మాట నిలబెట్టుకున్న గురువు | - | Sakshi
Sakshi News home page

మాట నిలబెట్టుకున్న గురువు

May 16 2026 12:51 AM | Updated on May 16 2026 12:51 AM

రాప్తాడు రూరల్‌: విద్యార్థులు పెద్ద లక్ష్యాలు నిర్దేశించుకుని చదవాలని ప్రోత్సహిస్తూ ఇచ్చిన మాటను నిలబెట్టుకుని ఓ ఉపాధ్యాయుడు ఆదర్శంగా నిలిచారు. వివరాల్లోకి వెళితే.. రాప్తాడు మండలం గొందిరెడ్డిపల్లి జెడ్పీహెచ్‌ఎస్‌లో ఇంగ్లిష్‌ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న బీకే నారాయణ.. 10వ తరగతి పబ్లిక్‌ పరీక్షల్లో 550 మార్కులకు పైగా సాధించిన విద్యార్థులకు తన సొంత ఖర్చులతో విమాన ప్రయాణం చేయిస్తానని ప్రకటించారు. ఈ ప్రకటన విద్యార్థుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. పట్టుదలతో చదువుకున్న విద్యార్థిని ఈ.రాజిత 563 మార్కులు సాధించడంతో శుక్రవారం ఉదయం 7 గంటలకు తన సతీమణి పద్మావతి (వ్యవసాయ శాఖ సూపరింటెండెంట్‌)తో కలిసి రాజితను బెంగళూరు నుంచి విజయవాడకు విమానంలో ఉపాధ్యాయుడు నారాయణ పిలుచుకెళ్లారు. విజయవాడలో కనకదుర్గ అమ్మవారి దర్శనం చేయించడంతో పాటు ప్రసిద్ధ ఉండవల్లి గుహలను చూపించారు. సాధారణ కుటుంబానికి చెందిన ఓ ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని తొలిసారి విమానంలో ప్రయాణించడం ఆమెకు జీవితాంతం గుర్తుండిపోయే అనుభూతిగా మారింది.

1 నుంచి ప్రభుత్వ భవనాలకు ప్రీ పెయిడ్‌ స్మార్టు మీటర్లు

అనంతపురం టౌన్‌: ప్రభుత్వ కార్యాలయాల విద్యుత్‌ సర్వీసులకు జూన్‌ 1 నుంచి ప్రీ పెయిడ్‌ మీటర్లను అమల్లోకి తీసుకువస్తున్నట్లు ఏపీ ఎస్పీడీసీఎల్‌ సీఎండీ శివశంకల్‌ లోతేటి తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. అనంతపురం జిల్లాలో 8,422, శ్రీ సత్యసాయి జిల్లాలో 7,002 సర్వీసులకు ప్రీ పెయిడ్‌ విధానంలో విద్యుత్‌ సరఫరా అవుతుందన్నారు. ఈ విధానంలో వినియోగదారుల్లో జవాబుదారీతనం మరింత మెరుగుపడుతుందన్నారు. రోజువారీ విద్యుత్‌ వినియోగం ఏ స్థాయిలో ఉందో సులువుగా తెలుసుకోవచ్చని, దీంతో విద్యుత్‌ను పొదుపుగా వినియోగించుకునేందుకు అవకాశం ఉంటుందన్నారు. స్మార్ట్‌ మీటర్‌ సర్వీసులను గ్రూప్‌గా ఏర్పాటు చేసి ఈ–వాలెట్‌ ద్వారా రీచార్జ్‌ చేసుకునే సౌలభ్యాన్ని కల్పిస్తామన్నారు. విద్యుత్‌ చార్జీలు, స్థిర చార్జీల అడ్వాన్స్‌ మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుందన్నారు. ప్రతి వినియోగదారునికి ఎస్‌ఎంఎస్‌ రూపంలో మొబైల్‌కు ఎప్పటికప్పుడు సమాచారం అందుతుందని, బ్యాలెన్స్‌ సున్నాకు చేరినప్పుడు విద్యుత్‌ సరఫరా నిలిచిపోతుందని తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement