‘పరిష్కార వేదిక’లో వెల్లువలా అర్జీలు | - | Sakshi
Sakshi News home page

‘పరిష్కార వేదిక’లో వెల్లువలా అర్జీలు

May 26 2026 3:26 AM | Updated on May 26 2026 3:26 AM

అనంతపురం అర్బన్‌: కలెక్టరేట్‌ రెవెన్యూ భవన్‌లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రజల నుంచి వివిధ సమస్యలపై అర్జీలు వెల్లువెత్తాయి. తమ మొర ఆలకించి పరిష్కరించండని ప్రజలు వేడుకున్నారు. జాయింట్‌ కలెక్టర్‌ విష్ణుచరణ్‌, డీఆర్‌ఓ మలోల, ఎఫ్‌ఎస్‌ఓ రామకృష్ణారెడ్డి, డిప్యూటీ కలెక్టర్లు ఆనంద్‌, రామ్మోహన్‌, రమేష్‌రెడ్డి, మల్లికార్జునరెడ్డి ప్రజల నుంచి 596 అర్జీలు స్వీకరించారు. కార్యక్రమం అనంతరం అర్జీల పరిష్కారంపై అధికారులతో జేసీ సమీక్షించారు. ప్రతి అర్జీనీ పరిశీలించి నాణ్యమైన పరిష్కారం చూపించాలని ఆదేశించారు.

అర్జీల్లో కొన్ని..

● భార్యా పిల్లలు తనను ఇంటి నుంచి గెంటేసి.. పింఛన్‌ సొమ్ము లాగేసి.. తిండి పెట్టకుండా ఇబ్బందులు పెడుతున్నారని డి.హీరేహాళ్‌ మండలం సోమలాపురం గ్రామానికి చెందిన మహదేవప్ప అనే వృద్ధుడు ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’లో గోడు వెల్లబోసుకున్నాడు. ఎఫ్‌ఎస్‌ఓ రామకృష్ణారెడ్డి స్పందిస్తూ ఆ మండల ఎస్‌ఐతో మాట్లాడి కుటుంబ సభ్యులకు కౌన్సెలింగ్‌ ఇచ్చి వృద్ధుని సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు.

● గ్యాంగ్రిన్‌ కారణంగా రెండు సంవత్సరాల వ్యవధిలో రెండు కాళ్లు తొలగించారని, తనకు సొంత ఇల్లు, భూమి ఏదీ లేదని, కుటుంబ పోషణ ఇబ్బందిగా మారిందని తనకు పింఛన్‌ అందజేయాలని గుంతకల్లు మండలం పూలగుట్టపల్లికి చెందిన బండారు ఉసేన్‌ అర్జీ అందజేశాడు.

● ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ ఫిర్యాదు అందిన వెంటనే ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయడం లేదని విజిలెన్స్‌ అండ్‌ మానిటరింగ్‌ కమిటీ సభ్యుడు జి.ముత్యాలప్ప అధికారులకు అర్జీ అందజేశారు. బాధితులను కౌంటర్‌ కేసులతో భయపెడుతున్నారని ఆరోపించారు. బాధితులకు ఇవ్వాల్సిన నష్టపరిహారం, పునరావాస సహాయం సకాలంలో అందడం లేదని తెలిపారు.

● ఇంటిస్థలం మంజూరు చేయించాలని అనంతపురంలోని సునీత నగర్‌కు చెందిన దివ్యాంగుడు పసుపుల రఘు విన్నవించాడు. తనకు ముగురు కుమార్తెలు ఉన్నారని తెలిపారు. సంపాదనలో సగం ఇంటి అద్దెకే కట్టాల్సి వస్తోందని పేర్కొన్నాడు.

Advertisement
 
Advertisement
Advertisement