాలయాల్లో చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.

పూర్తిగా సఫలమయ్యాక పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని తెలిపింది. సచివాలయాల నుంచి సేకరించిన వివరాలు, ఇంటింటి సర్వే సమాచారంతో పాటు వారు గమనించిన పరిస్థితులపైన కూడా రిమార్కు రూపంలో ఇవ్వాలని తెలిపింది. 

సచివాలయం నుంచి సేకరించాల్సిన సమాచారమిది.. 
► సచివాలయం పరిధిలో కౌమారదశలో ఉన్న (10 ఏళ్ల నుంచి 19 ఏళ్లలోపు) మహిళలు ఎంత మంది ఉన్నారు? వారిలో ఎంత మందికి రక్తహీనత ఉంది? వారు ఎంత శాతం ఉన్నారు? రక్తహీనత ఉన్న వారికి ఐఎఫ్‌ఏ టాబ్లెట్లు, పౌష్టికాహారం అందిస్తున్నారా? 

► గర్భిణులు ఎంత మంది ఉన్నారు? 15 ఏళ్ల నుంచి 49 సంవత్సరాల గర్భిణుల్లో రక్తహీనత కలిగిన వారు ఎంత మంది? వారికి అవసరమైన మందులు, పౌష్టికాహారం రెగ్యులర్‌గా అందిస్తున్నారా ? 

► ఐదేళ్ల లోపు పిల్లలు ఎంత మంది? ఎంత మంది పిల్లలు అంగన్‌వాడీ కేంద్రాలకు వెళ్తున్నారు? ఎదుగుదల లేక కుంచించుకపోయిన పిల్లలు ఎంత మంది? వారికి సకాలంలో టీకాలు, నులిపురుగుల నివారణ మందులు, పోషకాహారం అందిస్తున్నారా? మహిళా పోలీసులు అంగన్‌వాడీ కేంద్రాలను తనిఖీలు చేస్తున్నారా లేదా? 

► తక్కువ బరువుగల ఐదేళ్లలోపు పిల్లలు ఎంత మంది? ఎంత మంది అంగన్‌వాడీ కేంద్రాలకు వస్తున్నారు? ఈ పిల్లలకు పూర్తిగా టీకాలు వేశారా? పోషకాహారం, మందులు అందిస్తున్నారా లేదా? 

► ప్రాథమిక విద్యలో 1 నుంచి 8వ తరగతి వరకు నికర నమోదు రేషియో ఎలా ఉంది? 6 నుంచి 13 ఏళ్ల లోపు పిల్లలు ఎంతమంది ఉన్నారు? ఎంత మంది ఎలిమెంటరీ స్కూల్స్‌లో నమోదయ్యారు? డ్రాపవుట్లు ఉంటే అందుగల కారణాలు ఏమిటి? 

► ఉన్నత సెంకడరీ విద్య 11 – 12 తరగతుల్లో స్థూల నమోదు నిష్పత్తి విషయంలో సంక్షేమ, విద్యా అసిస్టెంట్‌ ఎలా పనిచేస్తున్నారు? 16 నుంచి 17 సంవత్సరాల వయస్సుగల వారు ఎంత మంది ఉన్నారు? వీరిలో ఎంత మంది ఇంటర్మీడియట్, పాలిటెక్నిక్, డిప్లొమా, ఐటీఐలో నమోదు అయ్యారు?  డ్రాపవుట్స్‌ ఉంటే అందుకు కారణాలు ఏమిటి?  

► ఎన్ని స్కూల్స్‌ ఉన్నాయి? ఎన్ని స్కూల్స్‌కు కనీస వసతులైన మంచినీరు, విద్యుత్, ఫ్యాన్లు, ట్యూబ్‌ లైట్లు లేవు? వసతుల్లేకపోవడానికి కారణాలు ఏమిటి?  

► స్కూళ్లలో ప్రధానంగా బాలికల టాయిలెట్ల నిర్వహణ, స్థితి ఎలా ఉంది? ఎన్ని స్కూళ్లకు బాలికల కోసం విడిగా టాయిలెట్లు ఉన్నాయి? ఏదైనా సమస్య ఉంటే అందుకు కారణాలు ఏమిటి?   

Advertisement
 
Advertisement
 
Advertisement