తాడిపత్రిటౌన్: పట్టణంలోని ఓ ప్రార్థనా మందిరంలో ఆధిపత్యం కోసం ఇరువర్గాల మధ్య ఆదివారం గొడవ చోటు చేసుకుంది. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సీఐ ఆరోహణరావు సంఘటనా స్థలానికి వెళ్లి ఇరువర్గాలకు సర్దిచెప్పి పంపించారు. మరోసారి గొడవకు దిగితే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
వ్యక్తి ఆత్మహత్య
దేవరాపల్లి: అనకాపల్లి జిల్లా దేవరాపల్లి మండలం చింతలపూడి పంచాయతీ శివారు పెదకోరాడలో ఓ వ్యక్తి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానిక ఎస్‌ఐ వి.సత్యనారాయణ తెలిపిన వివరాలమేరకు.. అనంతపురం జిల్లా నార్పల మండలం వెంకటంపల్లికి చెందిన ఎద్దుల హనుమంతురెడ్డి దేవరాపల్లి మండలం పెదకోరాడ గ్రామానికి చెందిన చీపిరి కృష్ణవేణిని ఐదేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరికి కుమార్తె ఉంది. పెదకోరాడలో ఈ నెల 12న జరిగిన పండగకు భార్య, తల్లితో కలిసి హనుమంతురెడ్డి వచ్చాడు. భార్యాభర్తల మధ్య శనివారం చిన్నపాటి గొడవ జరిగింది. ఈ నేపథ్యంలో తాను ఇంటికి వెళ్తానని చెప్పి హనుమంతురెడ్డి అక్కడి నుంచి బయలుదేరాడు. సాయంత్రం పశువుల పాకలో ఉరి వేసుకుని ఉండటాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఎస్‌ఐ వి.సత్యనారాయణ తన సిబ్బందితో కలిసి ఆదివారం సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. క్లూస్ టీమ్‌ను రప్పించి ఆధారాలు సేకరించారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.


