
నిబంధనలకు నిండా పాతర
బీసీసీఐ రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఎన్నికల నిర్వహణ
వార్షిక జనరల్ బాడీ సమావేశంలోనే కీలకమైన ఎన్నికల ప్రక్రియకు అవకాశం
గత జూన్‌లోనే ముగిసిన ఏసీఏ వార్షిక సమావేశం
కానీ, ఇప్పుడు మరోసారి జనరల్ బాడీ మీటింగ్ పెట్టి ఎన్నికలకు వెళ్తున్న కూటమి నేతలు
సాక్షి, అమరావతి: కూటమి ప్రభుత్వంలో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) రాజకీయ రంగు పులుముకుని భ్రష్టు పట్టింది. క్రికెట్ అభివృద్ధికి, పారదర్శకతకు నిలువునా పాతరేయడంతో దశాబ్దాల ఏసీఏ ప్రతిష్ట మంటగలిసింది. కూటమి నేతలు చట్టాలకు తూట్లు పొడవడంతో ఎన్నికల క్రీజులో బైలా డకౌటైంది. క్రికెట్‌తో సంబంధం లేని వ్యక్తుల చేతుల్లోకి ఏసీఏ వెళ్లిపోవడంతో భావి క్రికెటర్ల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)కి అనుబంధంగా కొనసాగుతున్న ఏసీఏలో.. కార్యవర్గం పదవీ కాలం గరిష్టంగా మూడేళ్లు. ఆ గడువు ఈ ఏడాది చివరితో ముగియనుంది.
అయితే, బీసీసీఐను అనుసరించి ఏసీఏ రాసుకున్న బైలాస్ ప్రకారం ఏటా సెపె్టంబర్ 30లోగా వార్షిక జనరల్ బాడీ మీటింగ్(ఏజీఎం) నిర్వహించాలి. ఇందులోనే అత్యంత కీలక నిర్ణయాలు తీసుకోవాలి. దీనిలో ప్రధానమైనది ఏసీఏ అపెక్స్ కౌన్సిల్, అఫీస్ బేరర్ల ఎన్నిక. ఏజీఎంలో తప్పితే మరే సమయంలోనూ పదవీ కాలం పూర్తయిన తర్వాత మరో కొత్త కార్యవర్గాన్ని ఎన్నికోవడానికి బైలాలోని నిబంధనలు అంగీకరించవు.
కానీ, కూటమి ప్రభుత్వంలో ఏసీఏ పాలక వర్గం ‘వార్షిక జనరల్ బాడీ మీటింగ్’ అర్థాన్నే మార్చేసింది. ఏడాదికి ఒక సారి మాత్రమే నిర్వహించే ఏజీఎంను రెండోసారి నిర్వహించేందుకు అందులో కొత్త కార్యవర్గ కోసం ఎన్నికలు చేపట్టేందుకు సమాయత్తమవుతుండడం, దీనికోసం నోటిఫికేషన్ సైతం విడుదల చేయడం అందరినీ విస్తుగొలుపుతోంది.
హడావుడిగా ఏజీఎం..
చంద్రబాబు అధికారంలోకి రాగానే ఏసీఏ కూటమి నేతల కబంధ హస్తాల్లోకి వెళ్లిపోయింది. మంత్రి లోకేశ్ అండతో గత ప్రభుత్వంలో ఏర్పడిన ఏసీఏ కార్యవర్గాన్ని బలవంతంగా రాజీనామా చేయించి ఆ పదవుల్లోకి కూటమి నేతలు దూరిపోయారు. ఈ క్రమంలోనే ఆంధ్రప్రీమియర్ లీగ్(ఏపీఎల్) ఫ్రాంచైజీలనూ చేజిక్కించుకునే కుట్ర పన్నారు. ఇందులో భాగంగా పాత ఫ్రాంచైజీలకు గడువు ఉన్నా.. వారిని తొలగిస్తూ కొత్త ఫ్రాంచైజీల కోసం నోటిఫికేషన్ ఇచ్చారు.
అయితే, ఇక్కడే ఏపీఎల్ నిర్వహణకు గవర్నింగ్ కౌన్సిల్‌ను ఏర్పాటు చేయాలి. దీని కోసం సెపె్టంబర్‌లోగా నిర్వహించాల్సిన ఏజీఎంను ముందుకు జరిపేశారు. జూన్1 ఏజీఎం నిర్వహిస్తున్నట్టు ఈ ఏడాది మే 12న ఏసీఏ సెక్రటరీ సర్క్యులర్ జారీ చేశారు. దీని ప్రకారం జూన్‌లో ఏసీఏ కార్యవర్గం వార్షిక జనరల్ బాడీ మీటింగ్ పూర్తయింది. కానీ, అప్పుడు ఎన్నికల అంశం అజెండాలోకి రాలేదు.
ఈ ఎన్నిక చెల్లుబాటేనా?
వాస్తవానికి ఏసీఏ బైలా ప్రకారం ఏడాదికి ఒక సారి మాత్రే వార్షిక జనరల్ బాడీ మీటింగ్(ఏజీఎం) నిర్వహించాలి. ఇది జూన్‌లోనే ముగిసింది. ఒక వేళ అది ఏజీఎం కానప్పుడు ప్రత్యేక జనరల్ బాడీ మీటింగ్‌గా గుర్తించాలి. కానీ, ఏసీఏ సెక్రటరీ తన సర్క్యులర్‌లో స్పష్టంగా ఏజీఎం నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు. నిబంధనల ప్రకారం.. ఏజీఎంలో మాత్రమే ఎన్నికలకు అవకాశం ఉండగా.. ఇప్పుడు ఏ ప్రాతిపదికన ఏసీఏ ఎన్నికలు నిర్వహిస్తున్నారో చెప్పాలని క్రికెట్ అభిమానులు ప్రశ్నిస్తున్నారు. ఈ ఎన్నికలు బీసీసీఐ రాజ్యంగ ఉల్లంఘన కిందకు వస్తాయని స్పష్టం చేస్తున్నారు.
ఎన్నికల అధికారిగా నిమ్మగడ్డ
పైగా ఏసీఏ ఎన్నికల నిర్వహణ అధికారిగా వ్యవహరిస్తున్న నిమ్మగడ్డ రమేశ్ ఎన్నికే సక్రమం కాదంటూ కోర్టుల్లోనూ పిటిషన్లు దాఖలయ్యాయి. వాస్తవానికి ఏజీఎంకు నాలుగు వారాల ముందు ఏసీఏ అపెక్స్ కౌన్సిల్ ఎన్నికల అధికారిని నియమించుకుని.. ఏజీఎంలో దానిని రాటిఫై చేసుకోవాలి. ఇక్కడ అదేమీ జరగలేదు. జూన్‌లో అసలు ఎన్నికల అధికారి నియామకం అజెండానే పెట్టలేదు. కానీ, జూలైలో అపెక్స్ కౌన్సిల్ కూర్చుని ఎన్నికల అధికారిగా నిమ్మగడ్డ రమేశ్‌ను నియమించినట్టు ప్రకటించడం సర్వత్రా చర్చనీయాంశమైంది. ఇన్ని గందరగోళాల మధ్య ఎన్నికలు జరిపితే ఎవరైనా కోర్టుల్లో కేసులు వేసినా, బీసీసీఐ అంబుడ్స్‌మెన్‌ను ఫిర్యాదు చేసినా ఎన్నికలు చెల్లుబాటు కావని క్రీడానిపుణులు హెచ్చరిస్తున్నారు.
నచ్చనోళ్ల ఓట్ల తొలగింపు..
ఈ నెల 3న ఏసీఏ ఎన్నికలకు నామినేషన్లు వేయాలని ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేశ్ నోటిఫికేషన్ ఇచ్చారు. 6న పరిశీలన, 7న అర్హత పొందిన నామినేషన్ల జాబితా విడుదల, 11 వరకు ఉపసంహరణ, 16న ఓటింగ్ నిర్వహించనున్నారు. అయితే, గత కార్యవర్గమే మరోసారి పీఠంపై కూర్చునే కుట్రతో తమకు వ్యతిరేకంగా గళం విప్పిన వారి ఓట్లను తొలగించింది. పశ్చిమగోదావరి జిల్లా క్రికెట్ అసోసియేషన్‌లో ఏసీఏ మాజీ అధ్యక్షుడు మనవడిని ఏసీఏ సస్పెండ్ చేసింది. అయితే, కోర్టుకు వెళ్లడంతో ఓటు తిరిగి పొందారు.
కానీ, ఎన్నికల్లో పోటీకి మాత్రం అర్హత లేకుండా పోవడం గమనార్హం. ప్రజాస్వామ్య దేశంలో ఓటు హక్కు ఉన్న వ్యక్తికి ఎన్నికల్లో పోటీ చేయనివ్వకుండా అడ్డుకోవడం ఒక్క కూటమి పాలనలోనే చెల్లుతోంది. దీనికి తోడు ఏసీఏ దోపిడీలను ప్రశ్నిస్తున్న గుంటూరు జిల్లా క్రికెట్ అసోసియేషన్‌నూ అబయన్స్‌లో పెట్టి ఓటు లేకుండా చేశారు. ఒక ప్రాంత వ్యక్తిని మరో జిల్లాలో సభ్యుడిగా చూపించి ఓటు కల్పించారు.
ఇలా తమకు నచ్చినోళ్లకు ఓటు హక్కు కల్పించి నచ్చనోళ్లను తొలగించారు. వ్యతిరేకులు ఎవరూ నామినేషన్లు వేయకుండా బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఓట్ల కోసమే..ఓ మూడు జిల్లాల క్రికెట్ అసోసియేషన్ సభ్యులను ప్రలోభపెట్టి ఏసీఏ నుంచి పనులు ఇచ్చి నిధులు దోచిపెడుతున్నారు.