● 13 రోజులుగా ‘సత్యసాయి’ నీరు బంద్
● సమస్యను పట్టించుకోని మంత్రి కేశవ్
వజ్రకరూరు: రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ప్రాతినిథ్యం వహిస్తున్న ఉరవకొండ నియోజకవర్గంలోని వజ్రకరూరు మండలంలో తాగునీటి ఎద్దడి తీవ్ర రూపం దాల్చింది. మండలంలో వాడుక అవసరాలకు పంచాయతీ నీరు.. తాగడానికి శ్రీసత్యసాయి రక్షిత మంచినీటి పథకం నీరు వినియోగిస్తున్నారు. కొనకొండ్ల గ్రామంలోని సత్యసాయి రిజర్వాయర్ నుంచి మండలంలోని 80 శాతానికి పైగా గ్రామాలకు సత్యసాయి నీరు సరఫరా అందిస్తారు. అయితే సత్యసాయి తాగునీటి పథకం కార్మికులు వేతనాలు తదితర సమస్యల పరిష్కారం కోసం సమ్మెబాట పట్టారు. అయితే ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందనా లేకపోవడంతో సమ్మె కొనసాగుతూనే ఉంది. దీంతో 13 రోజులుగా సత్యసాయి రిజర్వాయర్ నుంచి గూళ్యపాళ్యం, కమలపాడు, వజ్రకరూరు, కొనకొండ్ల, గంజికుంట, తట్రకల్లు, పందికుంట, వెంకటాంపల్లి, వెంకటాంపల్లి పెద్ద తండా, రాగులపాడు, కడమలకుంట, పొట్టిపాడు, చిన్నహోతూరు, గడేహోతూరు, ఛాయాపురం తదితర గ్రామాలకు నీటి సరఫరా ఆగిపోయింది. దీంతో తాగునీటికి ప్రజలు పడరాని పాట్లు పడుతున్నారు. ఈ విషయమై సత్యసాయి ఇంజినీర్ బాలును వివరణ కోరేందుకు ప్రయత్నించగా ఆయన అందుబాటులోకి రాలేదు. ఇకనైనా మంత్రి కేశవ్‌తో పాటు కలెక్టర్ చొరవ చూపి తాగునీటి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.


