● ఉపాధ్యాయ ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి
అనంతపురం ఎడ్యుకేషన్: నీట్–2026 ప్రశ్నపత్రం లీకేజీపై ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎంవీ రామచంద్రారెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. లక్షలాదిమంది విద్యార్థులు రాత్రింబవళ్లు కష్టపడి చదివి, కోచింగ్ తీసుకుని పరీక్షలకు సిద్ధమవుతుంటే కొందరు అక్రమ మార్గాల్లో ప్రశ్నపత్రాలను లీక్ చేసి విద్యావ్యవస్థ విశ్వసనీయతపై దెబ్బ తీశారన్నారు. ఇది కేవలం ఒక పరీక్షకు సంబంధించిన అంశం కాకుండా, దేశ భవిష్యత్తును నిర్మించే విద్యార్థుల ఆశయాలపై జరిగిన దాడిగా భావించాల్సి వస్తుందన్నారు. 2025లో జరిగిన ప్రశ్నపత్రం లీక్‌కు సంబంధించిన కొన్ని నిజాలు వెలుగులోకి వస్తున్నాయని పేర్కొన్నారు. ప్రశ్నపత్రం లీకేజీల కారణంగా నిజాయితీతో చదువుకున్న విద్యార్థులు తీవ్ర అన్యాయానికి గురవుతున్నారన్నారు. నీట్ వంటి జాతీయ స్థాయి పరీక్షలపై విద్యార్థులు, ప్రజల్లో నమ్మకం కోల్పోతే అది దేశ విద్యా వ్యవస్థకే ప్రమాదకరమని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో లీకేజీ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా శాశ్వత వ్యవస్థను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. పరీక్ష విధానలో పారదర్శకత, భద్రత, డిజిటల్ సెక్యూరిటీ, ప్రశ్నపత్రాల రవాణా, పరీక్ష కేంద్రాల పర్యవేక్షణ వంటి అంశాల్లో సమగ్ర మార్పులు తీసుకురావాలని సూచించారు.
కుందుర్పి జెడ్పీటీసీ
రాధాస్వామి కన్నుమూత
కుందుర్పి: మండల జెడ్పీటీసీ సభ్యుడు కరిగానిపల్లి రాధాస్వామి(57) శనివారం కన్నుమూశారు. గత ఏడాది మే 8న స్థానిక కేజీబీవీ సమీపంలో చోటు చేసుకున్న ప్రమాదంలో రాధాస్వామికి కాలి విరిగింది. ఆయనతో పాటు ఉన్న వైఎస్సార్‌సీపీ కార్యకర్త, కరిగానిపల్లి పాఠశాల కమిటీ అధ్యక్షుడు రాజు అక్కడికక్కడే మృతి చెందిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి రాధాస్వామి ఇంటికే పరిమితమయ్యారు. ఈ క్రమంలో అనారోగ్యం బారిన పడడంతో బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో కుటుంబసభ్యులు చేర్పించారు. పరిస్థితి విషమించడంతో శనివారం ఆయన కన్నుమూశారు. విషయం తెలుసుకున్న జెడ్పీ చైర్‌పర్సన్ బోయ గిరిజమ్మ, కళ్యాణదుర్గం వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత ఉమామహేశ్వరనాయుడు, కుందుర్పి ఎంపీపీ నాగరాజు, కంబదూరు జెడ్పీటీసీ గుద్దెళ్ల నాగరాజు, అప్పిలేపల్లి సర్పంచ్ అతావుల్లా, మండల మాజీ కన్వీనర్ సత్యనారాయణశాస్త్రి, నాయకులు నరసింహులు, రాము తదితరులు శనివారం రాధాస్వామి భౌతిక కాయంపై పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆదివారం కరిగానిపల్లిలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు రాధాస్వామి సోదరుడు లోకేష్ తెలిపారు.


