గుత్తి: తాగునీటి కోసం మహిళల మధ్య ఘర్షణ జరిగి ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. గుత్తి మున్సిపాలిటీ పరిధిలోని బండగేరికి మూడు వారాలుగా తాగునీరు సరఫరా కావడం లేదు. ఈ క్రమంలో శనివారం కొళాయిలకు నీరు వదిలారు. అయితే పైప్‌లైన్ డ్యామేజీ కావడంతో తాగునీరు సక్రమంగా సరఫరా కాలేదు. ఇదే సమయంలో నీటిని పట్టుకునే విషయంలో మహిళల మధ్య ఘర్షణ జరిగింది. కాలనీ పెద్దలు సర్దిజెప్పడంతో తాత్కాలికంగా వివాదం సద్దుమణిగింది. అయితే కాసేపటి తర్వాత మరోసారి ఇరువర్గాల వారు ఘర్షణ పడటంతో లక్ష్మీదేవి అనే మహిళ తీవ్రంగా గాయపడింది. స్థానికులు గమనించి వెంటనే ఆస్పత్రికి తరలించారు. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.


