● ఎమ్మెల్యే బండారు శ్రావణి తీరుపై మాజీ మంత్రి శైలజనాథ్ ఎదుట వాపోయిన మహిళలు
గార్లదిన్నె: తాగునీళ్లడిగితే ముఖం చాటేశారంటూ ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ తీరుపై మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. గార్లదిన్నె మండలం పాపినేపాళ్యంలో శనివారం ఈ ఘటన చోటు చేసుకుంది. మాజీ మంత్రి, శింగనమల నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త డాక్టర్ శైలజనాథ్ శనివారం పాపినేపాళ్యంలో పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలో నెలకొన్న తాగునీటి సమస్యను మహిళలు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. మొన్న ఓ పెళ్లికి ఎమ్మెల్యే బండారు శ్రావణి వెళుతుంటే గ్రామంలో మహిళలంతా కలిసి తాగు నీటి సమస్య వివరించామన్నారు. ఆ సమయంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కేవలం పది రోజుల్లో సమస్యను పరిష్కరిస్తానని భరోసానిచ్చారని, అయితే ఇప్పటి వరకూ గ్రామం వైపుగా ఆమె కన్నెత్తి కూడా చూడలేదని వాపోయారు. ఎమ్మెల్యేగా గెలిచిన ఈ రెండేళ్లలో ఒక్కసారి కూడా తమ గ్రామంలో ఎమ్మెల్యే పర్యటించింది లేదన్నారు. తాగు, సాగు నీరు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నా పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. గ్రామంలో నీటి ట్యాంక్ కట్టించి, ఇంటింటికి కొళాయి ఏర్పాటు చేసేలా చొరవ తీసుకోవాలని శైలజనాథ్‌కు విన్నవించారు. ఈ సందర్భంగా పంచాయతీ అధికారులతో శైలజనాథ్ ఫోన్‌లో మాట్లాడారు. రోజుకు కనీసం 4 ట్యాంకర్లు ఏర్పాటు చేసి నీటిని సరఫరా చేసేలా చొరవ తీసుకోవాలని సూచించారు. తిమ్మంపేట చెరువులో బోరు వేసి పాపినేపాళ్యంకు నీరు అందించాలన్నారు. గ్రామంలో ఇంతటి దారుణమైన పరిస్థితులు నెలకొని ఉంటే ప్రజా ప్రతినిధులు గ్రామంలోకి వచ్చి ప్రజల సమస్యలు వినక పోవడం దారుణమన్నారు. సమస్య పరిష్కారం కాకపోతే వైఎస్సార్‌సీపీ తరపున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో పార్టీ మండల కన్వీనర్ ఎల్లారెడ్డి, వాణిజ్య విభాగం నియోజకవర్గ అధ్యక్షుడు భాస్కరరెడ్డి, నియోజకవర్గ బూత్ కమిటీ అధ్యక్షుడు ఓబిరెడ్డి, నియోజకవర్గ ఎస్సీసెల్ అధ్యక్షుడు ఆంజనేయులు, బీకేఎస్ మాజీ సర్పంచ్ పార్వతి, జెడ్పీటీసీ భాస్కర్, నాయకులు శ్రీనాథ్‌రెడ్డి, నాగరాజు, చీమల శీన, గాంధీ, ఆదినారాయణ, సుంకిరెడ్డి, గ్రామ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


