‘ఏదైనా పత్రిక కొనుగోలుకు ఆర్థిక సాయం’ జీవోలను రద్దు చేయండి 

AG Sriram explained to Andhra Pradesh High Court news paper issue - Sakshi

వలంటీర్లు ‘సాక్షి’నే కొంటున్నారు..  

హైకోర్టులో ‘ఈనాడు’ యాజమాన్యం పిటిషన్‌ 

జీవోలో ఎక్కడా సాక్షినే కొనాలని చెప్పలేదు.. 

హైకోర్టుకు వివరించిన ఏజీ శ్రీరామ్‌ 

సాక్షి, అమరావతి: విస్తృత సర్కులేషన్‌ ఉన్న ఏదైనా ఓ దినపత్రికను కొనుగోలు చేసేందుకు గ్రామ, వార్డు వలంటీర్, సెక్రటేరియట్‌లకు నెలకు రూ.200 మేర ఆర్థిక సాయాన్ని అందజేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోలను సవాలు చేస్తూ ఉషోదయ ఎంటర్‌ప్రైజెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (ఈనాడు) హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. ఆ జీవోలను రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించి, వాటిని రద్దు చేయాలని కోరింది.

వలంటీర్లు, సెక్రటేరియట్‌ల ‘సాక్షి’ దినపత్రిక కోనుగోళ్లను పరిగణనలోకి తీసుకోకుండా ఆడిట్‌ బ్యూరో ఆఫ్‌ సర్కులేషన్‌ (ఏబీసీ)ను ఆదేశించడంతో పాటు నిర్దిష్ట కాలాల్లో సాక్షి పత్రికకు ఇచ్చిన సర్కులేషన్‌ సర్టిఫికేషన్‌ను పునః సమీక్షించాలని కూడా ఏబీసీని ఆదేశించాలంటూ ఉషోదయ డైరెక్టర్‌ ఐ.వెంకట్‌ ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు.

ఈ వ్యాజ్యంలో పలు ప్రభుత్వ శాఖల ముఖ్య కార్యదర్శులను, ఏబీసీ సెక్రటరీ జనరల్‌తో పాటు వ్యక్తిగత హోదాలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, ఆయన సతీమణి వైఎస్‌ భారతిరెడ్డిలతో పాటు వారికి చెందిన కంపెనీలను ప్రతివాదులుగా పేర్కొన్నారు. ఈ వ్యాజ్యంపై గురువారం ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్‌ నైనాల జయసూర్య ధర్మాసనం విచారించింది.

ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం, మధ్యంతర ఉత్తర్వుల జారీపై తీర్పును రిజర్వ్‌ చేసింది. ఈ నెల 14న మధ్యంతర ఉత్తర్వులపై తమ నిర్ణయాన్ని వెలువరిస్తామని ధర్మాసనం స్పష్టం చేసింది.

ఈ లోపు ప్రధాన వ్యాజ్యంలో ప్రతివాదులుగా ఉన్న పలు ప్రభుత్వ శాఖల ముఖ్య కార్యదర్శులకు, ఏబీసీ సెక్రటరీ జనరల్‌తో పాటు వ్యక్తిగత హోదాలో ప్రతివాదులుగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, ఆయన సతీమణి వైఎస్‌ భారతిరెడ్డి తదితరులకు నోటీసులు జారీ చేస్తున్నట్లు తెలిపింది.

తదుపరి విచారణను 14వ తేదీకి వాయిదా వేసింది. కాగా, ఈనాడు న్యాయవాదుల అభ్యంతరాలను రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్‌ జనరల్‌ (ఏజీ) ఎస్‌.శ్రీరామ్‌ తోసిపుచ్చారు. జీవోలో ఎక్కడా కూడా ప్రభుత్వం సాక్షి దినపత్రికను మాత్రమే కొనాలని చెప్పలేదన్నారు. విస్తృత సర్కులేషన్‌ ఉన్న ఏ పత్రికనైనా కొనుగోలు చేసే వెసులుబాటు వలంటీర్లకు ఇచ్చిందన్నారు.       

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top