ప్రజల ప్రాణాలతో చెలగాటం | - | Sakshi
Sakshi News home page

ప్రజల ప్రాణాలతో చెలగాటం

May 17 2026 12:42 AM | Updated on May 17 2026 12:42 AM

లైసెన్స్‌ ఒకరిది.. మెడికల్‌ షాపు మరొకరిది

నిబంధనలకు పాతరేస్తున్న నిర్వాహకులు

అనంతపురం: మెడికల్‌ షాపుల్లో ఫార్మసిస్ట్‌ సర్టిఫికెట్‌ ఒకరిదైతే.. మరొకరు నిర్వహిస్తున్నారు. కనీసం డీ ఫార్మసీ, బీ ఫార్మసీ లేకుండా యాంటీ బయాటిక్స్‌, షెడ్యూల్‌ –హెచ్‌, హెచ్‌–1 డ్రగ్స్‌ను సైతం ప్రిస్క్రిప్షన్‌ లేకపోయినా దుకాణాలు, ఆస్పత్రుల్లో జోరుగా విక్రయాలు సాగిస్తున్నారనే ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. ప్రజల ఆరోగ్యంతో నేరుగా సంబంధం ఉన్న మెడికల్‌ షాపుల్లో అనేక చోట్ల నిబంధనలు గాలికి వదిలేస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. డ్రగ్స్‌ అండ్‌ కాస్మెటిక్స్‌ చట్టం ప్రకారం లైసెన్స్‌ పొందిన ఫార్మసిస్టు లేకుండా మందుల విక్రయం చేయడం నిబంధనలకు విరుద్ధం. ముఖ్యంగా యాంటీ బయాటిక్స్‌, స్టెరాయిడ్స్‌ వంటి మందులు వైద్యుల సూచన లేకుండా అమ్మడం ప్రజల ఆరోగ్యానికి ప్రమాదకరంగా మారింది. గ్రామీణ ప్రాంతాల్లో ఈ పరిస్థితి మరింత ఎక్కువగా ఉందని ఆరోగ్యశాఖ వర్గాలు చెబుతున్నాయి. కొన్ని మెడికల్‌ షాపుల్లో లెసెన్స్‌ ఒకరిపేరుతో తీసుకుని, నిర్వహణ మాత్రం అర్హతలు లేని వ్యక్తులు చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. తనిఖీల సమంయలో మాత్రమే రిజిస్టర్డ్‌ ఫార్మసిస్టులను చూపించి, మిగతా సమయాల్లో అనుభవం లేని సిబ్బందితో దుకాణాలు నడిపిస్తున్నట్లు సమాచారం. అనంతపురం నగరంతో పాటు రాయదుర్గం, తాడిపత్రి, ఉరవకొండ, గుంతకల్లు తదితర ప్రాంతాల్లో ఈ పరిస్థితి ఉంది.

● డాక్టర్ల ప్రిస్క్రిప్షన్‌ లేకుండా మందులు సులభంగా అందుబాటులోకి రావడం వల్ల యువతలో మందుల దుర్వినియోగం పెరుగుతోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాల్సిన అధికార యంత్రాంగం తరచూ తనిఖీలు నిర్వహించి, నిబంధనలు ఉల్లంఘిస్తున్న మెడికల్‌ షాపులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ప్రతి మెడికల్‌ షాపులో రిజిస్టర్డ్‌ ఫార్మసిస్టు వివరాలు స్పష్టంగా ప్రదర్శించాలని డిమాండ్‌ చేస్తున్నారు.

● జిల్లాలో 2,100 మెడికల్‌ స్టోర్లు ఉన్నాయి. ఇందులో సింహభాగం సర్టిఫికెట్‌/ లైసెన్స్‌ ఒకరి పేరు మీద ఉంటే.. విక్రయించేది మరొకరు. కొంతమంది యజమానులు లైసెన్స్‌ తీసుకుని, దుకాణాలను అనుభవం లేని సిబ్బందితో నడిపిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement