జూన్‌ 5 నుంచి ఎస్‌ఐఆర్‌ | - | Sakshi
Sakshi News home page

జూన్‌ 5 నుంచి ఎస్‌ఐఆర్‌

May 17 2026 12:42 AM | Updated on May 17 2026 12:42 AM

అనంతపురం అర్బన్‌: జిల్లాలో ఓటర్ల జాబితాకు సంబంధించి స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజిన్‌ (ఎస్‌ఐఆర్‌) ప్రక్రియ జూన్‌ 5న ప్రారంభం కానుంది. ప్రక్రియను పూర్తి చేసిన ఈ ఏడాది సెప్టెంబరు 22న తుది ఓటర్ల జాబితాను ప్రకటిస్తారు. ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌ను, మార్గదర్శకాలను భారత ఎన్నికల సంఘం విడుదల చేసింది.

షెడ్యూల్‌ ఇలా...

జూన్‌ 5 నుంచి 14 వరకు ఎస్‌ఐఆర్‌ నిర్వహణకు సన్నద్ధత, శిక్షణ, ఫారాల ముద్రణ ప్రక్రియ నిర్వహిస్తారు. జూన్‌ 15 నుంచి జూలై 14 వరకు బీఎల్‌ఓలు ఇంటింటి సర్వే నిర్వహిస్తారు. అదే రోజున పోలింగ్‌ కేంద్రాల హేతుబద్ధీకరణ నిర్వహిస్తారు. జూలై 21న ముసాయిదా ఓటర్ల జాబితా ప్రకటిస్తారు. జూలై 21 నుంచి ఆగస్టు 20 వరకు క్లెయిమ్‌లు, అభ్యంతారాలను స్వీకరిస్తారు. సెప్టెంబరు 18లోగా క్లెయిమ్‌లు, అభ్యంతరాలను పరిష్కరిస్తారు. తుది ఓటరు జాబితాను సెప్టెంబరు 11న విడుదల చేస్తారు.

330 స్కూల్‌ బస్సుల్లో లోపాలు

అనంతపురం సెంట్రల్‌: జిల్లాలో ప్రైవేటు పాఠశాలలకు సంబంధించిన 330 బస్సుల్లో లోపాలు గుర్తించినట్లు ఉప రవాణా కమిషనర్‌ (డీటీసీ) వీర్రాజు తెలిపారు. పాఠశాలలు పునఃప్రారంభమయ్యే సమయానికి సరిదిద్దకపోతే వాటిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. స్కూల్‌ బస్సుల ఫిట్‌నెస్‌పై శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. మోటారు వాహన చట్టం 1988(ఏఐఎస్‌3) ప్రకారం విద్యార్థుల భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా బస్సులు ఉండాలని ఆదేశించారు. గత కొద్దిరోజులుగా జిల్లాలోని రవాణాశాఖ అధికారులను ఐదు బృందాలుగా ఏర్పాటు చేసి స్కూల్‌ బస్సులన్నింటినీ తనిఖీ చేయిస్తున్నట్లు వివరించారు. మొత్తం 680 ప్రైవేటు బస్సులుండగా.. ఇప్పటి వరకూ 584 బస్సులను తనిఖీ చేసినట్లు పేర్కొన్నారు. వీటిలో 254 బస్సులు భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయని తెలిపారు. మిగిలిన 330 బస్సుల్లో లోటుపాట్లు గుర్తించినట్లు తెలిపారు. ఇప్పటికే ఆయా స్కూల్‌ యజామాన్యాలకు ఏడు రోజులు గడువు విధించినట్లు తెలిపారు. లోపాలు సవరించుకుని మళ్లీ రవాణా అధికారుల ముందు తనిఖీ చేయించుకోవాలని సూచించారు. ఈ నెల 25లోగా అన్ని బస్సులకూ ఏటీఎస్‌ సెంటర్‌లో ఫిట్నెస్‌ సర్టిఫికెట్లు పొందాలని తెలిపారు. రవాణాశాఖ నిబంధనలు పాటించకపోతే ఆయా బస్సులను సీజ్‌ చేయడంతో పాటు యాజమాన్యాలపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బస్సుల్లో విద్యార్థుల భద్రతకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు పాటించాలని, ప్రమాద రహిత డ్రైవింగ్‌పై డ్రైవర్లకు అవగాహన కల్పించాలని సూచించారు.

ఏపీ ఐసెట్‌ ఫలితాల విడుదల

అనంతపురం: ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో అడ్మిషన్లకు నిర్వహించిన ఏపీ ఐసెట్‌ –2026 ఫలితాలు విడుదల అయ్యాయి. అనంతపురం జిల్లాలో పురుషులు 1,022 మంది దరఖాస్తు చేసుకోగా, 923 మంది హాజరయ్యారు. వీరిలో 771 మంది అర్హత సాధించారు. మహిళలు 977 మంది దరఖాస్తు చేసుకోగా, 882 మంది హాజరయ్యారు. 782 మంది ఉత్తీర్ణత సాధించారు. అనంతపురం జిల్లాకు చెందిన నల్లపాటి హర్షవర్ధన్‌ రాష్ట్రస్థాయిలో 9వ ర్యాంకు సాధించాడు. పామిడి టీచర్స్‌ కాలనీకి చెందిన రాజేంద్ర కుమారుడు నల్లపాటి హర్షవర్ధన్‌ 155 మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో 9వ ర్యాంకు సాధించి సత్తా చాటాడు.

మామిడి టన్ను రూ.29 వేలు

అనంతపురం అగ్రికల్చర్‌: అనంతపురం రూరల్‌ పరిధిలోని కక్కలపల్లి మామిడి మార్కెట్‌లో శనివారం టన్ను గరిష్ట ధర రూ.29 వేలు పలికింది. మార్కెట్‌కు 320 టన్నుల కాయలు అమ్మకానికి వచ్చాయని రాప్తాడు మార్కెట్‌ కమిటీ సెక్రటరీ రూప్‌కుమార్‌ తెలిపారు. ఇందులో బేనీషా రకం మామిడి టన్ను గరిష్ట ధర రూ.29 వేలు, కనిష్టం రూ.9 వేలు, సరాసరి రూ.15 వేల ప్రకారం క్రయవిక్రయాలు జరిగాయని పేర్కొన్నారు. హిమాయాత్‌ రకం టన్ను గరిష్టం రూ.24 వేలు, కనిష్టం రూ.9 వేలు, సరాసరి రూ.17 వేలు, మల్లిక రకం టన్ను గరిష్టం రూ.23 వేలు, కనిష్టం రూ.8 వేలు, సరాసరి రూ.14 వేలు చొప్పున అమ్మకాలు సాగాయని చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement