‘సర్‌’కు సహకరించండి | Andhra Pradesh CEO asks parties to help prepare clean electoral rolls under SIR-2026 | Sakshi
Sakshi News home page

‘సర్‌’కు సహకరించండి

May 27 2026 5:51 AM | Updated on May 27 2026 5:51 AM

Andhra Pradesh CEO asks parties to help prepare clean electoral rolls under SIR-2026

అన్ని పార్టీలకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్‌ యాదవ్‌ విజ్ఞప్తి

అర్హత కలిగిన ప్రతి పౌరునికి ఓటు హక్కు.. అనర్హుల ఏరివేత లక్ష్యం 

జూలై 1 నాటికి 18 ఏళ్లు నిండినవారంతా ఓటరుగా నమోదు చేసుకోవాలి 

జూన్‌ 15 నుంచి జూలై 14 వరకు ఇంటింటి సర్వే 

సెప్టెంబర్ 22న తుది ఓటర్ల జాబితా  

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఓటర్ల జాబితాను స్వచ్ఛంగా రూపొందించేందుకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్‌ యాదవ్‌ కోరారు. సచివాలయంలో మంగళవారం అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఆయన సమావేశమయ్యారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌)–2026 కార్యక్రమం అమలుపై చర్చించారు. 

అర్హత కలిగిన పౌరుడి వివరాలు ఓటరు జాబితాలో తప్పనిసరిగా నమోదు కావడం.. చనిపోయినవారు, బహుళ ఓట్లు కలిగినవారు, ఇతర ప్రాంతాలకు మారినవారు లేదా అనర్హులైన వ్యక్తులను  జాబితాలో లేకుండా చూడడమే ‘సర్‌’ ప్రధాన ఉద్దేశమని వివేక్‌ యాదవ్‌ తెలిపారు. ఈ సమావేశంలో వైఎస్సార్‌సీపీ ప్రతినిధులు పేర్ని నాని, లేళ్ల అప్పిరెడ్డి, శ్రీకాంత్‌ రెడ్డి, ఏఎన్‌ఎన్‌ మూర్తి, ఎన్‌.చంద్రశేఖర్‌రెడ్డితో పాటు వివిధ పార్టీల నేతలు, అదనపు ప్రధాన ఎన్నికల అధికారి ఎ.వెంకటేశ్వరరావు, సహాయ ప్రధాన ఎన్నికల అధికారి జి.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.  

5 నుంచి సిబ్బందికి శిక్షణ.. 
రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర సవరణకు అర్హత తేదీని ఈ ఏడాది జూలై 1గా నిర్ణయించినట్లు వివేక్‌ యాదవ్‌ వెల్లడించారు. జూలై 1 నాటికి 18 ఏళ్లు నిండిన వారంతా ఓటర్లుగా నమోదు చేసుకోవాలన్నారు. జూన్‌ 5 నుంచి 14 వరకు సన్నాహక కార్యక్రమాలు, శిక్షణ, గణన ఫారాల ముద్రణ చేపడతామన్నారు. జూన్‌ 15 నుంచి జూలై 14 వరకు బూత్‌ స్థాయి అధికారులు ఇంటింటికీ వెళ్లి గణన ఫారాల పంపిణీ, సేకరణ చేస్తారని చెప్పారు. జూలై 14 వరకు పోలింగ్‌ స్టేషన్ల హేతుబద్దీకరణ కొనసాగుతుందన్నారు. జూలై 21న ముసాయిదా ఓటరు జాబితా ప్రచురిస్తామని చెప్పారు. అభ్యంతరాల స్వీకరణకు జూలై 21 నుంచి ఆగస్టు 20 వరకు అవకాశం కలి్పస్తామని తెలిపారు. నోటీసులు, విచారణలు, దావాలు, అభ్యంతరాల పరిష్కార ప్రక్రియ సెపె్టంబర్‌ 18 వరకు కొనసాగుతుందన్నారు. తుది ఓటరు జాబితాను సెపె్టంబర్‌ 22న ప్రచురించనున్నట్లు తెలిపారు. 

కారణాలు, విచారణ లేకుండా తొలగించం
ఈ ప్రక్రియలో బూత్‌ స్థాయి అధికారులు ప్రతి ఇంటికి వెళ్లి పాక్షికంగా నింపిన గణన ఫారాలను అందజేస్తారని వివేక్‌ యాదవ్‌ చెప్పారు. ఓటర్లు వాటిని ధ్రువీకరించి తిరిగి సమర్పించాలని సూచించారు. గణన ఫారం సమర్పించని వారి పేర్లు ముసాయిదా ఓటరు జాబితాలో చేర్చబోమన్నారు. ఇంటికి తాళం వేసి ఉంటే.. బీఎల్‌వోలు కనీసం మూడు సార్లు సందర్శిస్తారని తెలిపారు. కొత్తగా ఓటరు అర్హత పొందిన వారు ఫారం–6 ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. సవరణలు లేదా బదిలీల కోసం ఫారం–8, అభ్యంతరాలు, తొలగింపుల కోసం ఫారం–7 వినియోగించాలని కోరారు. ఏ వ్యక్తి పేరును కూడా విచారణ లేకుండా, కారణాలతో కూడిన ఉత్తర్వు జారీ చేయకుండా ఓటరు జాబితా నుంచి తొలగించబోమని స్పష్టం చేశారు. ఆధార్‌ కేవలం గుర్తింపు మాత్రమేనని,  అది పౌరసత్వం లేదా నివాసానికి చట్టబద్ధమైన రుజువు కాదని స్పష్టం చేశారు. అయితే ఎన్నికల చట్టాల ప్రకారం గర్తింపు నిర్ధారణ కోసం ఆధార్‌ను ఉపయోగించవచ్చని పేర్కొన్నారు.

ఎస్‌ఐఆర్‌ అర్హత తేదీ: 2026 జూలై 1 
ఇంటింటి సర్వే: జూన్‌ 15 నుంచి జూలై 14 వరకు 
ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల: జూలై 21 
అభ్యంతరాల స్వీకరణ: జూలై 21 నుంచి ఆగస్టు 20 వరకు 
అభ్యంతరాల పరిష్కారానికి గడువు:  సెప్టెంబర్‌ 18 
తుది ఓటర్ల జాబితా విడుదల: సెప్టెంబర్‌ 22  

Advertisement
 
Advertisement
Advertisement