బడ్జెట్ అప్పు రూ.81,532 కోట్లు
ఆస్తుల కల్పన వ్యయం కేవలం రూ.26,864 కోట్లు
అమ్మకం పన్ను, ఇతర డ్యూటీల రాబడిలో తిరోగమనం
కేంద్ర గ్రాంట్లలో ఏకంగా రూ.14,376 కోట్లు తగ్గుదల
బడ్జెట్ అంచనాలను మించి రెవెన్యూ, ద్రవ్యలోట్ల పెరుగుదల
సామాజిక రంగాలపై పడిపోయిన వ్యయాలు.. 2025–26 బడ్జెట్ అమలు సూచికలపై కాగ్ నివేదిక
సాక్షి, అమరావతి: చంద్రబాబు ప్రభుత్వం అప్పులు చేయడంలో చూపించే ఉత్సాహం.. ఆస్తుల కల్పనలో, రాష్ట్రాభివృద్ధిలో చూపించడం లేదు. 2025–26 బడ్జెట్‌కు సంబంధించి కాగ్ నివేదిక ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది. 2024–25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కూడా ఇలాంటి రాష్ట్ర ఆర్థిక ప్రతికూల ముఖచిత్రాన్నే కాగ్ గణాంకాలు చూపించాయి. 2025–26 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ అమలు సూచికలపై కాగ్ శనివారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. 2025–26 ఆర్థిక సంవత్సరంలో బడ్జెట్ అంచనాలను మించి రెవెన్యూ లోటు, ద్రవ్యలోటు పెరిగిపోయాయి.

బడ్జెట్ అంచనాల మేరకు ఆస్తుల కల్పన వ్యయం భారీగా తగ్గిపోయింది. చంద్రబాబు ప్రభుత్వం అప్పులు చేయడంపై చూపిస్తున్న శ్రద్ధ రెవెన్యూ రాబడులు పెంచడం ద్వారా సంపద సృష్టిపై చూపెట్టడం లేదు. అమ్మకం పన్నుతో పాటు ఇతర పన్నులు, డ్యూటీలు రాబడుల్లో తిరోగమనంలో ఉంది. ఎన్‌డీఏ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నప్పటికీ కేంద్రం నుంచి గ్రాంట్ల రూపంలో నిధులు రాబట్టడంలో చంద్రబాబు ప్రభుత్వం విఫలమైంది.


