స్వాహా సొమ్ములో నీ వాటా ఎంత? | - | Sakshi
Sakshi News home page

స్వాహా సొమ్ములో నీ వాటా ఎంత?

May 17 2026 12:54 AM | Updated on May 17 2026 12:54 AM

బ్రహ్మసముద్రం: కాజేసిన తమ పొదుపు సొమ్ములో నీ వాటా ఎంత? అంటూ టీడీపీ మండల కన్వీనర్‌ పాలబండ్ల శ్రీరాములును పొదుపు సంఘాల మహిళలు నిలదీశారు. బ్రహ్మసముద్రం మండలం ఎర్రకొండాపురంలో ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే... ఇటీవలలా గ్రామానికి చెందిన యానిమేటర్‌ అంజలి భర్త, టీడీపీ కార్యకర్త శ్రీకాంత్‌ మహిళా సంఘాలకు సంబంధించిన రూ.4.50 లక్షలను తన వ్యక్తిగత బ్యాంక్‌ ఖాతాల్లోకి మళ్లించుకుని ఉడాయించాడు. దీంతో బాధిత సభ్యురాళ్ల ఫిర్యాదు మేరకు తామే గ్రామంలోకి వచ్చి విచారణ చేపడతామని వెలుగు సిబ్బంది భరోసానిచ్చారు. ఇందులో భాగంగా శనివారం ఉదయం 11 గంటలకు వెలుగు ఏపీఎం శారద, సీసీ మారెప్ప తదితరులు ఎర్రకొండాపురం చేరుకుని విచారణ చేపట్టారు. ఈ విషయం తెలుసుకున్న టీడీపీ మండల కన్వీనర్‌ పాలబండ్ల శ్రీరాములు, మరికొందరు నాయకులు అక్కడకు చేరుకుని అధికారులను అడ్డుకున్నారు. విచారణ.. గిచారణ ఏమొద్దు, అక్కడి నుంచి తక్షణమే వెళ్లిపోవాలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. యానిమేటర్‌ కాజేసిన రూ.4.50 లక్షలకు మరో రూ.50 వేలు కలిపి తానే కట్టిస్తానని ఈ విషయంపై ఎవరూ ఏదీ మాట్లాడరాదంటూ హుకూం జారీ చేశాడు. ఆ సమయంలో మహిళా సంఘాల సభ్యులు అసహనానికి లోనయ్యారు. తాము కూలి పనులు చేస్తూ భవిష్యత్తు అవసరాలకని పొదుపు చేసుకున్న సొమ్మును యానిమేటర్‌ స్వాహా చేసి వెళితే.. వారికి వత్తాసు పలకడమేమిటంటూ నిలదీశారు. కాజేసిన సొమ్ములో నీ వాటా ఎంత? అంటూ ప్రశ్నించారు. ఆ సమయంలో శ్రీరాములు సర్దిచెప్పబోతే మహిళలు తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. వాటా లేకపోతే ఆ డబ్బును నీవెందుకు కట్టిస్తానని ఒప్పుకుంటున్నావని ధ్వజమెత్తారు. దీంతో తీవ్ర అవమానానికి లోనైన శ్రీరాములు వెంటనే పోలీసులను రప్పించుకున్నాడు. తనపై ఎర్రకొండాపురం గ్రామస్తులు దాడికి ప్రయత్నించారంటూ తప్పుడు కేసు బనాయించే ప్రయత్రానికి తెరదీశాడు. దీంతో పరిస్థితి మరింత దిగజారింది. ఎస్‌ఐ సాయికుమార్‌ జోక్యం చేసుకుని మహిళలకు సర్దిచెప్పి వివాదాన్ని సద్దుమనిపించారు.

టీడీపీ నేతను నిలదీసిన పొదుపు సంఘాల మహిళలు

అక్రమార్కుడిపై ఎలాంటి విచారణ వద్దన్న టీడీపీ మండల కన్వీనర్‌

మండిపడిన మహిళలు

Advertisement
 
Advertisement
Advertisement