విడపనకల్లు: ద్విచక్ర వాహనాలు పరస్పరం ఢీకొన్న ఘటనలో ఓ వృద్ధుడు దుర్మరణం పాలయ్యాడు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. విడపనకల్లు మండలం పాల్తూరు గ్రామ శివారున ఈ ఘటన చోటు చేసుకుంది. ఉరవకొండ మండలం వ్యాసాపురం గ్రామానికి చెందిన రాజన్న, నల్లారెడ్డి ఇద్దరూ ఒకే ద్విచక్ర వాహనంపై శుక్రవారం పాల్తూరు నుంచి స్వగ్రామానికి బయలుదేరారు. గాజుల మల్లాపురం సమీపంలోని పెద్ద వంక వద్దకు చేరుకోగానే ఎదురుగా వస్తున్న పంపన్న గౌడ్ (67) ద్విచక్ర వాహనం, రాజన్న బైక్ పరస్పరం ఢీకొన్నాయి. ఘటనలో బైక్ మీద నుంచి కిందపడి తలకు తీవ్ర గాయం కావడంతో పంపన్న గౌడ్ అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్రంగా గాయ పడిన రాజన్న, నల్లారెడ్డిని అటుగా వెళుతున్న వారు వెంటనే ఉరవకొండలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఘటనపై పాల్తూరు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.


