ఉద్యోగాల కల్పనే
మోదీ ధ్యేయం
గుంతకల్లు: దేశంలోని యువతకు అత్యధిక ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించడమే ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ధ్యేయమని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్ తెలిపారు. శనివారం గుంతకల్లు రైల్వే క్లబ్‌లో జరిగిన రోజ్ గార్ మేళాకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు పొందిన 120 మంది యువతకు బండి సంజయ్‌తోపాటు డీఆర్‌ఎం చంద్రశేఖర్ గుప్తా నియామక పత్రాలు అందజేశారు. బండి సంజయ్ మాట్లాడుతూ ఈ రోజు దేశ వ్యాప్తంగా 47 కేంద్రాల్లో రోజ్‌గార్ మేళాలను నిర్వహించి దాదాపు 51వేల మందికి పైగా యువతీ యువకులకు ఉద్యోగ నియామక ప్రతాలు అందజేశామన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థను మరింత మెరుగుపరచడానికి భారత్ ప్రపంచంలో మూడవ అతి పెద్ద శక్తిగా ఎదగడానికి 2047 వికత్ భారత్ లక్ష్యంగా మోదీ పని చేస్తున్నారన్నారు. డీఆర్‌ఎం గుప్తా మాట్లాడుతూ రోజ్‌గార్ మేళా ద్వారా 93 మంది అసిస్టెంట్ లోకోపైలట్లు, రైల్వేలో కాంపాషనేట్ గ్రౌండ్ కింద మరో 13 మంది, పోస్టల్ సర్వీస్ కింద 9 మంది, బ్యాంక్ ఆఫ్ బరోడాకు నలుగురు, సివిల్ ఏవియేషన్ శాఖలో ఒకరు చొప్పున ఉద్యోగాలు పొందారని వివరించారు. కార్యక్రమంలో ఏడీఆర్‌ఎం శివప్రసాద్, డీపీఓ హెచ్‌ఎల్‌ఎన్ ప్రసాద్, సీనియర్ డీసీఎం మనోజ్ తదితరులు పాల్గొన్నారు.


