ప్రజల భాగస్వామ్యంతోనే స్వచ్ఛత సాధ్యం : కలెక్టర్‌ | - | Sakshi
Sakshi News home page

ప్రజల భాగస్వామ్యంతోనే స్వచ్ఛత సాధ్యం : కలెక్టర్‌

May 17 2026 12:54 AM | Updated on May 17 2026 12:54 AM

రాయదుర్గం టౌన్‌: ప్రజల భాగస్వామ్యం ఉన్నప్పుడే పట్టణ ప్రాంతాల్లో స్వచ్ఛతతో పాటు ఆరోగ్యకరమైన వాతావరణం నెలకొంటుందని కలెక్టర్‌ ఓ.ఆనంద్‌ అన్నారు. జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో శనివారం ప్రత్యేక స్వచ్ఛత డ్రైవ్‌ కార్యక్రమాన్ని చేపట్టగా, రాయదుర్గంలో కార్యక్రమానికి కలెక్టర్‌ హాజరై, పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు చేశారు. శాంతినగర్‌లోని చెత్త డంపింగ్‌ యార్డులో చెత్త శాసీ్త్రయ శుద్ధీకరణను పరిశీలించారు. లక్ష మెట్రిక్‌ టన్నుల చెత్తకు గాను ఇప్పటి వరకూ 25 వేల టన్నుల చెత్తను శుద్ధి చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. అనంతరం ఓబుళాచారీ రోడ్డులో ప్రజలతో మాట్లాడారు. ప్రతి పౌరుడు స్వచ్ఛ కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఖాళీ స్థలాల్లో చెత్త, ఇతర వ్యర్థాలు వేయకుండా ప్రజలను చైతన్యపరచాలని, వారు స్పందించకపోతే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కమిషనర్‌కు సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ దివాకర్‌రెడ్డి, ఏఈ నరసింహులు తదితరులు పాల్గొన్నారు.

ఫుడ్‌సేఫ్టీ అధికారులమంటూ డబ్బు వసూలు

బెళుగుప్ప: ఫుడ్‌ సేఫ్టీ అధికారులమంటూ ఐదుగురు సభ్యులుగా ఉన్న మహిళల బృందం శనివారం బెళుగుప్పలో హల్‌చల్‌ చేసింది. కిరాణా దుకాణాలు, బేకరీలో తనిఖీలు చేపట్టి నగదు డిమాండ్‌ చేశారు. ఒక్కో దుకాణదారుడి నుంచి రూ.1,200 నుంచి రూ.1,500 వరకూ వసూలు చేసుకుని, ఫుడ్‌ సేఫ్టీ సర్వీసెస్‌, కృష్ణానగర్‌, గుంటూరు చిరునామాతో ఉన్న రసీదులు అందజేశారు. ఈ అడ్డగోలు వ్యవహారంపై అనుమానం వచ్చిన కొందరు విషయాన్ని వెంటనే స్థానిక విలేకరుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో విలేకరులు అక్కడకు చేరుకుని ప్రశ్నిస్తే పొంతనలేని సమాధానాలు ఇచ్చారు. ఫొటోలు తీయబోతుండగా ముఖాలను దాచుకుని జిల్లా ఫుడ్‌సేఫ్టీ అధికారి తమకు తెలుసునని, కావాలంటే మాట్లాడండి అంటూ ఫోన్‌ కాల్‌ చేసి చేతికి ఇవ్వబోయారు. అయితే పోలీస్‌ స్టేషన్‌లోనే అనుమానాలు నివృత్తి చేసుకుందామంటూ స్థానికులు పేర్కొనగానే ముఖాలు కనిపించకుండా చున్నీలు, కొంగులు అడ్డు పెట్టుకుని ఆటోలో కళ్యాణదుర్గం వైపుగా ఉడాయించారు. ఘటనపై జిల్లా అసిస్టెంట్‌ ఫుడ్‌ కంట్రోల్‌ అధికారి దేవరాజ్‌ను వివరణ కోరగా.. వారంతా నకిలీలని, దుకాణదారులు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని సూచించారు.

రైలు నుంచి జారిపడిన యువకుడు

పెనుకొండ(సోమందేపల్లి): వేగంగా వెళుతున్న రైలు నుంచి ఓ యువకుడు (32) జారి కిందపడ్డాడు. సోమందేపల్లి మండలం చాకార్లపల్లి వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. అపస్మారకంగా పడి ఉన్న యువకుడిని వెంటనే పెనుకొండలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కాళ్లు, చేతులు విరిగాయని డాక్టర్లు వెల్లడించారు.

బీటెక్‌ విద్యార్థిని అదృశ్యం

రాప్తాడు రూరల్‌: అనంతపురం రూరల్‌ మండలం ఉప్పరపల్లికి చెందిన సాంబశివయ్య కుమార్తె సానే దివ్యశ్రీ కనిపించకుండా పోయింది. పోలీసుల సమాచారం మేరకు... ఎస్కేయూ సమీపంలోని అనంతలక్ష్మి ఇంజినీరింగ్‌ కళాశాలలో బీటెక్‌ (సీఎస్‌ఈ–ఏఐఎంఎల్‌) మొదటి సంవత్సరం చదువుతున్న దివ్యశ్రీ ఈ నెల 15న ఉదయం 9.30 గంటల సమయంలో కళాశాలకని ఇంటి నుంచి బయలుదేరి వెళ్లింది. సాయంత్రం తిరిగి ఇంటికి చేరుకోలేదు. ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు కళాశాలలో ఆరా తీశారు. లాభం లేకపోయింది. బంధువులు, పరిచయస్తులను విచారించారు. ఆచూకీ లభ్యం కాకపోవడంతో శనివారం తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇటుకలపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. యువతి ఆచూకీ తెలిసిన వారు 99898 51996, 94901 06738, 94407 96807కు సమాచారం అందించాలని పోలీసులు కోరారు.

Advertisement
 
Advertisement
Advertisement