కుందుర్పి: మండలంలోని అప్పిలేపల్లిలో 20 రోజులుగా తీవ్ర తాగునీటి ఎద్దడి నెలకొంది. స్థానిక చెరువు వద్ద ఉన్న మంచినీటి పథకం నుంచి గ్రామానికి ఏర్పాటు చేసిన ప్రధాన పైప్‌లైన్ ద్వారా కొందరు రైతులు పైపులకు రంధ్రాలు వేసి నీటిని పంట పొలాలకు తరలించడంతో తాగునీటి సమస్య నెలకొందని అప్పిలేపల్లి గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే తాగునీటి సమస్యను పరిష్కరించాలని కోరుతూ మహిళలు ఆదివారం ఖాళీ బిందెలతో కుందుర్పి–కళ్యాణదుర్గం ప్రధాన రహదారిపై ధర్నా చేపట్టారు. దీంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. 20 రోజులుగా తాగునీటి సమస్యతో ఇబ్బంది పడుతున్నా స్థానిక పంచాయతీ కార్యదర్శి పట్టించుకోలేదన్నారు. అలాగే అక్రమ కొళాయిలు వేసుకొన్న నాయకులకు, రైతులకు సహకరిస్తున్నారని విమర్శించారు. అధికారులు చర్యలు తీసుకొని అప్పిలేపల్లిలో నెలకొన్ని తాగునీటి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
నీటి సమస్య పరిష్కరించాలని అప్పిలేపల్లి మహిళల ధర్నా


