ఉరవకొండలో అర్ధంతరంగా ఆగిన ఓ ఇంటి నిర్మాణం
ఉరవకొండ: సామాన్య, మధ్య తరగతి ప్రజలకు సొంతిల్లు కలగానే మిగిలిపోతోంది. గృహ నిర్మాణ ఖర్చు మోయలేని భారంగా మారింది. పట్టపగ్గాల్లేకుండా పెరుగుతున్న ఇటుకలు, ఇసుక, సిమెంట్, ఇనుము వంటి ప్రధాన సామగ్రి ధరలతో ఇల్లు నిర్మించాలనే ఆలోచన చేయాలంటే కూడా బెంబేలెత్తుతున్నారు. ముందుగా నిర్ణయించిన బడ్జెట్‌తో ఇల్లు పూర్తి చేయడం అసాధ్యమవుతుండడంతో చేసేదిలేక కొందరు పనులను మధ్యలోనే నిలిపేస్తున్నారు.
వామ్మో మరీ ఇంతలానా...!
రెండు సంవత్సరాల క్రితం టన్ను రూ. 48 వేల నుంచి రూ. 52 వేలు పలికిన స్టీలు నేడు రూ. 60 వేల నుంచి రూ. 68 వేలకు చేరింది. సిమెంట్ ధరలు కూడా స్థిరంగా లేవు. గతంలో నాణ్యతను బట్టి రూ. 270– రూ.350 మధ్య లభించిన బస్తా ప్రస్తుతం రూ. 380 నుంచి రూ.420 మధ్య కదలాడుతోంది. ఇటుకల ధరలు గతంలో వెయ్యికి రూ.5 వేలు– రూ. 8 వేలు ఉండగా, నేడు రూ. 7 వేలు– రూ. 9వేలకు పెరిగాయి. టేక్ వుడ్ మెయిన్ డోర్ ధర గతంలో రూ. 25 వేల నుంచి రూ.35 వేల మధ్య ఉండగా, ఇటీవల రూ.40 వేల నుంచి రూ. 70 వేలకు పెరిగింది. యూపీవీసీ కిటీకీల ధర చదరపు అడుగుకు రూ.350 నుంచి రూ.550 వరకు పలుకుతోంది. ప్లాస్టిక్ పైపుల ధరలు 50 శాతం వరకు పెరిగాయి. ఒక అంగుళం పైపు రూ.400 నుంచి రూ. 550 వరకు ఉంది. మెటల్ (కంకర) ధరలు ట్రాక్టర్ లోడుకు గతంలో రూ. 1,500– రూ.2,000 మధ్య ఉండగా ప్రస్తుతం రూ. 2,500 నుంచి రూ. 4 వేలు, టిప్పర్ లోడు అయితే రూ. 8,500 నుంచి రూ. 10 వేలకు చేరాయి. ఈ క్రమంలో నిర్మాణపు ఖర్చు ఒక్కసారిగా ఆకాశానికి చేరినట్లయింది. చదరపు అడుగు నిర్మాణానికి ఏకంగా రూ. 2,200 నుంచి రూ. 3 వేలు ఖర్చు చేయాల్సి వస్తోంది. వీటికి తోడు తాజాగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం నిర్మాణ రంగానికి మరింత శాపంగా మారింది.
ఉచిత ఇసుక ఉత్తిదే..
చంద్రబాబు ప్రభుత్వం ఇసుకను ఉచితంగా అందిస్తున్నామని చెబుతున్నా ఎక్కడా అమలు కావడం లేదు. ట్రాక్టర్ లోడుకు రూ. 3 వేల నుంచి రూ. 5 వేల వరకు, లారీ అయితే రూ. 8 వేల నుంచి రూ. 15 వేల వరకూ వెచ్చించాల్సి వస్తోంది. ఉచిత ఇసుక పాలసీ టీడీపీ నేతలకు వరంగా మారింది. ఇసుకను అక్రమంగా కొల్లగొడుతూ జేబులు నింపుకుంటున్నారు.
వారి పరిస్థితి దయనీయం..
పెరుగుతున్న సామగ్రి ధరలు కేవలం గృహ నిర్మాణ రంగంపైనే కాకుండా మొత్తం నిర్మాణ రంగంపై ప్రభావం చూపుతోంది. దీంతో చిన్న కాంట్రాక్టర్లు, మేసీ్త్రలు పనులు దొరక్క ఇబ్బందులు పడుతున్నారు. రోజు కూలితో జీవనం సాగించే కార్మికుల పరిస్థితి దయనీయంగా మారింది. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రియల్ ఎస్టేట్ రంగం కూడా మందగమనంలో సాగుతుండడంతో కొత్త ప్రాజెక్టులు ప్రారంభించడానికి డెవలపర్లు వెనుకంజ వేస్తున్నారు. దీంతో వలస కూలీలు తిరిగి స్వగ్రామాలకు వెళ్లే దుస్థితి దాపురించింది.
పట్టపగ్గాల్లేకుండా పెరుగుతున్న నిర్మాణ సామగ్రి ధరలు
ఇంటి నిర్మాణమంటేనే బెంబేలెత్తుతున్న
సామాన్య, మధ్య తరగతి ప్రజలు
ఇప్పటికే మొదలుపెట్టిన పనులనూ గత్యంతరం లేక నిలిపేస్తున్న వైనం


