యాడికి: తాగునీటి సమస్య గురించి అధికారులు పట్టించుకోకపోవడంతో రాయలచెరువు గ్రామానికి చెందిన ఎస్‌బీఐ కాలనీ మహిళలు శనివారం రోడ్డెక్కి నిరసన తెలిపారు. గుత్తి – తాడిపత్రి మార్గంలో బైఠాయించి రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ గ్రామానికి గ్రామపంచాయతీ, శ్రీసత్యసాయి రక్షిత తాగునీటి పథకం ద్వారా నీరందేదన్నారు. అయితే మూడు నెలలుగా పంచాయతీ బోరులో నీరు తగ్గిపోయిందన్నారు. అప్పటి నుంచి శ్రీసత్యసాయి నీటిపైనే ఆధారపడ్డామన్నారు. ఐదు రోజులుగా కార్మికులు జీతాల కోసం సమ్మె బాట పట్టడంతో నీటి సరఫరా ఆగిపోయిందన్నారు. దీంతో తాగునీటి ఇబ్బందులు ఒక్కసారిగా రెట్టింపయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. పంచాయతీ అధికారులకు సమస్యను తెలిపినా పరిష్కారానికి చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. రాస్తారోకో కారణంగా ట్రాఫిక్ స్తంభించిపోవడంతో ఈఓపీఆర్‌డీ శశికళ, పంచాయతీ కార్యదర్శి అరుణ్ కుమార్ వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. రెండు రోజుల నుంచి ట్యాంకరు ద్వారా నీటిని సరఫరా చేస్తున్నామని, అయితే కొన్ని ఇళ్లకు నీరందలేదని తమ దృష్టికి వచ్చిందన్నారు. త్వరలోనే ప్రతి ఇంటికీ తాగునీరు అందించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దీంతో మహిళలు శాంతించి ఆందోళన విరమించారు.


