అత్యాధునిక వసతులతో 250 పడకల కోవిడ్‌ కేర్‌ సెంటర్‌ 

250-bed Covid Care Center with new infrastructure with Chevireddy own funds - Sakshi

సొంత నిధులతో అదనపు సౌకర్యాలు కల్పించిన ఎమ్మెల్యే చెవిరెడ్డి

ప్రతి నెలా 101 మంది సిబ్బందికి అదనంగా రూ. 2.52 లక్షల నగదు

రోగులకు పౌష్టికాహారం కోసం మాంసాహారం..

ఆహ్లాదం కోసం రిక్రియేషన్‌ సెంటర్, గ్రంథాలయం

34 వస్తువులతో ప్రత్యేక కిట్లు అందజేత

అత్యవసర సేవల కోసం 10 ఆక్సిజన్‌ బెడ్లు  

తిరుపతి రూరల్‌: చిత్తూరు జిల్లా చంద్రగిరి సమీపంలోని తొండవాడలో హీరా కళాశాలకు చెందిన ఐదు అంతస్తుల భవనంలో అత్యాధునిక వైద్య సదుపాయాలతో 250 పడకల కోవిడ్‌ కేర్‌ సెంటర్‌ను ప్రభుత్వ విప్, తుడా చైర్మన్‌ డాక్టర్‌ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి శుక్రవారం ప్రారంభించారు. బాధితులకు మెరుగైన వసతి, వైద్య సౌకర్యాలు కల్పించేందుకు ఎమ్మెల్యే సొంత నిధులను వెచ్చించారు. అత్యవసర వైద్యం కోసం 10 ఆక్సిజన్‌ బెడ్లు అందించారు. అక్కడ పనిచేస్తున్న 101 మంది సిబ్బందికి ప్రభుత్వం అందించే గౌరవ వేతనాలకు తోడు ప్రతి ఒక్కరికీ ప్రతి నెలా అదనంగా రూ. 2,500ను అందిస్తామని ప్రకటించారు. అంటే ప్రతి నెలా రూ. 2.52 లక్షలను చెల్లించనున్నారు. రోగులకు పౌష్టికాహారం కోసం బుధవారం చేపలు, ఆదివారం చికెన్‌తో కూడిన భోజనం కూడా అందించనున్నారు. అలాగే వారికి పేస్ట్, బ్రెష్, దుప్పటి, మెడికల్‌ కిట్‌ తదితర 34 వస్తువులతో కూడిన ప్రత్యేక కిట్లను ఇస్తున్నారు.

ఆహ్లాదకర వాతావరణం కల్పించేందుకు చెస్, క్యారమ్స్‌ వంటి గేమ్స్‌తో కూడిన రిక్రియేషన్‌ సెంటర్, ఆధ్యాత్మిక, సామాజిక గ్రంథాలతో కూడిన గ్రంథాలయాన్ని సిద్ధం చేశారు. ప్రతి గదిలో టీవీలు ఏర్పాటుచేసి రోజుకు రెండు చిత్రాలను ప్రదర్శించనున్నారు. ప్రతి ఫ్లోర్‌లో వేడి నీరు, చల్లని నీరు వచ్చేలా ఏర్పాట్లు చేశారు. 24 గంటలు వైద్య సేవలు అందించేందుకు షిప్ట్‌కు ఇద్దరు చొప్పన వైద్యులు అందుబాటులో ఉంటారు. కోవిడ్‌ కేర్‌ సెంటర్‌లోని ప్రతి ఫ్లోర్‌కు ఇన్‌చార్జిలను నియమించారు. ఆ ఫ్లోర్‌లో ఉండే బాధితులతో వాట్సాప్‌ గ్రూప్‌ను క్రియేట్‌ చేయించారు. తమ సమస్యలను బాధితులు వాట్సాప్‌ ద్వారా తెలిపితే వాటిని సత్వరమే పరిష్కరిస్తారు. గతంలో తిరుచానూరు వద్ద ఏర్పాటు చేసిన పద్మావతి కోవిడ్‌ కేర్‌ సెంటర్‌లో చెవిరెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుని ఏర్పాటు చేసిన వసతులు, నాణ్యమైన భోజనం వల్ల దేశవ్యాప్తంగా 
సెంటర్‌కు మంచి పేరు వచ్చింది.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top