చిరుధాన్యాలు, నూనె గింజలను సాగు చేయండి

Agricultural scientists says that Cultivate whole grains and oilseeds - Sakshi

రబీలో దాళ్వా వరికి ప్రత్యామ్నాయం 

వ్యవసాయ శాస్త్రవేత్తల సూచన

సాక్షి, అమరావతి: వరికి మించిన ఆదాయం రావడమే కాకుండా తక్కువ నీటి వసతితో ఎక్కువ దిగుబడులు సాధించేందుకు చిరుధాన్యాలు, నూనె గింజల పంటల్ని సాగు చేయాలని వ్యవసాయ శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. అధికారికంగా ప్రారంభమైన రబీ సీజన్‌లో సాగు చేసే దాళ్వా వరికి బదులు పలు రకాల వంగడాలను వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచించారు.
 
మొక్కజొన్న.. 
మొక్కజొన్న పంటను కోస్తా జిల్లాల్లో జనవరి 15 వరకు విత్తుకోవచ్చు. ఎకరానికి 8 కిలోల విత్తనం వాడాలి. మొక్క తొలి దశలో ఆశించే పురుగులను నివారించటానికి సయాట్రినిప్రోల్, థయోమిథాక్సామ్‌ మందును 4 మి.లీ. కిలో విత్తనానికి పట్టించి విత్తన శుద్ధి చేసుకోవాలి. నేల స్వభావాన్ని బట్టి ఎకరానికి 26,666 నుండి 33,333 మొక్కల సాంద్రత ఉండేలా చూడాలి. 

రబీ జొన్న   
రబీకి అనువైన సూటి రకాలు: ఎన్‌టీజే 4, ఎన్‌టీజే 5, ఎన్‌ 15, సీఎస్‌వీ 216, ఆర్‌సీఎస్‌వీ 14, ఆర్‌ఎం 35–1, సీఎస్‌వీ 18, సీఎస్‌వీ 22 
అనుకూలమైన హైబ్రిడ్‌ రకాలు: సీఎస్‌హెచ్‌ 15, ఆర్‌సీఎస్‌హెచ్‌ 16, సీఎస్‌హెచ్‌ 19, సీఎస్‌హెచ్‌ 31 ఆర్‌. ఈ వారంలో విత్తుకోవచ్చు. ఎకరాకు 4 కిలోల విత్తనం సరిపోతుంది. విత్తేటప్పుడు వరుసల మధ్య 45 సెం.మీ. దూరం, మొక్కల మధ్య 12–15 సెం.మీ. దూరం ఉండేలా చూసుకోవాలి. 

వేరుశనగ..
రబీలో నీటి వసతి ఉన్న ప్రాంతాల్లో వేరుశనగ వేస్తుంటారు. అందుకు అనువైన రకాలు. కదిరి లేపాక్షి (కె. 1812), పంట కాలం 122 రోజులు. ఎకరానికి 20–25 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. 57% నూనెను, 70% గింజ దిగుబడిని ఇస్తుంది. ఎకరానికి 30–35 కిలోల గింజలు కావాలి. బెట్టను, తెగుళ్లను బాగా తట్టుకుంటుంది. కదిరి అమరావతి (2016), కదిరి చిత్రావతి, కదిరి 7 బోల్ట్, కదిరి 6, కదిరి 9, కదిరి హరితాంద్ర, ధరణి  ఒకవేళ ఈ రబీ సీజన్‌లో దాళ్వా సాగు చేయాలనుకునే రైతులు ఎంటీయూ 1010 (కాటన్‌ దొర సన్నాలు), ఎంటీయూ 1153 (చంద్ర), ఎంటీయూ 1156 (తరంగిణి), ఎంటీయూ 1121 (శ్రీధృతి), ఎంటీయూ 1210 (సుజాత), ఎంటీయూ 3626 (ప్రభాత్‌), ఐఆర్‌ 64, ఎన్‌.ఎల్‌.ఆర్‌. 34449 (నెల్లూరు మసూరీ), ఎన్‌.ఎల్‌.ఆర్‌. 3354 (నెల్లూరు ధాన్యరాశి)వినియోగించినట్లయితే మెరుగైన  దిగుబడి సాధించవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మరిన్ని వివరాలకు సమీపంలోని కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రాం కో–ఆర్డినేటర్‌ లేదా ఏరువాక కేంద్రం కో–ఆర్డినేటర్‌ను సంప్రదించాలని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విస్తరణ సంచాలకులు డాక్టర్‌ పి.రాంబాబు తెలిపారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top