● పంచాయతీ పారిశుధ్య కార్మికులకు అందని వేతనాలు
అనంతపురం ఎడ్యుకేషన్: జిల్లా వ్యాప్తంగా గ్రామ పంచాయతీల్లో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులు, స్వచ్ఛభారత్ కార్మికులు, గ్రీన్ అంబాసిడర్లు, బిల్ కలెక్టర్లు, వాటర్‌మెన్లు, ఎలక్ట్రీషియన్లు నెలల తరబడి జీతాలు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుతూ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతున్న కార్మికుల పరిస్థితి రోజురోజుకూ దయనీయంగా మారుతోంది. జిల్లాలో 1,600 మందికి పైగా పంచాయతీ కార్మికులు పనిచేస్తున్నారు. వీరిలో స్వచ్ఛభారత్ కార్మికులకు నెలకు రూ. 6 వేలు, తక్కిన వారికి రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకు జీతాలు వస్తున్నాయి. ఈ అరకొర వేతనాలతోనే కుటుంబాలను పోషిస్తున్నారు. ప్రస్తుతం ఉరవకొండ పంచాయతీలో ఒక నెల జీతం బకాయి ఉండగా, మిగతా అన్ని పంచాయతీల్లో 2–6 నెలల వరకు వేతనాలు పెండింగ్‌లో ఉన్నాయని కార్మికులు వాపోతున్నారు. ప్రతిరోజూ తెల్లవారుజామునే చెత్త తొలగింపు, మురుగునీటి కాలువల శుభ్రపరిచే పనులు, మరుగుదొడ్ల పరిశుభ్రత వంటి అత్యంత క్లిష్టమైన పనులు చేస్తున్నప్పటికీ, కష్టానికి తగిన గౌరవం దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కళ్లలో కన్నీళ్లు..
జీతాలు అందకపోవడంతో ఇంటి అద్దెలు చెల్లించలేక, కరెంటు బిల్లులు పెండింగ్‌లో పడిపోయి, పిల్లల చదువుల ఫీజులు కట్టలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వాపోతున్నారు. కొందరు అప్పులు చేసి జీవనం సాగిస్తుండగా, మరికొందరు కుటుంబ పోషణకే ఇబ్బందులు పడుతున్న పరిస్థితి నెలకొంది. లక్షల్లో జీతాలు తీసుకునే ఉద్యోగులకు ఒక నెల జీతం ఆలస్యమైనా ఆందోళన చెందు తుంటారని, అలాంటిది రోజంతా మురికి మధ్య పని చేసే తమకు ఆర్నెళ్ల జీతాలు ఆపేయడం ఎంతవరకు న్యాయమని కార్మికులు ప్రశ్నిస్తున్నారు. ఇటీవల పలువురు కార్మికులు పీజీఆర్‌ఎస్‌లో కలెక్టర్ ఆనంద్‌ను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. పెండింగ్ వేతనాలు వెంటనే విడుదల చేయాలని, తమ కుటుంబాలను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే పారిశుధ్య సైనికుల పట్ల ప్రభుత్వం ఇప్పటికైనా మానవతా దృక్పథంతో స్పందించి, పెండింగ్ జీతాలను విడుదల చేయాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ‘మా చేతులు గ్రామాలను శుభ్రం చేస్తున్నాయి, మా కళ్లలో మాత్రం కన్నీళ్లు నిండుతున్నాయి’ అనే కార్మికుల మాటలు అధికార యంత్రాంగానికి కనువిప్పు కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
కొందరికే అందలేదు
అన్ని ప్రాంతాల్లో జీతాలు పడ్డాయి. ఎక్కడైనా కొందరికే పడకపోయి ఉండొచ్చు. బడ్జెట్ లేని పంచాయతీల్లో పెండింగ్ ఉండొచ్చు. గ్రాంటు లేదు. వస్తే వెంటనే చెల్లిస్తాం. మొదటి ప్రాధాన్యతగా తీసుకుని వారికి జీతాలు చెల్లించేలా చర్యలు తీసుకుంటాం.
– నాగరాజనాయుడు, డీపీఓ


