మారని సెంటిమెంట్‌: అనకాపల్లికి మహర్దశ

Anakapalle Development Gudivada Amarnath Sentiment - Sakshi

అనకాపల్లి: అనకాపల్లికి మహర్దశ వచ్చింది. బెల్లంపల్లిగా జాతీయ స్థాయిలో గుర్తింపు ఉన్న అనకాపల్లి పట్టణం విశాఖ జిల్లాలో ఉన్నప్పుడూ ఎంతో ప్రాధాన్యం దక్కించుకునేది. ఇప్పుడు అనకాపల్లి కేంద్రంగా జిల్లా ఏర్పడడంతో అభివృద్ధి బాటలో నడుస్తోంది. ఇప్పుడిప్పుడే కొత్త జిల్లా సందడితో ఉన్న అనకాపల్లి జిల్లా వాసులకు ముఖ్యమంత్రి మరో వరాన్ని ప్రకటించారు. దీంతో కొత్త జిల్లా అంతా ఖుషీ ఖుషీగా ఉంది. డిప్యూటీ మంత్రితో కూడిన పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి పదవితో పాటు పరిశ్రమలు, ఐటీ, వాణిజ్య పన్నులశాఖ మంత్రి కూడా అనకాపల్లి జిల్లా ఎమ్మెల్యేలకు ఇవ్వడంతో కొత్తజిల్లాలో కొంగొత్త ఆశలు మొదలయ్యాయి.
 
కొనసాగుతున్న అనకాపల్లి సెంటిమెంట్‌... 
అనకాపల్లి ఎమ్మెల్యే అయితే చాలు... మంత్రి పదవి వరిస్తుందనేది సెంట్‌మెంట్‌. తాజాగా అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్‌కు రాష్ట్ర కే బినెట్‌లో కీలకమైన శాఖలు దక్కాయి. కొత్త జిల్లా ఏర్పాటులో భాగంగా అనకాపల్లి పేరుతో జిల్లా రాగా అనకాపల్లి ఎమ్మెల్యేకు మంత్రి పదవి దక్కడంతో అందరిలో ఉత్సాహం కనిపిస్తోంది. రాజకీయ, వర్గాలకతీతంగా అనకాపల్లి జిల్లాకు రెండు పదవులు రావడం పట్ల హర్షం వ్యక్తమవుతోంది. గతంలో అనకాపల్లి ఎమ్మెల్యేగా పని చేసిన దాడి వీరభద్రరావు, కొణతాల రామకృష్ణ, గంటా శ్రీనివాసరావులకు మంత్రి పదవులు లభించాయి.

చదవండి: (స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఉషా శ్రీ చరణ్)

తాజాగా ఎమ్మెల్యే అమర్‌నాథ్‌కు కూడా మంత్రి పదవి రావడంతో అనకాపల్లి సెంటిమెంట్‌ మరోసారి నిరూపితమైంది. ఇక ఐటీ, పరిశ్రమల అభివృద్ధికి అనకాపల్లి కేంద్రం కానుంది. ఆధ్యాత్మిక, భౌగోళిక, వారసత్వ, సుదీర్ఘ తీర ప్రాంత వనరులతో పాటు భూగర్భ నిక్షేపాలకు తోడు జలాశయాలు, నదులు, సాగునీటి కాలువలతో వ్యవసాయరంగానికి కీలకమైన అనకాపల్లి జిల్లా పరిశ్రమల స్థాపనలోనూ దూసుకుపోతోంది. అచ్యుతాపురం ఎస్‌ఈజెడ్, పరవాడ ఫార్మా, సింహాద్రి, అన్‌రాక్, చక్కెర కర్మాగారాలు, హెట్రో, మైహోంతోపాటు మరిన్ని పరిశ్రమలు అనకాపల్లికి దక్కనున్నాయి. అనకాపల్లి జిల్లాకు ఇప్పుడంతా మంచి శకునాలేనని పలువురు విశ్లేషిస్తున్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top